Drugs Siezed in Hyderabad: న్యూ ఇయర్ వేడుకల వేళ హైదరాబాద్ (Hyderabad)లో డ్రగ్స్ కలకలం రేపాయి. జూబ్లీహిల్స్ (Jubileehills)లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఢిల్లీ, పంజాబ్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు తెలిపారు. 100 గ్రాముల ఎండీఎంఏ (MDMA), 26 గ్రాముల కొకైన్, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్ సీజ్ చేశారు. పంజాబ్ లోని ఓ ప్రముఖ యూనివర్శిటీలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు నవీన్, సాయిలను అరెస్ట్ చేశారు. న్యూ ఇయర్ కోసం పెద్ద ఎత్తున డ్రగ్స్ విక్రయించేందుకు తెచ్చినట్లు తెలుస్తోంది. కాగా, హైదరాబాద్ లో బ్రౌన్ షుగర్ బయటపడడం ఇదే తొలిసారి. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి అప్పులు చేసి వాటిని తీర్చేందుకు ఇలా డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.


మీర్ పేటలోనూ


నగరంలోని మీర్ పేటలోనూ డ్రగ్స్ తరలిస్తోన్న ముఠాను ఎల్బీనగర్ ఎస్ వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో మత్తు పదార్థాలు విక్రయించేందుకు ముగ్గురు సభ్యుల ముఠా ప్రయత్నాలు చేస్తుండగా, పక్కా సమాచారంతో వారిని పట్టుకున్నారు. రాజస్థాన్ నుంచి ఈ ముఠా డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి 15 గ్రాముల హెరాయిన్, రూ.10 వేలు, ఓ బైక్, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.


రాజేంద్రనగర్ లోనూ పట్టివేత


అటు, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఇంట్లో ఎస్ వోటీ పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. శివరాంపల్లిలోని ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఇంట్లో రూ.2 లక్షల విలువైన 7.5 గ్రాముల డ్రగ్స్ ను పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ బెంగుళూరు నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చినట్లు గుర్తించారు.


పటిష్ట నిఘా


న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డ్రగ్స్ సరఫరాపై పోలీసులు పటిష్ట నిఘా ఉంచారు. ఔటర్ రింగ్ రోడ్డుపై వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. డ్రగ్స్ సేవిస్తే గుర్తించేందుకు ప్రత్యేక పరికరాలు తెప్పించారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నారన్న అనుమానం వస్తే అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే, ఆదివారం రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నారు. తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 120 ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టనున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. అటు, పబ్బులు, హోటళ్లు, ఈవెంట్స్ నిర్వాహకులకు కఠిన నిబంధనలు విధించారు. మైనర్లకు లిక్కర్ సప్లై చేయకూడదని, పబ్బుల్లో పరిమితికి మించి పాసులు జారీ చెయ్యొద్దని స్పష్టం చేశారు. పార్కింగ్, భద్రత అంశాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, సీసీలు ఏర్పాటు చేయాలని సూచించారు.


కఠిన నిబంధనలు 


తాగి వాహనాలు నడిపి పట్టుబడితే వారికి రూ.10 వేల జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తామని పోలీసులు హెచ్చరించారు. మద్యం సేవించిన వారు వాహనం నడపకుండా తాగని వారిని వెంట తెచ్చుకోవాలని లేకుంటే క్యాబ్స్, ఆటోలను ఆశ్రయించాలని సూచించారు. పబ్ లో ఎక్కడా డార్క్  ఏరియా, అన్ కవర్డ్ ఏరియా ఉండకూడదని స్పష్టం చేశారు. అప్పటికే మద్యం సేవించి పబ్ లోపలికి వచ్చే వారిని అనుమతించకూడదని, అలాంటి వారికి మళ్లీ తాగించకూడదని చెప్పారు. మహిళల భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎవరైనా మద్యం సేవించి వారి కారులో డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.


Also Read: Hyderabad Cab Booking: క్యాబ్ డ్రైవర్స్ మీ రైడ్ క్యాన్సిల్‌ చేస్తే ఈ నంబర్‌కు ఇలా కంప్లైంట్ చేయండి - పోలీసులు