క్యాబ్ కోసం బుక్ చేసుకున్న రైడ్ ను డ్రైవర్ క్యాన్సిల్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీసులు తేల్చి చెప్పారు. ఆన్ లైన్ వెహికిల్ బుకింగ్ యాప్‌లో తరచూ రైడ్ బుక్ చేసుకొనే వారికి ఇలాంటి సమస్యలు ఎదురయ్యే ఉంటాయి. గమ్య స్థానం దూరంగా ఉందనో, ఇతర కారణాలతో డ్రైవర్లు కస్టమర్ బుక్ చేసుకున్న రైడ్ ను క్యాన్సిల్ చేస్తుంటారు. చికాకు తెప్పించే ఈ అనుభవాన్ని దాదాపు క్యాబ్ సర్వీసులు ఉపయోగించుకొనే అందరూ ఎదుర్కొనే ఉంటారు.


అయితే, న్యూ ఇయర్ వేడుకల వేళ ఇలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. క్యాబ్‌ డ్రైవర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ రైడ్‌ నిరాకరించకూడదని.. ఇది మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్‌ 178 ప్రకారం ఉల్లంఘన అవుతుందని చెప్పారు. రైడ్ క్యాన్సిల్ చేసి ఉల్లంఘించిన వారికి రూ.500 జరిమానా ఉంటుందని చెప్పారు. ఎవరైనా ఇలాంటి ఉల్లంఘనకు పాల్పడితే సదరు క్యాబ్ లేదా ఆటో నంబర్‌, టైం, ప్రదేశం లాంటి వివరాలతో 8712662111 నెంబరుకు వాట్సాప్‌ లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజలతో డ్రైవర్లు అసభ్యకరంగా ప్రవర్తించకూడదని.. అలాగే ఎలాంటి అదనపు ఛార్జీలు డిమాండ్‌ చేయకూడదని హెచ్చరించారు. క్యాబ్స్‌, టాక్సీ, ఆటో డ్రైవర్లు కచ్చితంగా తమ యూనిఫామ్‌ ధరించాలని అన్నారు. అదేవిధంగా బండికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు వెంట ఉంచుకోవాలని సూచించారు.


న్యూఇయర్‌ వేడుకలు ప్రజలు ఎలాంటి ఆటంకాలు లేకుండా, ప్రమాదాలు జరగకుండా చేసుకొనేందుకు పోలీసులు భద్రతను పెంచారు. ప్రధాన జంక్షన్ల వద్ద వెహికిల్‌ చెకింగ్‌, డ్రంకెన్‌ డ్రైవ్‌ చెకింగ్‌లను రాత్రి 8 నుంచే మొదలుపెట్టనున్నారు. ప్రతి క్యూఆర్‌టీ టీమ్‌ల వద్ద వీడియో కెమెరాలను ఉంచుతున్నారు. ఎలాంటి సంఘటనలు జరిగిన రికార్డు చేస్తారు. ఈ టీమ్‌లు జిల్లాలోని పబ్స్‌, రిసార్ట్స్‌, హోటల్‌, ఫామ్‌ హౌస్‌ల వద్ద తనిఖీలు చేస్తారు. ప్రజలు పోలీస్‌ సిబ్బందికి సహకరించి తగిన జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు.