Joe Biden Slams Russia: 


అణుయుద్ధాల ప్రసక్తే రాకూడదు: బైడెన్


రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న తీరుని అన్ని దేశాలూ వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా మొదటి నుంచి రష్యాపై కారాలు మిరియాలు నూరుతోంది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి రష్యాపై విరుచుకుపడ్డారు. "నిబంధనలు ఉల్లంఘించి మరీ రష్యా యుద్ధానికి దిగటం సిగ్గుచేటు" అని తీవ్రంగా వ్యాఖ్యానించారు బైడెన్. ఇదే సమయంలో అణుయుద్ధాల గురించి ప్రస్తావించారు. ఈ యుద్ధాన్ని రష్యా గెలవలేదని, సైనిక చర్యని నియంత్రించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఐరాస భద్రతా మండలి (UN Security Council)తో మాట్లాడిన సందర్భంలో మరి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు బైడెన్. "అణుయుద్ధాలు గెలవలేం. అసలు అలాంటి యుద్ధాలకు దిగటమే సరికాదు" అని అన్నారు. "బాధ్యతా రాహిత్యంగా అణుయుద్ధాల గురించి ప్రకటనలు చేస్తున్నారు" అంటూ రష్యాను విమర్శించారు. ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాలను రష్యాలో కలుపుకునేందుకు "Sham referenda"ను ఈ వారం రోజుల్లో ప్రవేశపెట్టాలని చూస్తున్నారు పుతిన్. దీనిపైనే జో బైడెన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.  ఐరాస  భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న రష్యా..నిబంధనలు ఉల్లంఘించి ఉక్రెయిన్ సార్వభౌమాత్వాన్ని చెరిపేసేందుకు చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూఎన్‌ చార్టర్‌లోని నిబంధనలనూ ఖాతరు చేయటం లేదని అన్నారు. అలాంటి పరిస్థితులే వస్తే అమెరికా సైనిక చర్యలకైనా దిగేందుకు సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు. 


భద్రతా మండలి విస్తరించటంపై..


అంతే కాదు. టెహ్రాన్ (Tehran) అణ్వాయుధాలు సమకూర్చుకోవటాన్నీ అనుమతించేది లేదని స్పష్టం చేశారు బైడెన్. ఇదే సమయంలో ఐరాస భద్రతా మండలిని విస్తరించాలన్న ఆలోచనకు మద్దతునిచ్చారు. ఆఫ్రిరా, లాటిన్‌ అమెరికా ప్రాతినిధ్యమూ ఉండేలా చూడాలన్న ప్రతిపాదనకు అంగీకరించారు. "శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాల సంఖ్య పెంచేందుకు అమెరికా ఎప్పుడూ మద్దతుగా నిలుస్తుంది" అని ఐరాస జనరల్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇస్తే బాగుంటుందనీ అన్నారు. అమెరికా ఈ నిర్ణయానికి సపోర్ట్ చేస్తుందని చెప్పారు. ఇరాన్‌లో మహిళలు హిజాబ్‌పై నిరసనలు చేపడుతుండటాన్నీ ప్రస్తావించారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. అక్కడి మహిళలకు మద్దతుగా నిలుస్తామని చెప్పారు. వాళ్ల ప్రాథమిక హక్కుల్ని పరిరక్షించుకునే హక్కు వారికి ఉందని అభిప్రాయపడ్డారు. 


రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలై దాదాపు 7 నెలలు పూర్తవుతోంది. అయితే ఇప్పటికే రష్యా తన లక్ష్యాన్ని చేరుకోలేదు. దీంతో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యా సైన్యంలోకి 3 లక్షల మంది 'రిజర్వ్స్' తిరిగి పిలుస్తున్నారు. గతంలో సైన్యంలో పని చేసి ప్రస్తుతం పౌర జీవితంలో ఉన్నవారిని 'రిజర్వ్స్' అంటారు. వీరి సేవలను ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో ఉపయోగించు కోనున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో పుతిన్ అన్నారు. రష్యా అనుకున్నది సాధించే వరకు వెనక్కి తగ్గేదే లేదన్నారు.