Jharkhand: 


ఝార్ఖండ్‌లో సర్వే..


కొవిడ్‌ వల్ల విద్యారంగం బాగా దెబ్బ తింది. దాదాపు ఏడాది పాటు ఆన్‌లైన్ బోధన కొనసాగింది. చాలా మంది విద్యార్థులు సౌకర్యాలు లేక ఈ విద్యాబోధనకు దూరమయ్యారు. ఇక ప్రభుత్వ విద్యా సంస్థల్లోని పిల్లల చదువులు అటకెక్కాయి. ఫలితంగా...పలు రాష్ట్రాల్లోని విద్యార్థులు వెనకబడిపోయారు. ఝార్ఖండ్ ఇప్పుడిదే సమస్య ఎదుర్కొంటోంది. ఇప్పటికే...పాఠశాలల్లో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు ఉపాధ్యాయులు, పిల్లలు. కొవిడ్ తరవాత పరిస్థితులు మరీ అధ్వానంగా తయారయ్యాయి. 138 ప్రైమర్, అప్పర్ ప్రైమర్ స్కూల్స్‌లో సర్వే చేపట్టగా...ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలా స్కూల్స్‌లో ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ తరవాతా వాళ్లు చదవడం, రాయడం పూర్తిగా మర్చిపోయారని చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాఠశాలలు రీఓపెన్ అయ్యాయి. అప్పటికే చదవడం, రాయడం పూర్తిగా మర్చిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు ఉపాధ్యాయులు. కొంతమందిపై ప్రత్యేకంగా శ్రద్ధ
తీసుకుని మళ్లీ వారికి మొదటి నుంచి అన్నీ నేర్పించామని వివరించారు.  


Gyan Vigyan Samiti Jharkhand (GVSJ) సంస్థ ఈ సర్వే చేపట్టింది. ప్రభుత్వ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్స్‌పైనే ఎక్కువగా దృష్టి సారించింది. ఈ పాఠశాలల్లో 50%కి పైగా వెనకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులే ఉన్నారు. 2020-21 విద్యా సంవత్సరంపై కరోనా ప్రభావం బాగా పడిందని, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్స్‌ దాదాపు రెండేళ్ల పాటు మూసివేయాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. 
ప్రపంచంలో మరెక్కడా ఇన్ని రోజుల పాటు పాఠశాలలు బంద్ చేయలేదని గుర్తు చేశారు. ఈ కారణంగా...చాలా పాఠశాలల్లో మౌలిక వసతులూ దెబ్బ తిన్నాయని చెప్పారు. 138 స్కూల్స్‌లో సర్వే చేపట్టగా...వీటిలో 20% స్కూల్స్‌లో ఒకే ఉపాధ్యాయుడు అందుబాటులో ఉన్నారు. ఇక దళితులు,ఆదివాసీలు నివసించే ప్రాంతాల్లోని బడుల్లో 90% మంది విద్యార్థులకు ఒకరే ఉపాధ్యాయుడు అందుబాటులో ఉన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో ప్రైమరీ స్కూల్స్‌లో హాజరు శాతం 68% మాత్రమే నమోదైంది. అంటే...క్రమంగా విద్యార్థులు బడికి దూరమవు తున్నారు. 


వెనకబడిన విద్యార్థులు..


గతంలో ఓ సర్వే చేపట్టగా..ఝార్ఖండ్‌లోని 8-11 ఏళ్ల విద్యార్థుల్లో సగం మంది ఓ పేరాగ్రాఫ్‌ను కూడా సరిగా చదవలేకపోయారు. 2011లో ఈ సర్వే చేపట్టగా...ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దాదాపు 11 ఏళ్లు గడిచినా ఇంకా అక్కడి విద్యావిధానంలో ఎలాంటి మార్పులు రాలేదని స్పష్టంగా అర్థమవుతోంది. చాలా రాష్ట్రాల్లో ఇదే సమస్య తలెత్తుతోంది. కరోనా సమయంలో రెండేళ్ల పాటు ఆన్‌లైన్‌లోనే పాఠాలు చెప్పాల్సి వచ్చింది. విద్యార్థులు ఈ తరగతులపై పెద్దగా ఆసక్తి చూపలేదు. క్లాస్‌రూమ్ వాతావరణం లేకపోవడం ప్రధాన సమస్య. ఫోన్‌లో క్లాస్ అంటే అదేదో ఆటగా భావించారు విద్యార్థులు. ఫలితంగా...చాలా మంది బేసిక్స్ మర్చిపోయారు. వీరందరికీ మళ్లీ మొదటి నుంచి చెప్పాల్సి వస్తోంది. ఇది ఉపాధ్యాయులపై అదనపు భారం మోపుతోంది. 


Also Read: Savarkar Row: కర్ణాటక అసెంబ్లీలో సావర్కర్ ఫోటో, కాంగ్రెస్ నిరసనలు