FIFA World Cup 2022:   ఫిఫా ప్రపంచకప్ ముగిసింది. ఫైనల్ మ్యాచ్ అంటే ఇలానే ఉంటుంది అన్నట్లుగా కప్పు కోసం నిన్న జరిగిన పోరులో అర్జెంటీనా- ఫ్రాన్స్ జట్లు కొదమ సింహాల్లా తలపడ్డాయి. ఇరు జట్లు హోరాహోరీగా పోరాడాయి. తొలి అర్ధభాగంలో అర్జెంటీనా పైచేయి సాధించగా... రెండో అర్ధభాగంలో పుంజుకున్న ఫ్రాన్స్ జూలు విదిల్చింది. చివరికి పెనాల్టీ షూటౌట్ లో ఫలితం తేలిన ఈ మ్యాచ్ లో అర్జెంటీనా 4-2 తేడాతో గెలిచి మూడో ప్రపంచకప్ ను అందుకుంది.


లియోనెల్ మెస్సీ... ఈ ప్రపంచకప్ టోర్నీలో తన అత్యుత్తమ ఆటను బయటకు తీశాడు. వయసు పెరిగినా.. ఆట తగ్గలేదంటూ తన అర్జెంటీనా జట్టును ముందుండి నడిపించాడు. గ్రూప్ దశ నుంచి ఫైనల్ వరకు తన జట్టును తీసుకొచ్చాడు. ఇదే ఆఖరి ప్రపంచకప్ మ్యాచ్ అని ముందే ప్రకటించిన మెస్సీ.. తన కెరీర్ లో ఒక్క ప్రపంచకప్ అయినా అందుకోవాలనే కసితో ఫైనల్లో ప్రాణం పెట్టి ఆడాడు. మ్యాచ్ సమయంలో ఒకటి, అదనపు సమయంలో మరొకటి, ఆఖర్లో పెనాల్టీ షూటౌట్లో మరొకటి ఇలా మొత్తం 3 గోల్స్ కొట్టి జట్టు కప్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అనంతరం ట్రోఫీని అందుకుని మురిసిపోయాడు. ఈ మ్యాచుతో మెస్సీ 2 కీలక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 


1. ఫిఫా ప్రపంచకప్ లో అత్యధిక మ్యాచ్ లు ఆడిన రికార్డు.


2. ఈ మెగా టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన వారిలో ఐదో స్థానానికి చేరడం.


ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచులో మెస్సీ ప్రపంచకప్ లలో అత్యధిక మ్యాచులు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇది అతనికి ఈ మెగా టోర్నీల్లో 26వ మ్యాచ్. జర్మన్ మాజీ ఆటగాడు లోథర్ మాథ్యూస్ (25) ను మెస్సీ అధిగమించాడు. మెస్సీ తన కెరీర్ లో మొత్తం 5 ప్రపంచకప్ లు ఆడాడు. మాథ్యూస్ కూడా అన్నే మ్యాచులు ఆడాడు. మెస్సీ 2006 ప్రపంచకప్ లో తన తొలి మ్యాచ్ ఆడాడు. ఈ జాబితాలో మిరోస్లాన్ క్లోజ్ (24), పాలో మాల్దిని (23), క్రిస్టియానో రొనాల్డో (22) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 


ప్రపంచకప్ లలో అత్యధిక గోల్స్ చేసిన వారిలో నాలుగో స్థానంలో నిలిచాడు మెస్సీ. ఈ టోర్నీలో ఇప్పటివరకు 13 గోల్స్ చేశాడు. ఈ క్రమంలో బ్రెజిల్ లెజెండ్ పీలేను దాటేశాడు. జర్మనీకి చెందిన మిరోస్లావ్ క్లోస్ 16 గోల్స్ తో అగ్రస్థానంలో ఉన్నాడు. రొనాల్డో నజారియో (15), జరార్డ్ ముల్లర్ (14), ఫాంటైన్ (13) గోల్స్ తో తర్వాతి స్థానాల్లో నిలిచారు.