FIFA WC 2022:  అసలైన పోరుకు సిసలైన నిర్వచనంలా సాగింది నిన్నటి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్. ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టిన అర్జెంటీనా- ఫ్రాన్స్ జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. గోల్ గోల్ కు ఉత్కంఠ ఊపేస్తున్న వేళ... ఆధిపత్యం చేతులు మారినప్పుడల్లా గుండె వేగం పెరిగిపోతున్న వేళ.. సమయం తరిగిపోతున్నప్పుడల్లా ఊపరి ఆగిపోతున్నట్లపిస్తున్న వేళ... మెస్సీ జట్టు అర్జెంటీనా, ఫ్రాన్స్ పై విజయం సాధించింది. పెనాల్టీ షూటౌట్ లో ఫలితం తేలిన ఈ మ్యాచులో అర్జెంటీనా 4-2 తేడాతో గెలుపొందింది.






ఓవైపు మెస్సీ... మరోవైపు ఎంబాపే. ఎవరు తగ్గేదే లే అన్నట్లు ఫైనల్ మ్యాచులో పోటీపడ్డారు. తొలి అర్ధభాగం అర్జెంటీనా పైచేయి సాధిస్తే... మలి అర్ధభాగంలో ఫ్రాన్స్ అదరగొట్టింది. మెస్సీ సమయోచితంగా గోల్స్ చేస్తే... ఎంబాపే హ్యాట్రిక్ గోల్స్ తో చెలరేగిపోయాడు. ఫలితం మ్యాచ్ సమయంలోనూ, ఇంజూరీ టైం లోనూ, అదనపు సమయంలోనూ స్కోర్లు సమమయ్యాయి. మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ కు దారితీసింది. అక్కడా మెస్సీ, ఎంబాపై నువ్వా నేనా అన్నట్లు చెరో గోల్ కొట్టారు. అయితే ఫ్రాన్స్ టీంలోని మిగతా ఆటగాళ్లు విఫలమవటంతో అర్జెంటీనా 4-2 తేడాతో విజయం సాధించింది. 






మరి ఈ టోర్నీలో గోల్డెన్ అవార్డ్స్ ఎవరికి దక్కాయో తెలుసుకుందామా...


అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ గోల్డెన్ బాల్ అవార్డ్ అందుకున్నాడు. అదే టీం యువ ఆటగాడు 21 ఏళ్ల ఎంజో ఫెర్నాండెజ్ యంగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డ్ దక్కించుకున్నాడు. అర్జెంటీనా గోల్ కీపర్ మార్టినెట్ ఉత్తమ గోల్ కీపర్ గా ఎంపికయ్యాడు. ఫ్రాన్స్ సంచలనం ఎంబాపే గోల్డెన్ బూట్ సాధించాడు.