Jammu Kashmir Elections: 


తప్పులు లేని ఓటర్ల జాబితా కోసం..


జమ్ము, కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు సుదీర్ఘంగా కసరత్తు చేస్తోంది కేంద్రం. అక్కడ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపడుతోంది. దాని ఆధారంగా కొత్త ఓటర్ల జాబితా విడుదల చేయనుంది. ఇందులో భాగంగానే ఇటీవల ఓ కీలక ప్రకటన చేసింది. ఓటర్ల జాబితాలో కొత్తగా 25 లక్షల మందిని చేర్చనున్నామని జమ్ము కశ్మీర్ ఎన్నికల అధికారి హిర్దేశ్ కుమార్ వెల్లడించారు. నవంబర్ 25 నాటికి పూర్తి స్థాయిలో ఓటర్ల జాబితాను తయారు చేయటం...చాలా సవాలుతో కూడుకున్న పని అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈసారి ఎన్నికల్లో స్థానికేతర పౌరులూ ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. 2022 అక్టోబర్ 1  నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటు వేసేందుకు అర్హులు. ఎర్రర్ ఫ్రీ ఓటర్ లిస్ట్‌ను తయారు చేసేందుకు ఓటర్ ఐడీని, ఆధార్‌తో అనుసంధానించాల్సి ఉంటుందని ఎన్నికల అధికారి తెలిపారు. కొత్త కార్డులకు సెక్యూరిటీ ఫీచర్లు జోడిస్తామని వెల్లడించారు. అయితే...ఓటర్‌తో ఆధార్ అనుసంధానించటం తప్పనిసరి కాదని వివరించారు. జమ్ముకశ్మీర్‌లో నివసించే ప్రతి పౌరుడికీ ఓటు వేసే హక్కు ఉందని తేల్చి చెప్పారు.


స్థానిక నేతల విమర్శలు 


స్థానికేతరులకూ ఓటు వేసే హక్కు కల్పించటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. "ప్రజలకు ఎన్నికలపై నమ్మకం పోయింది" అని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ చీఫ్ మెహబూబ్ ముఫ్తీ అన్నారు. స్థానికేతరులూ ఓటు వేయొచ్చు అని చెప్పటంపై ఆమె మండిపడ్డారు. "ప్రజాస్వామ్యం విఫలమవుతోందనటానికి ఇదే ఉదాహరణ. ఇక్కడ అంతా భాజపాకు నచ్చినట్టుగానే జరుగుతోంది. ముస్లిం మెజార్టీ ఉన్న జమ్ము, కశ్మీర్ సెక్యూర్ ఇండియాలో భాగమవ్వాలని కోరుకుంటోంది. కానీ..ఓటింగ్‌పై ప్రజలు నమ్మకం కోల్పోయారు" అని అన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఒమర్ అబ్దుల్లా కూడా స్పందించారు. "ఈ నిర్ణయాలేవీ భాజపాకు అనుకూలించవు" అని అన్నారు. "భాజపా...జమ్ముకశ్మీర్‌లోని అసలైన ఓటర్లు తమ వైపు ఉండరన్న అభద్రతా భావానికి లోనవుతోంది. అందుకే..టెంపరరీ ఓటర్లనూ లిస్ట్‌లో చేర్చి సీట్లు గెలుచుకోవాలని చూస్తోంది" అని విమర్శించారు. "ఇది చాలా ప్రమాదకరమైన నిర్ణయం. దీంతో వాళ్లు (భాజపా) ఏం సాధించాలని అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. 1987నాటి పరిస్థితులను మళ్లీ తీసుకురాకండి" అని ట్వీట్ చేశారు పీపుల్స్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ సాజద్ గని లోనే.