Jallianwala Bagh Massacre 104th Anniversary:
1919 ఏప్రిల్ 13న హింసాకాండ
స్వతంత్ర పోరాట చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఘటన జలియన్‌వాలాబాగ్ ( Jallianwala Bagh) నరమేధం. 1919 ఏప్రిల్ 13న జరిగిన ఈ దారుణ ఘటన భారతీయులపై బ్రిటీషర్ల అరాచకానికి నిదర్శనంగా నిలిచింది. స్వతంత్ర పోరాటాన్ని మలుపు తిప్పిన ఘటన కూడా ఇదే. అప్పటి వరకూ జరిగిన పోరాటం ఒక ఎత్తు. ఈ ఘటన తరవాత జరిగిన ఉద్యమం మరో ఎత్తు. బ్రిటీషర్ల అకృత్యాలు చూసి అందరి రక్తం ఉడికిపోయింది. అప్పుడేంటి..? ఈ దారుణాన్ని తలుచుకుంటే ఇప్పటికీ భారతీయుల గుండె మండిపోతుంది. ఇది జరిగి సరిగ్గా 104 ఏళ్లు గడిచిపోయాయి. ఈ సందర్భంగా దేశమంతా మరోసారి ఈ నరమేధం ఎలా జరిగిందో గుర్తు చేసుకుంటోంది.
ఆ రోజు ఏం జరిగింది..?
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో వేలాది మంది భారతీయులు బైశాఖి వేడుకలు చేసుకునేందుకు తరలి వచ్చారు. జలియన్‌వాల బాగ్ వద్ద ఈ వేడుకలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రాంతం చుట్టూ గోడలున్నాయి. లోపలకు రావాలంటే ఒకే ఒక దారి ఉంది. అది కూడా చాలా చిన్నది. ఎలాంటి హెచ్చరికలు లేకుండానే అమృత్‌సర్ బ్రిగేడియర్ జనరల్ డయ్యర్ ఒక్కసారిగా తన బలగంతో లోపలకు వచ్చాడు. వెంటనే కాల్పులు జరపాలంటూ సైన్యానికి ఆదేశాలిచ్చాడు. అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. డయ్యర్ అలా ఆర్డర్ పాస్ చేశాడో లేదో వెంటనే భారతీయులపై కాల్పులు జరిపారు బ్రిటీష్ సైనికులు. దాదాపు 10 నిముషాల పాటు ఆ ప్రాంగణమంతా తూటాల చప్పుళ్లతో మారు మోగిపోయింది. ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ జనమంతా అటూ ఇటూ పరుగులు తీశారు. కొందరు అక్కడే ఉన్న బావిలో దూకి చనిపోయారు. మరి కొందరు బులెట్‌లకు బలి అయ్యారు. మొత్తం 379 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. మహిళలు, చిన్నారులు కూడా ఈ మారణకాండకు బలి అయ్యారు. అక్కడి బావిలో నుంచి దాదాపు 120 మంది మృతదేహాలను వెలికి తీశారు.
రౌలత్ చట్టంతో అధికారం..
ఈ హింసాకాండ జరిగే ముందే బ్రిటీష్ సైన్యానికి ఇష్టమొచ్చినట్టు కాల్పులు జరిపే హక్కు కల్పించే చట్టం అమల్లోకి వచ్చింది. అదే రౌలత్ యాక్ట్ (Rowlatt Act). అప్పట్లో ఈ చట్టం పెద్ద వివాదాస్పదమైంది. స్వతంత్ర పోరాటం చేసే భారతీయులకు ఎలాంటి ట్రయల్ లేకుండానే అరెస్ట్ చేసే హక్కు కల్పించే చట్టమిది. దీనిపై భారతీయులు భగ్గుమన్నారు. వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. ఇదే సమయంలో జలియన్‌వాలా బాగ్ వద్ద వేలాది మంది తరలివచ్చారు. అమృత్‌సర్‌లోని ఓ గార్డెన్ పేరే జలియన్‌వాలా బాగ్. బ్రిటీషర్లు తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగానే కాకుండా బైశాఖి వేడుకలు చేసుకునేందుకు అక్కడికి వచ్చారు. అప్పుడే డయ్యర్ వచ్చి ఆ ప్రాంతాన్ని రక్తసిక్తం చేశాడు. ప్రస్తుతం ఆ ప్రాంతం ఓ చీకటి అధ్యాయానికి ప్రతీకగా నిలిచిపోయింది. ఏటా వేలాది మంది సందర్శకులు ఇక్కడికి వచ్చి అమర వీరులకు నివాళులు అర్పిస్తుంటారు.
Also Read: BBC India: బీబీసీపై కేసు నమోదు చేసిన ఈడీ, విదేశీ నిధుల వ్యవహారంలో అవకతవకలు!