Thackeray vs Shinde:



మాతోశ్రీకి వచ్చారు: ఆదిత్య థాక్రే 


మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే కొడుకు ఎమ్మెల్యే ఆదిత్య థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. షిందే వర్గంతో వచ్చిన విభేదాల గురించి ప్రస్తావించారు. బీజేపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడి ఆయనను లాక్కుందని మండి పడ్డారు. బీజేపీలో చేరక ముందు ఏక్‌నాథ్ షిందే పార్టీ కార్యాలయమైన మాతోశ్రీకి వచ్చి ఏడ్చారని, బీజేపీలో చేరకపోతే జైలుకు పంపుతామని బెదిరించారని చెప్పినట్టు సంచలన కామెంట్స్ చేశారు ఆదిత్య. 


"బీజేపీలో చేరక ముందు ఏక్‌నాథ్ షిందే మాతోశ్రీకి వచ్చారు. పార్టీలో చేరకపోతే జైలుకు పంపుతామని బెదిరించినట్టు చెప్పారు. నిస్సహాయ స్థితిలో ఏడ్చారు. 40 మంది ఎమ్మెల్యేలు కేవలం డబ్బు ఆశతోనే ఆ పార్టీలో చేరారు. "


- ఆదిత్య థాక్రే, మహారాష్ట్ర ఎమ్మెల్యే 


ఈ వ్యాఖ్యల్ని సంజయ్ రౌత్ కూడా సమర్థించారు. ఆదిత్య థాక్రే చెప్పిన విషయం నిజమేనంటూ ట్వీట్ చేశారు. 


"ఇది నిజమే. షిందేకు అర్థమయ్యేలా వివరించేందుకు చాలా ప్రయత్నించాను. కానీ ఆయనకు జైలుక వెళ్తానేమో అన్న భయం పట్టుకుంది. అందుకే లొంగిపోయారు. ఆదిత్య థాక్రే చెప్పిన విషయాలు అక్షరాలా నిజం"


- సంజయ్ రౌత్, మహారాష్ట్ర ఎంపీ 


బాలాసాహెబ్ థాక్రే ప్రస్తావన కూడా తీసుకొచ్చారు ఆదిత్య థాక్రే. షిందేపై తీవ్ర విమర్శలు చేశారు. 


"మహారాష్ట్రలో చాలా మంది నేతలు మా తాతయ్య బాలాసాహెబ్ థాక్రే గురించి మాట్లాడుతున్నారు. ఆయనతో చాలా సన్నిహితంగా మెలిగినట్టు, ఆయన వాళ్లను గౌరవించినట్టు అసత్య ప్రచారం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఒకే ఒక్క శివసేన ఉంది. మిగతావి ఏవైనా అవి నమ్మక ద్రోహం నుంచి పుట్టుకొచ్చినవే. మా నుంచి అంతా కొల్లగొడదామని కుట్ర చేశారు. ఇప్పుడు సీఎం షిందే పదేపదే ఢిల్లీకి వెళ్తున్నారు. బహుశా థాక్రే అనే ట్యాగ్ కోసం ప్రయత్నిస్తున్నారేమో. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. భయపడి పారిపోయిన వాళ్లకు దొంగ అనే ట్యాగ్‌ మాత్రమే వేస్తారు"


- ఆదిత్య థాక్రే, మహారాష్ట్ర ఎమ్మెల్యే 


శివసేన పార్టీ పేరు, గుర్తుని కోల్పోయిన థాక్రే సేన తీవ్ర అసహనంతో ఉంది. ఎన్నికల సంఘం శిందే వర్గానికి వాటిని కేటాయించడంపై మండి పడుతోంది. ఈ క్రమంలోనే ఉద్దవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై పోరాటం చేసేందుకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. పార్టీకి చెందిన సామ్‌నా పత్రికలో ఎడిటోరియల్ రాసిన థాక్రే...వేరువేరుగా బీజేపీపై పోరాటం చేయలేమని స్పష్టం చేశారు. ఇదే సమయంలో 2024 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిత్వాన్నీ ప్రస్తావించారు. 2024 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి ఎవరు అన్న అంశాన్నీ ఈ సంపాదకీయంలో చర్చించారు థాక్రే. అప్పటి సంగతి అప్పుడే చూసుకుందామని స్పష్టం చేశారు. ఇది తరవాత నిర్ణయించుకుందామంటూ ప్రతిపక్షాలకు సూచించారు. 



"మనం బీజేపీపై పోరాటం చేయాలంటే ఇలా వేరువేరుగా ఉంటే అది కుదరదు. మనమంతా కలిసి మెరుపు దాడి చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ మాత్రమే ఒంటరిగా బీజేపీని ఎదుర్కోలేదు. ప్రతిపక్షాలు ఐక్యం కావడమే చాలా కీలకం" 


- సామ్నా పత్రికలో ఉద్దవ్ థాక్రే 


Also Read: Rajasthan Congress Crisis: రాజస్థాన్ కాంగ్రెస్‌లో భారీ మార్పులు రానున్నాయా? హైకమాండ్ ప్లాన్ ఏంటి?