Rajasthan Congress Crisis:



పార్టీకి సర్జరీ చేస్తారా? 


రాజస్థాన్ రాజకీయాల్లో చిచ్చు ఆరడం లేదు. అశోక్ గహ్లౌట్‌పై నిరసన వ్యక్తం చేస్తూ ఇటీవల సచిన్ పైలట్ నిరాహార దీక్ష చేశారు. దీనిపైనా అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నో నెలలుగా రాజస్థాన్ కాంగ్రెస్‌లో ఉన్న విభేదాలను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తోంది హైకమాండ్. కానీ అది సాఫీగా సాగడం లేదు. త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి కీలక తరుణంలో ఈ సవాలు కాంగ్రెస్‌ను ఇబ్బంది పెడుతోంది. అందుకే...పార్టీలో భారీ మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ సుఖ్‌జింద్వర్ రంధ్వా...అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయ్యారు. రాజస్థాన్‌లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించీ ప్రస్తావించారు. ఎన్నో ఏళ్లుగా అంతర్గత విభేదాలతో మథన పడుతున్న రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో భారీ మార్పులు చేసేందుకు ఈ సమావేశంలోనే  చర్చించినట్టు సమాచారం. ఎన్నికల ప్రణాళికకు సిద్ధమవాల్సిన సమయంలో ఇద్దరు కీలక నేతలు ఇలా విభేదాలతో దూరం అవడం సరికాదని భావిస్తోంది. అందుకే సంస్థాగతంగా కీలక మార్పులు చేయాలని చూస్తోంది. ఇప్పటికే పైలట్‌కు వార్నింగ్ ఇచ్చింది  హైకమాండ్. కానీ ఆయన మాత్రం ఈ హెచ్చరికల్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే చాలా ఓపిక పట్టామని, ఇలా చేయడం సరికాదని చెబుతున్నా లెక్క చేయడం లేదు. 


కొత్త పార్టీ పెడతారా..? 


సొంత పార్టీపై తిరుగుబాటు చేస్తున్న సచిన్‌ పైలట్ నిరాహార దీక్ష పూర్తి చేసుకున్నారు. ఇక తరవాత ఏం చేయనున్నారన్నదే ఆసక్తికరంగా మారింది. అధిష్ఠానాని ఝలక్ ఇచ్చే పనిలో ఉన్నారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ప్రత్యేకంగా పార్టీ పెడతారన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీకి వెళ్లడం ఈ ఆసక్తిని మరింత పెంచింది. అధిష్ఠానంతో స్పెషల్ మీటింగ్ ఉన్నట్టు సమాచారం. సీనియర్ నేతలతో సమావేశమవుతారన్న వార్తలు వినిపిస్తున్నా...దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. కాంగ్రెస్ శ్రేణులు కూడా ఈ వివాదంపై పెద్దగా మాట్లాడటం లేదు. తమ ప్రభుత్వం అవినీతి పరులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదంటూ నిరాహార దీక్ష చేశారు పైలట్. ఇది హైకమాండ్‌ని అసహనానికి గురి చేస్తోంది. ఈ ఎపిసోడ్‌ మొత్తంలో సైలెంట్‌గా ఉన్న సీఎం అశోక్ గహ్లోట్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలున్నాయి. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే...నిరాహార దీక్ష చేసిన సమయంలో పైలట్ కాంగ్రెస్ పేరుని కానీ గుర్తుని కానీ వాడుకోలేదు. సింగిల్‌గా ఓ స్టేజ్‌పై కూర్చుని దీక్ష చేశారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌ను వీడుతున్నట్టు పైలట్ పరోక్షంగా సంకేతాలిచ్చారా..? అన్న సందేహమూ కలుగుతోంది. పైగా ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోట్‌ను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత వసుంధర రాజేపై అవినీతి ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోలేదని మండి పడ్డారు. మొత్తానికి ఇక్కడి రాజకీయాలు మలుపుల మీద మలుపులు తీసుకుంటున్నాయి. 


Also Read: Karnataka Election 2023: కర్ణాటక బీజేపీలో ఏం జరుగుతోంది? వరుస పెట్టి కీలక నేతల రాజీనామాలు