ఎటువంటి ఆర్భాటం లేకుండా విక్రమ్ పెళ్లి తంతు కార్యక్రమం చేయడంతో రాజ్యలక్ష్మి మీద విక్రమ్ తాతయ్య సీరియస్ అవుతాడు. నలుగు పెట్టె కార్యక్రమం మొదలవుతుంది. అందరి ముందు చొక్క విప్పుకుని కూర్చోలేనని విక్రమ్ తెగ సిగ్గు పడిపోతాడు. పెళ్లి అన్నాక కొన్ని ముచ్చట్లు ఉంటాయి వాటిని కాదనకూడదని రాజ్యలక్ష్మి చెప్తుంది. విక్రమ్ సిగ్గు పడుతూనే నలుగు పెట్టించుకుంటాడు. దీంతోనే అయిపోయేలేదు ఇంకా మంగళ స్నానాలు కూడా ఉన్నాయని దేవుడు ఆటపట్టిస్తాడు. అటు తులసి ఇంట్లో దివ్యకి కూడా పసుపు రాసి మంగళ స్నానాలు చేయిస్తారు. మేనత్త, మేనమామ దివ్యకి బట్టలు పెట్టమని తులసి చెప్తుంది. వాళ్ళు పెట్టబోతుంటే నందు ఆపుతాడు. తులసి పుట్టింటి వాళ్ళు రారని అనుకుని అలా అనుకున్నాం, కానీ ఇప్పుడు అత్తయ్య దీపక్ వచ్చారు. కాబట్టి దివ్య మేనమామతోనే బట్టలు పెట్టిద్దామని నందు అనేసరికి తులసి సంతోషపడుతుంది.


Also Read: రాజ్ ని మర్యాదలతో ముంచెత్తిన కనకం అండ్ కో- రాహుల్ కి దిమ్మతిరిగే షాకిచ్చిన స్వప్న


ఈ మాట చెప్పడానికి అంతగా ఆలోచించాలా వదిన పుట్టింటి వాళ్ళు చేసే మర్యాదలు వాళ్ళనే చేయనివ్వమని మాధవి అనేసరికి నందు సంతోషపడతాడు. దీపక్ కి బొట్టు పెట్టి సంప్రదాయం ప్రకారం దివ్య మేనమామగా పిలుస్తాడు. జీవం కోల్పోయిందనుకున్న బంధానికి ప్రాణం పోశావని దీపక్ ఎమోషనల్ గా మాట్లాడతాడు. అందరూ సంతోషంగా ఉండటం చూసి లాస్య మనసులో కుళ్ళుకుంటుంది. కాసేపటికి దివ్యని పెళ్లి కూతురిలాగా రెడీ చేస్తారు. కూతుర్ని చూస్తూ తులసి తెగ మురిసిపోతుంది. అత్తారింటికి వెళ్తే చూడలేనని తులసి అంటుంది. కాసేపు దివ్య, తులసి ఇద్దరూ సరదాగా పోట్లాడుకుంటారు. తల్లిని వదిలేసి వెళ్లిపోతున్నందుకు దివ్య ఏడుస్తుంది. నాకు ఈ పెళ్లి వద్దని ఎమోషనల్ అవుతుంది. ఆడదానికి రెండు జీవితాలు ఉంటాయి. రెండో జీవితం రేపటి నుంచి మొదలవబోతోందని తులసి ఆడపిల్ల గురించి చక్కగా చెప్తుంది. అప్పుడే దివ్యకి విక్రమ్ కాల్ చేస్తాడు. శృతి ఫోన్ తీసుకుని కాసేపు ఆట పట్టిస్తుంది.


Also Read: చిత్రని పెళ్లి చేసుకోబోతున్నానని మాళవికకి చెప్పిన అభి- వేదని బలవంతం చేయబోయిన యష్


శృతి ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడమంటుంది. విక్రమ్ స్పీకర్ ఆన్ లో ఉందని తెలియక దివ్యతో ప్రేమగా మాట్లాడతాడు. అదంతా వింటున్న తులసి వాళ్ళు తెగ నవ్వుకుంటారు. చుట్టూ ఎవరూ లేరని చెప్పావ్ కదా వీడియో కాల్ చేస్తానని ఫోన్ కట్ చేస్తాడు. శృతి వీడియో కాల్ లిఫ్ట్ చేస్తుంది. తనని చూసి తెగ పొగిడేస్తాడు. ముద్దు పెట్టేస్తానని విక్రమ్ అనేసరికి దివ్య వద్దు వద్దు అంటుంది. నిన్న నువ్వు ముద్దు పెట్టావ్ కదా ఇప్పుడు నేను పెడతానని అనేసరికి అందరూ విక్రమ్, దివ్యని ఆట పట్టిస్తారు. విక్రమ్ ఇంట్లో పూజ మొదలవుతుంది. దేవుడి పాదాలకు నమస్కారం చేసుకోమని పంతులు చెప్పేసరికి విక్రమ్ లేచి తల్లి కాళ్ళకి నమస్కరిస్తాడు. ఆ మాటలకి రాజ్యలక్ష్మి పొంగి పోతుంది. ఇప్పుడు ఆ మాటలకి పొంగి పోతున్నావ్ కానీ తర్వాత కుదరదు కదా అని బసవయ్య అంటాడు. ఈరోజు వరకు నీ జీవితంలో మనసులో అమ్మ మాత్రమే ఉంది రేపటి నుంచి ఆ స్థానం కోసం మరొక మనిషి పోటీకి రాబోతుందని అంటాడు.