Karnataka Election 2023:


మరో నేత రిజైన్ 


కర్ణాటక బీజేపీలో కీలక నేతలందరూ వరుస పెట్టి రాజీనామాలు చేస్తున్నారు. ఎన్నో రోజులుగా పార్టీలో ఉన్న వాళ్లనూ ఈ సారి పక్కన పెట్టి కొత్త వాళ్లకు అవకాశమిచ్చింది అధిష్ఠానం. ఈ కారణంగా చాలా మంది లీడర్స్ అలిగారు. టికెట్ ఇవ్వాల్సిందేనని మొండి పట్టు పట్టారు. కానీ హైకమాండ్ మాత్రం అందుకు అంగీకరించడం లేదు. దీన్ని తట్టుకోలేకే కీలక నేతలు పార్టీ వీడుతున్నారు. లింగాయత్‌ లీడర్‌ లక్ష్మణ్ సవది ఇప్పటికే రాజీనామా చేయగా...ఇప్పుడు మరో నేత రాజీనామా చేశారు. ఆరుసార్లు MLAగా గెలిచిన ఎస్ అంగార రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. మత్స్యశాఖ మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన...రాజకీయాలకు దూరమవుతున్నట్టు స్పష్టం చేశారు. పార్టీ కోసం ఎంతో శ్రమించిన ఓ నేతకు దక్కాల్సిన గౌరవం ఇది కాదని  మండి పడ్డారు. 


"నాకు టికెట్ ఇవ్వలేదన్న బాధ ఏమీ లేదు. కానీ...ఎలాంటి రిమార్క్ లేకుండా ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం, ప్రజల కోసం పని చేసిన నేతకు దక్కాల్సిన గౌరవమైతే ఇది కాదు. పార్టీకి నేనేం అన్యాయం చేశానో హైకమాండ్ చెప్పాలి. కొంత మంది కుట్ర చేసి నాకు టికెట్ దక్కకుండా అడ్డుకున్నారు. నిజాయితీకి పార్టీలో విలువ లేనే లేదు."


- ఎస్ అంగార, కర్ణాటక మాజీ మంత్రి 






లాబీయింగ్ చేయడం తనకు చేతకాదని, అందుకే ఇలా వెనకబడిపోయానని అన్నారు ఎస్ అంగార. మరోసారి పోటీ చేసే అవకాశమివ్వాలని రిక్వెస్ట్ చేసినా పట్టించుకోలేదని మండి పడ్డారు. 


"నా నిజాయితీ నాకు శాపంగా మారింది. లాబీయింగ్‌ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. అందుకే ఇంతగా వెనకబడిపోయాను. మరోసారి పోటీ చేసే అవకాశమివ్వాలని బీజేపీ కర్ణాటక చీఫ్‌ని కోరాను. కానీ ఎలాంటి సమాచారం లేకుండానే నా స్థానంలో మరో వ్యక్తికి టికెట్ ఇచ్చారు. అభ్యర్థిని మార్చే ముందు కనీసం సమాచారం ఇవ్వాలిగా. పార్టీకి నాపైన నమ్మకం లేనప్పుడు రాజకీయాల్లో కొనసాగడం అనవసరం అనిపిస్తోంది."


- ఎస్ అంగార, కర్ణాటక మాజీ మంత్రి 


మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు అత్యంత సన్నిహితుడైన లక్ష్మణ్ సవది పార్టీ నుంచి వెళ్లిపోవడం బీజేపీకి గట్టి షాకే ఇచ్చింది. లింగాయత్‌ లీడర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన జనసమీకరణలోనూ ఆరితేరారు. అలాంటి వ్యక్తిం పార్టీ వీడడం వల్ల ఆ వర్గం ఓట్లు చీలిపోయే అవకాశముంది. 2012లో అసెంబ్లీలోనే అశ్లీల వీడియోలు చూస్తూ దొరికిపోయారు. అప్పట్లో అది వివాదాస్పదమైంది. ఆ తరవాత 2018లో లక్ష్మణ్ కాంగ్రెస్‌ అభ్యర్థిపై పోటీ చేసి ఓడిపోయారు. కొద్ది రోజులకే కాంగ్రెస్-జనతా దళ్ సెక్యులర్ ప్రభుత్వం కూలిపోయింది. చాలా మంది కాంగ్రెస్ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ క్రమంలోనే ఆయన బీజేపీలో చేరారు. ఈ సారి ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడం లక్ష్మణ్‌ను అసహనానికి గురి చేసింది. మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్‌ పేరు కూడా బీజేపీ లిస్ట్‌లో లేదు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి మంతనాలు జరుపుతున్నారు జగదీష్. కానీ...అధిష్ఠానం మాత్రం టికెట్ ఇచ్చేందుకు ససేమిరా అన్నట్టు సమాచారం. 


Also Read: Bathinda Military Station: బఠిండా మిలిటరీ స్టేషన్‌లో మరోసారి కాల్పులు, జవాన్ మృతి - ఆత్మహత్య చేసుకున్నాడా?