విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్తున్న వేళ నేడు కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి విశాఖలో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సహా వివిధ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడంపై ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. దీంతో ఇటీవల సీఎం కేసీఆర్ స్టీల్ ప్లాంట్‌ను టేకోవర్ చేసుకునే నిర్ణయం కూడా తీసుకున్నారు. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాల పరిశీలనకు సింగరేణి సీఎండీ ఆదేశాల మేరకు ముగ్గురు డైరెక్టర్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు వెళ్లి ప్లాంటు డైరెక్టర్లతో చర్చలు జరిపారు. ఈ పరిస్థితుల్లో నేడు (ఏప్రిల్ 13) కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్థే విశాఖపట్నానికి వచ్చి స్టీల్ ప్లాంటు యాజమాన్యంతో సమావేశం కానున్నారు. 


స్టీల్ ప్లాంటు యాజమాన్యంతో సమావేశమై ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కార్మిక సంఘాల ప్రతినిధులను కూడా ఫగన్ సింగ్ ఆహ్వానించారు. కేంద్ర మంత్రి కులస్తే రాక, సమావేశం కోసం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. 


కేంద్ర మంత్రి పర్యటన ఇలా
కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్థే ఉదయం 8.15 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఈస్ట్‌ పాయింట్‌ కాలనీలో ఉన్న క్లాసిక్‌ ఆఫీసర్స్‌ గెస్ట్ హౌస్‌కి వెళ్తారు. ఉదయం 10.30 గంటలకు పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరగనున్న రోజ్‌గార్‌ మేళాలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు పోర్టుకు వెళ్లి అక్కడ జరిగే కార్యక్రమాలకు హాజరవుతారు. మధ్యాహ్నం రెండు గంటలకు హోటల్‌ నోవాటెల్‌కు చేరుకొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ఉక్కు అధికారులతో, 3.45 గంటలకు ఉక్కు కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశం అవుతారు. సమావేశాలు ముగించుకొని సాయంత్రం 4.30 గంటలకు విమానాశ్రయానికి చేరుకొని 5.45 గంటల విమానంలో ఢిల్లీకి వెళ్లిపోతారు. 


15న బిడ్‌లకు చివరి తేదీ
ఇప్పటికే స్టీల్ ప్లాంటుకు మూలధన వనరులు సమకూర్చేందుకోసం బిడ్ లను ఆహ్వానిస్తున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల అయిన సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కు కర్మాగారంలో భాగస్వామిగా చేరేందుకు ఉక్కు, ముడిఉక్కు తయారీపై ఆసక్తి ఉన్న సంస్థల నుంచి వ్యాపార ప్రతిపాదనలను ఆహ్వానిస్తున్నట్లు స్టీల్ ప్లాంటు యాజమాన్యం మార్చి 27న ప్రకటించింది. బొగ్గు, నేల బొగ్గు, ఇనుప ఖనిజం వంటి ముడి పదార్థాలను సరఫరా చేయడంతో పాటు పరస్పర అంగీకారంతో నిబంధనల మేరకు ఉక్కు ఉత్పత్తులను ప్లాంటు నుంచే కొనాలి. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ దాఖలు చేసే సంస్థలు ఉక్కు లేదా ఉక్కు తయారీ ముడిపదార్థాల వ్యాపారం చేసేవిగా ఉండాలని షరతు ఉంది. ఈ నెల 15న సాయంత్రం మూడు గంటల్లోగా తమ ప్రతిపాదనలు సమర్పించాలని సూచించింది.


సింగరేణి కాలరీస్ తో జాయింట్ వెంచర్ కింద ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) సాధ్యాసాధ్యాలను ఓ బృందం పరిశీలిస్తుంది. ఈఓఐ సాధ్యాసాధ్యాలు, స్టీల్ ప్లాంట్ సేకరించదలచిన నిధులు, వాటిని సమకూర్చడం ద్వారా పొందే ఉత్పత్తులు తదితర వివరాలపై విశాఖ ఉక్కు పరిశ్రమ ఉన్నతాధికారులతో చర్చలు జరిపేందుకు సింగరేణి కాలరీస్ ప్రతినిధి బ‌ృందం రెండు రోజుల క్రితమే విశాఖపట్నానికి వెళ్లారు. వారు చర్చలు జరిపి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివరించినట్లు సమాచారం.