Headlines Today :
నేటి నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో లోకేష్ పాదయాత్ర
తాడిపత్రి నియోజకవర్గంలో నారా లోకేశ్ పాదయాత్ర ఘనంగా ముగిసింది. అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు. జేసీ పవన్ రెడ్డి నారా లోకేశ్ వెంట నడిచారు. సైకో పోవాలి- సైకిల్ రావాలి అనే పాటకు డ్యాన్స్ చేశారు. రాత్రి జరిగిన బహిరంగ సభలో ప్రభుత్వంపై, జగన్‌పై లోకేష్ పంచ్‌లతో విరుచుకుపడ్డారు. యాడికి మండలం చందన గ్రామం నుంచి నంద్యాలలోకి నారా లోకేష్ చేపట్టే యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది.
నేటి నుంచి కర్ణాటకలో నామినేషన్ల స్వీకరణ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తొలి ఘట్టం నేటి నుంచి ప్రారంభంకానుంది. మే 10 వ తేదీన ఒకే విడతలో జరిగే ఎన్నికల కోసం నేటి నుంచి నామినేషన్లు సీవ్కరించనున్నారు. ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయనున్న ఎన్నికల సంఘం నేటి నుంచి నామినేషన్లు తీసుకోనుంది. నామినేషన్లు వారం రోజుల పాటు తీసుకుంటుంది. 21వ తేదీన నామినేషన్లు పరిశీలించనుంది. ఉపసంహరణకు ఏప్రిల్ 24 ఆఖరి గడువుగా ప్రకటించింది. మే పదిన పోలింగ్ జరిగితే మే 13వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయనుంది. 80 ఏళ్లు దాటిన వారెవరైనా ఈసారి ప్రయోగాత్మకంగా ఇంటి నుంచే ఓటువేసే అవకాశం కల్పించింది. వోట్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించడం ఇదే తొలిసారి.
రాహుల్ పిటిషన్‌పై సూరత్ కోర్టు విచారణ
పరువునష్టం కేసులో శిక్షపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌పై సూరత్ సెషన్ కోర్టు ఇవాళ విచారించనుంది. ఇప్పటికే దీనిపై విచారించిన కోర్టు పిటిషన్‌దారుకి నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ పదిలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పుడు దానిపై వాదించనుంది. రాహుల్ గాంధీ 2019లో మోదీ అనే ఇంటి పేరుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. రెండేళ్ల శిక్ష రద్దుకు సంబంధించిన పిటిషన్‌పై మే 3న సూరత్ సెషన్స్ కోర్టు విచారణ జరపనుంది. అయితే బెయిల్ పొడిగింపు, శిక్షను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. శిక్ష రద్దు పిటిషన్ మే 3న విచారణకు రానుంది.
పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి గత నెలలో సూరత్ ట్రయల్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం.. రాహుల్ లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు కూడా పడింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు.
ఐపీఎల్ 2023లో నేడు గుజరాత్ VS పంజాబ్
ఐపీఎల్ 2023లో విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ జట్టుతో పంజాబ్ తలపడనుంది. మూడు మూడు మ్యాచ్‌లు ఆడిన ఈ రెండు జట్లు చెరో రెండు విజయాలు సాధించి నాలుగు ఆరు స్థానాల్లో ఉన్నాయి. రన్ రేటు మెరుగ్గా ఉన్న గుజరాత్ జట్టు నాల్గో స్థానంలో ఉంటే.. రన్ రేట్ తక్కువగా ఉన్న పంజాబ్ జట్టు ఆరో స్థానంలో కొనసాగుతోంది. మొహాలీ వేదికగా ఈ మ్యాచ్ సాయంత్రం 7.30కి ప్రారంభంకానుంది. అనారోగ్య కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన హార్ధిక పాండ్య నేటి మ్యాచ్ ఆడబోతున్నాడు.