నేడు ఈబీసీ నేస్తం నిధులు విడుదల
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు (బుధవారం) లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఓసీ సామాజిక వర్గానికి చెందిన పేదలకు ఈ పథకం ద్వారా నిధులను వారి ఖాతాల్లోకి జమ చేయనున్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ. 658.60 కోట్ల ఆర్ధిక సాయాన్ని ప్రకాశం జిల్లా మార్కాపురంలో బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోకి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జమ చేయనున్నారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 45 నుండి 60 ఏళ్ళలోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు (ఈబీసీ) ఏటా రూ. 15,000 చొప్పున అదే అక్కచెల్లెమ్మలకు 3 ఏళ్ళలో మొత్తం రూ. 45,000 ఆర్ధిక సాయం చేస్తూ వారు సొంత వ్యాపారాలు చేసుకుని వారి కాళ్ళ మీద వారు నిలబడేట్టుగా తోడ్పాటు ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రకటించింది.
దిశ ఎన్‌కౌంటర్‌పై విచారణ
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసులో సిర్పూర్కర్ కమిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టు విచారించనుంది. జనవరిలో తన నివేదికను కోర్టుకు సిర్పూర్కర్ కమిషన్ సమర్పించింది. ఈ కేసులో బాధితుల తరఫున సుప్రీం కోర్టు సీనియర్ కౌన్సిల్ వృందా గ్రోవర్ వాదనలు వినిపించారు. ఎన్ కౌంటర్ తీరును కోర్టు దృష్టికి తీసుకు వచ్చిన వృందా.. పోలీసులు వెల్లడించిన పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పోలీసు కస్టడీలోని ఉన్న నలుగురు నిందితులను సీర్ రీ కన్ స్ట్రక్షన్ చేసే పేరుతో ఎన్ కౌంటర్ చేశారని వాదించారు. సీసీ టీవీలో లారీని చూసి మొదట గుర్తు పట్టింది ఓనర్ శ్రీనివాస్ రెడ్డి అని పోలీసులు తెలిపారని.. కానీ కమిషన్ ముందు లారీ ఓనర్ శ్రీనివాస్ రెడ్డి ఆ విషయం చెప్పలేదని వివరించారు. ఇవాళ ప్రభుత్వం తన తరఫున వాదనలు చేయనుంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఓ కట్టుకథలా ఉందని ఏడు నెలల కిందట సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తేల్చేసింది. మరి ఎన్‌కౌంటర్ గురించి పోలీసులు చెప్పింది కట్టుకథ అయితే.. అసలు నిజం ఏంటనే వాదనలు వినిపించాయి. పోలీసుల వాంగ్మూలంలో తప్పులున్నాయని చెప్పిన కమిషన్.. వాస్తవంగా ఏం జరిగిందో చెప్పడంలో విఫలం అయిందని పోలీసుల తరఫు వాదించిన న్యాయవాది కోట కీర్తి కిరణ్ అన్నారు. మూడేళ్ల కిందట హైదరాబాద్ సమీపంలో జరిగిన దిశ అత్యాచారం, హత్య అప్పట్లో కలకలం రేపింది. అయితే ఆ తర్వాత వారం రోజులకే ఆ హత్యాచారం కేసులో నిందితులకు సంబంధించిన ఎన్ కౌంటర్ కూడా అంతే సంచలనంగా మారింది. అయితే, ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని, ఎన్ కౌంటర్ కు సంబంధించి పోలీసులు చెబుతున్న విషయాలు ఏవీ నమ్మ దగ్గవిగా లేవని దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సిర్పూర్కూర్ కమిషన్ పేర్కొంది.
టెన్త్ పేపర్ లీక్ కేసులో నిందితులకు బెయిల్
టెన్త్ పేపర్ లీక్ కేసులో అరెస్టైన ప్రశాంత్ సహా మరోముగ్గర్ని ఇవాళ జైలు నుంచి విడుల చేయనున్నారు. వాళ్ల ముగ్గురికి హన్మకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
నేడు సిరిసిల్లకు కేటీఆర్
మంత్రి కేటీఆర్ ఇవాళ మరోసారి సిరిసిల్లలో పర్యటిస్తారు. ఈపర్యటనలో ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొంటారు. ముందుగా తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల గ్రామానికి చేరుకొని ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్ ప్రారంభిస్తారు. తర్వాత అగ్రికల్చర్ కాలేజీ స్టార్ట్ చేస్తారు. సాయంత్రానికి ముస్తాబాద్ మండలంలో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని తిరిగి పయనమవుతారు.
ఎల్బీస్టేడియంలో ఇఫ్తార్ విందు
రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఇస్తుంది. సాయంత్రం జరిగే ఈ విందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ చూస్తున్నారు.
ఐపీఎల్ 2023లో చెన్నై వర్సెస్ రాజస్థాన్
ఇండియన్ ప్రీమియర్ లీగులో బుధవారం 17వ మ్యాచ్ జరుగుతోంది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఢీకొంటున్నాయి. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. రెండు జట్లూ చెరో మూడు మ్యాచులాడి 4 పాయింట్లతో ఉన్నాయి. మరి నేటి పోరులో గెలుపు ఎవరిది?
సంజూ సేనదే జోష్!
ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) దూకుడు మీదుంది! చాలా బ్యాలెన్సింగ్‌గా కనిపిస్తోంది. కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) ముందుండి నడిపిస్తున్నాడు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్, జోస్ బట్లర్ వీరోచిత ఫామ్‌లో ఉన్నారు. సంజూ బ్యాటింగ్ గురించి తెలిసిందే. మిడిలార్డర్లో దేవదత్ పడిక్కల్, హెట్‌మైయిర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జోరెల్, రవిచంద్రన్ అశ్విన్ నిలబడుతున్నారు. ఇందులో ఏ ఇద్దరు నిలబడ్డా దబిడి దిబిడే! రాజస్థాన్ బౌలింగ్ అద్భుతం. బంతిని స్వింగ్ చేస్తూ ట్రెంట్ బౌల్ట్, మిస్టరీ స్పిన్‌తో యూజీ చాహల్ అపోజిషన్‌ను కకా వికలం చేస్తున్నారు. కేఎం ఆసిఫ్, జేసన్ హోల్డర్, అశ్విన్ కన్‌సిస్టెంట్‌గా బౌలింగ్ చేస్తున్నారు. ప్రతి డిపార్ట్‌మెంట్లోనై బలమైన బ్యాకప్ ప్లేయర్లు ఉన్నారు. మూమెంటమ్ దొరికితే రాయల్స్‌ను ఆపడం కష్టం!
గాయపడ్డ సీఎస్‌కే!
ట్రోఫీ గెలిచి ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాలని ధోనీ (MS Dhoni) పట్టుదలగా ఉన్నాడు. ఆడిన మూడింట్లో రెండు గెలిచినా సీఎస్‌కే (Chennai Super kings) బలమైన జట్టని చెప్పలేం! ఆటగాళ్లను గాయాలు వేధిస్తున్నాయి. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే మాత్రం బ్లాస్టింగ్ ఓపెనింగ్స్ ఇస్తున్నారు. అయితే ముంబయిపై వీరు విఫలమయ్యారు. వాంఖడేలో అనుభవం ఉన్న అంజిక్య రహానె వన్‌డౌన్‌లో వచ్చి విధ్వంసం సృష్టించాడు. అతడిలాగే ఆడితే చెన్నైకి ప్లస్ పాయింట్. మిడిలార్డర్లో రాయుడు, మొయిన్, ధోనీని నమ్ముకోలేని సిచ్యువేషన్. శివమ్ మావి పర్లేదు. జడ్డూ బంతి, బ్యాటుతో రాణించేందుకు ప్రయత్నిస్తున్నాడు. బౌలింగ్, జట్టు కూర్పు పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. దీపక్ చాహర్ గాయపడ్డాడు. స్టోక్స్ బంతి పట్టుకోవడం లేదు. మొయిన్‌దీ ఇదే పరిస్థితి. మిచెల్ శాంట్నర్ ఒక్కడే అదరగొడుతున్నాడు. గాయాల దృష్ట్యా రాజస్థాన్‌పై ఎలాంటి టీమ్‌ను సెట్ చేస్తారనే సందేహాలు ఉన్నాయి.