ED Case on BBC India:
ఫెమా యాక్ట్ కింద కేసు
బీబీసీపై ఈడీ కేసు నమోదు చేసింది. Foreign Exchange Management Act కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించింది. విదేశీ నిధుల్లో అవకతవకలు జరిగినట్టు గుర్తించింది. రెండు నెలల క్రితం దాదాపు మూడు రోజుల పాటు ఐటీ అధికారులు బీబీసీ కార్యాలయాల్లో సర్వే నిర్వహించారు. అప్పట్లో అది సంచలనమైంది. పన్ను చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్టు అప్పుడు వెల్లడించారు. ఈ సర్వే పూర్తైన తరవాత బీబీసీ కీలక ప్రకటన చేసింది. అధికారులకు అన్ని విధాలుగా సహకరిస్తామని స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపింది. కానీ ఈలోగా ఈడీ షాక్ ఇచ్చింది. విదేశీ నిధుల వ్యవహారంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు పలువురు ఉద్యోగులను విచారించినట్టు తెలుస్తోంది. కీలకమైన డాక్యుమెంట్‌లను పరిశీలించినట్టు సమాచారం. "ఇవాళ మరో BBC ఉద్యోగిని పిలిచారు. కొన్ని కీలకమైన డాక్యుమెంట్‌లు చూపించాలని అడిగారు. కొన్ని ప్రశ్నలు కూడా వేశారు" అని ఓ అధికారి స్పష్టం చేశారు. గుజరాత్ అల్లర్ల డాక్యుమెంటరీ వివాదాస్పదం అయినప్పటి నుంచి కేంద్రం ఉద్దేశపూర్వకంగా బీబీసీని టార్గెట్ చేసిందన్న ఆరోపణలున్నాయి.