Jail Tourism Uttarakhand: జైలు జీవితం ఎలా ఉంటుంది? చాలా నరకంగా ఉంటుంది భయ్యా! అంటారా? అవును సినిమాల్లో మనం చూసే జైలు సీన్లు అలానే ఉంటాయి. అయితే కొంతమందికి జైలు జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. మరి కొందరైతే ఏకంగా జైలు జీవితం అనుభవపూర్వకంగా చూడాలని అనుకుంటారు. అలాంటి వారి కోసం ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని ఓ జైలు బంపర్ ఆఫర్ ఇచ్చింది.


రూ.500


ఉత్తరాఖండ్‌లోని హల్‌ద్వానీ జైలుకు 100 ఏళ్లకు పైగా ఘన చరిత్ర ఉంది. ఈ జైలును 1903లో నిర్మించారు. ప్రస్తుతం సరైన మెయింటేనెన్స్ లేక ఆ కారాగారంలోని కొన్ని పరిసరాలు, భవనాలు నిరపయోగంగా మారాయి. దీంతో అధికారులు వాటిని ప్రత్యేకంగా తీర్చిదిద్ది అక్కడే టూరిస్టులకు లేదా జైలు జీవితం అనుభవించాలనుకునే వారికి బరాక్‌లో ఉండే విధంగా విడిది ఏర్పాట్లు చేస్తున్నారు.


అందులో ఒక్క రోజు ఉండాలంటే రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. మీరు నేరం చేయకపోయినా ఖైదీ దుస్తుల్లో ఆ జైల్లో ఉండొచ్చు. జైలు జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకునే వారికి ఇది ఓ మంచి అవకాశమని అధికారులు అంటున్నారు.


పర్యటకంగా


టూరిస్టులకు కూడా ఈ సౌకర్యాన్ని కల్పించడానికి మెరుగైన ఏర్పాట్లు చేస్తున్నారు. జైల్ టూరిజం.. పర్యటకులకు కొత్త అనుభూతిని అందించే అవకాశం ఉంది. 


ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. తమ జాతకం బాలేదని నమ్మిన వారు రూ.500 ఫీజు చెల్లించి ఈ జైలుకు వెళ్తున్నారు. ఒక్క రోజు జైల్లో ఉంటే వారి జాతకంలో కష్ట కాలం తొలగిపోతుందని వాళ్లు నమ్ముతున్నారట. కొంతమంది అయితే వారి జాతకాల్లో జైలు జీవితం గడపాలని రాసిపెట్టి ఉంటే జ్యోతిష్యులు చెప్పడంతో ఈ రకంగానైనా దాన్ని అనుభవించాలని వస్తున్నారని అధికారులు చెబుతున్నారు.


పంజాబ్‌లో


ఖైదీల కోసం పంజాబ్ జైళ్ల శాఖ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు శుభవార్త అందించింది. ఖైదీలకు సైతం తమ జీవిత భాగస్వామితో జైల్లోనే ఏకాంతంగా గడిపేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది పంజాబ్ జైళ్ల శాఖ. 


తమ జీవిత భాగస్వామితో జైళ్లలో ఏకాంతంగా గడిపే ఈ కార్యక్రమానికి 'జీవిత భాగస్వాముల సందర్శన' అని పేరు పెట్టారు. తొలుత పంజాబ్ లోని మూడు జైళ్లలో ఈ కార్యక్రమానికి శ్రీ కారం చుట్టారు. దీని ద్వారా దాదాపు రెండు గంటలపాటు ఖైదీలు జైల్లోనే తమ జీవిత భాగస్వామితో ఏకాంతంగా గడపవచ్చు. సెప్టెంబర్ 20న తరణ్ లోని గోఇంద్‌వాల్‌ సాహిబ్‌ సెంట్రల్ జైలు, నాభా జిల్లా జైలు, బఠిండా మహిళా జైల్లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించింది పంజాబ్ జైళ్ల శాఖ. ఈ విషయాన్ని జైళ్ల శాఖ ఉన్నతాధికారి మీడియాకు వెల్లడించారు. 


Also Read: Harsh Goenka: ఇందుకే ఆఫీసుకు రమ్మనేది- మీకు అర్థమవుతోందా?


Also Read: Congress President Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మరో ట్విస్ట్- పోటీ నుంచి డిగ్గీ ఔట్