Jagtial News : జగిత్యాల జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది.  మూగజీవిని కాపాడబోయి యువకుడు మృత్యువాత పడ్డాడు.  జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ కు చెందిన తిరుపతి(17) హస్నాబాద్ లోని వ్యవసాయ భూమిలో ఆదివారం పశువులను మేతకు వదిలారు. ఆ సమయంలో ఒక గేదె పొలంలో మోటర్ సర్వీస్ వైర్ కి తాకి కరెంటు షాక్ తో విలవిలాడింది. ఇది గమనించిన తిరుపతి గేదెను కాపాడేయత్నంలో కరెంట్ షాక్ తో మృతి చెందాడు. తనకున్న 20 బర్రెలను మేపుకుంటూ జీవనోపాధి పొందుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఒక్కగానొక్క  కొడుకు కరెంట్ షాక్ తో మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సంఘటనా స్థలానికి ఎస్ఐ సంజీవ్ చేరుకుని విచారణ చేపట్టారు. 


రైలు ఢీకొని 335 గొర్రెలు మృతి


ఊర కుక్కలు వెంబ‌డించ‌డంతో భయంతో గొర్రెలు పరుగులు పెట్టాయి. గొర్రెల మంద ఒక్కసారిగా గ్రామ శివారులోని రైలు ప‌ట్టాల‌పైకి వ‌చ్చాయి. అప్పుడే వేగంగా వ‌చ్చిన రైలు గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 335 గొర్రెలు ప్రాణాలు కోల్పోయాయి. ఈ విషాద ఘ‌ట‌న దేవ‌ర‌క‌ద్ర మండ‌లం కౌకుంట్ల గ్రామ శివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. కౌకుంట్లకు చెందిన పెద్ద మాసన్న, దూలన్న, తిరుపతయ్యకు చెందిన దాదాపు 500 గొర్రెల‌ను గురువారం రాత్రి గ్రామ రైతు వేదిక వద్ద నిలిపారు. శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఊర కుక్కలు గొర్రెల మందపై దాడికి దిగాయి. భయంతో గొర్రెలు పరుగులు పెట్టాయి. గ్రామ శివారులో రైల్వే ట్రాక్‌ దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు గొర్రెల‌ను ఢీకొట్టింది.


రూ.33.50 లక్షలు నష్టం 


ఈ ప్రమాదంలో మాసన్నకు చెందిన‌ 160 గొర్రెలు, దూలన్నకు చెందిన 100 గొర్రెలు, తిరుపతయ్య 75 గొర్రెలు మొత్తం 335 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటనపై స‌మాచారం అందుకున్న తహసీల్దార్ జ్యోతి, ఎంపీడీవో శ్రీనివాసులు, పశు వైద్యులు జీసన్‌అలీ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ప్రాణాలు కోల్పోయిన గొర్రెల విలువ సుమారు రూ.33.50 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు.


Also Read : Social Media Love : ప్రేమ కోసమై వలలో పడిన పల్నాడు పోరడు, తల్లిదండ్రులకు చెప్పకుండా!


Also Read : Hawala Money: హైదరాబాద్‌లో పోలీసుల తనిఖీలు - రూ.79.25 లక్షలు స్వాధీనం, 3 పబ్ లపై కేసులు!