Street Dogs Problem : అంబర్ పేటలో వీధి కుక్కలు చిన్న పిల్లవాడ్ని చంపడంతో ఇప్పుడు వీధి కుక్కలపై అంతట విస్తృత చర్చ జరుగుతోంది. ప్రపంచంలో  ఏ దేశంలో లేని విధంగా వీధి కుక్కల సమస్య భారత్‌లో ఉంది.  భారత్‌లో ఏటా 15 లక్షల మంది కుక్క కాటుకు గురవుతున్నారని ఒక అంచనా. భారత్‌లో రేబిస్‌ వ్యాధితో ఏటా 20 వేల మంది చనిపోతున్నారు. వీరిలో 40% మంది 15 ఏళ్లలోపు వారే. అయితే సమస్య తీవ్రంగా ఉన్నదని తెలిసి కూడా ప్రభుత్వాలు కట్టడి చేయలేకపోతున్నాయి. 


భారత్‌లో 30 లక్షలకుపైగా వీధి శునకాలు


భారతదేశంలో సుమారు 30లక్షల వీధి కుక్కలు ఉన్నట్లు ఒక అంచనా.భారతీయులు కుక్కలకు ఆహారం వేసి పెంచి పోషిస్తారు. కుక్కల సంఖ్య పెరగడానికి ఇదొక కారణం. రాత్రి సమయంలో వీధుల్లోకి వెళ్తే ఎక్కడపడితే అక్కడ కుక్కల అరుపులు వినిపిస్తాయి. అవి ఎప్పుడు ఎలా దాడి చేస్తాయో ఊహించలేం. ఈ సమస్యను పరిష్కరించడం చాలా కష్టం. ఎందుకంటే కుక్కలను చంపడం నేరం. అలా అని వీటికి వాక్సిన్ వేయించే ప్రయత్నం కూడా పూర్తిగా ఫలించడం లేదు. వీధి కుక్కల సమస్యకు పరిష్కారం లభించే వరకు భారతదేశంలోని ప్రధాన నగరాలు ప్రమాదంలో ఉన్నట్లేనని నిపుణులు చెబుతున్నారు. 


పెంపుడు కుక్కలనూ రోడ్లపై వదిలేస్తున్న జనం ! 
  
వీధి శునకాలను మూడు విభాగాలుగా విభజించవచ్చు. మొదటి రకం- రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతూ మనుషులపై పాక్షికంగా ఆధారపడే కుక్కలు. వీటికి సొసైటీలు, కాలనీల్లో ఉండే ప్రజలు ఆహారాన్ని అందిస్తారు. రెండో రకం – మనుషులపై ఆధారపడకుండా స్వేచ్ఛగా తిరిగే వీధి కుక్కలు. ఇలాంటి వీధి కుక్కలు తమ ఆహారాన్ని చెత్త కుప్పలు, ఇతర ప్రదేశాల్లో సంపాదించుకుంటాయి. మూడో రకం విడిచి పెట్టబడిన పెంపుడు కుక్కలు. ‘2021 స్టేట్‌ ఆఫ్‌ పెట్‌ హోమ్‌ లెస్‌నెస్‌ ఇండెక్స్‌’ నివేదిక ప్రకారం… మిగతా దేశాల కంటే పెంపుడు జంతువులను వదిలించుకోవడం ఇండియాలో ఎక్కువ. ఇండియాలో 50 శాతానికి పైగా ప్రజలు తమ పెంపుడు జంతువులను వదిలించుకున్నట్లు అంగీకరించారు. మిగతా దేశాల్లో ఇది 28 శాతమే


వీధి కుక్కలను చంపడం నేరం ! 


వీధి కుక్కల సమస్యకు పరిష్కారం అనగానే అందరికీ వచ్చే మొదటి ఆలోచన వాటిని చంపేయడం. అయితే ఈ పద్ధతిని పాటించడానికి ప్రయత్నించిన చాలా దేశాలు విఫలమయ్యాయి. ఇండియాలో వీధి జంతువులను చంపడం చట్ట విరుద్ధం. అయినా ఈ పద్ధతిని అనుసరించారు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. కారణం కుక్కల్లో గర్భ ధారణ సమయం రెండు నెలలే. అంతే కాకుండా అవి ఎక్కువ పిల్లలకు జన్మనిస్తాయి. అంటే ఏదైనా పట్టణం లేదా గ్రామంలో వీధి కుక్కలను పూర్తిస్థాయిలో చంపేయాలంటే ఆ ప్రక్రియను రెండు నెలల్లోనే పూర్తిచేయాల్సి ఉంటుంది. లేకుంటే వీధి కుక్కల సంఖ్య గరిష్ట పరిమితికి చేరుకుంటుంది.  


సంతానోత్పత్తి లేకుండా చేసే ప్రయత్నాలు ! 


వీధి కుక్కల సమస్యకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని రకాల పరిష్కారమార్గాలను సూచించింది. అందులో ఒకటి పెంపుడు కుక్కలకు సంతానం కలగకుండా శస్త్ర చికిత్స చేయాలి. రెండోది పెంపుడు జంతువుల నియంత్రణా చట్టాలను కఠినంగా అమలుచేయాలి. తద్వారా వీధి కుక్కల సంఖ్యను కొంతమేర నియంత్రించవచ్చు. ప్రభుత్వాలు ప్రస్తుతం అదే పని చేస్తున్నాయి. 


గతంలో సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు ! 
 
వీధి కుక్కల సమస్యకు హేతుబద్ధమైన పరిష్కారం కనుగొనాలని గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.  వాటి విచారణలో వీధికుక్కల బెడదకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన సుప్రీంకోర్టు.. ఒక వ్యక్తిపై వీధి కుక్కల దాడి జరిగితే అతనికి టీకాలు వేయడం, ఆసుపత్రి చికిత్స ఖర్చులు భరించడం కుక్కకు ఆహారం ఇస్తున్న వ్యక్తి బాధ్యత అని తెలిపింది. వీధికుక్కల బెడదకు పరిష్కారం కనుగొనడం, వీధికుక్కలకు ఆహారం అందించే వ్యక్తుల మధ్య సమతుల్యతను సృష్టించడం, వీధికుక్కల దాడుల నుండి అమాయక ప్రజలను రక్షించడం చాలా అవసరమని ధర్మాసనం ఉద్ఘాటించింది. ఆహారం లేకపోవడం వల్ల కుక్కలు దూకుడుగా మారవచ్చు లేదా అవి వ్యాధి బారిన పడవచ్చు. రేబిస్ సోకిన కుక్కలను సంబంధిత అధికారులు సంరక్షణ కేంద్రాల్లో ఉంచవచ్చని బెంచ్ సూచించింది. అయితే ఇవన్నీ ఆచరణలో సాధ్యం కావడం లేదు. వీధి కుక్కలకు ఎవరు ఆహారం వేస్తున్నారో చెప్పడం కష్టం.


వీధి కుక్కల సమస్య చాలా పెద్దది. కానీ ఎలా పరిష్కరించాలో మాత్రం అర్థం కాని సమస్యగా మారింది. వీటి బారిన ప్రజలు పిల్లలు..పెద్దలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగని వాటిని నిర్మూలించడం కూడా సాధ్యం కాని పని.