Adani stocks: బిలియనీర్ గౌతమ్ అదానీ సామ్రాజ్యంలోని 10 లిస్టెడ్ కంపెనీల మీద అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా కొనసాగుతోంది. అదానీ స్టాక్స్‌లో సంక్షోభం ఇవాళ (బుధవారం, 22 ఫిబ్రవరి 2023) మరింత తీవ్రరూపం దాల్చింది.
మార్కెట్ విలువ ప్రకారం, ఇవాళ ఒక్కరోజే 10 అదానీ కౌంటర్లు దాదాపు రూ. 40,000 కోట్ల నష్టపోయాయి.
అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ ఎంటిటీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises), ఈ ప్యాక్‌లో టాప్ లూజర్‌గా నిలిచింది, 7% పైగా పడిపోయింది.
మరో నాలుగు స్క్రిప్‌లు - అదానీ ట్రాన్స్‌మిషన్ (Adani Transmission), అదానీ టోటల్ గ్యాస్ (Adani Total Gas), అదానీ విల్మార్ (Adani Wilmar), అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy) యథాప్రకారం 5% నష్టంతో లోయర్ సర్క్యూట్‌లో సెటిల్ అయ్యాయి.
ఇప్పటి వరకు రూ. 11.5 లక్షల కోట్ల పతనం
జనవరి 24న హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) నివేదిక విడుదలైనప్పటి నుంచి, ఈ 10 అదానీ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ (capitalisation) ఈ రోజు వరకు దాదాపు రూ. 11.5 లక్షల కోట్ల మేర పతనమైంది, ప్రస్తుతం రూ. 7.69 లక్షల కోట్లకు దిగి వచ్చింది. రిపోర్ట్ వచ్చిన కేవలం ఒక్క నెల రోజులలోపే అదానీ స్టాక్స్ విలువలో 60% ఆవిరైంది.
అష్టకష్టాల్లో ఉన్న అదానీ గ్రూప్ తాజాగా మరో తీవ్ర వివాదంలో చిక్కుకుంది. పెయిడ్ ఎడిటర్లతో అదానీ గ్రూప్ సమాచారాన్ని మార్చారని, గౌతమ్ అదానీకి అనుకూలంగా కంటెంట్ క్రియేట్ చేశారని వికీపీడియా (Wikipedia) ఆరోపణలు చేసింది. గౌతమ్ అదానీ, గ్రూప్ కంపెనీలకు సంబంధించిన సమాచారంతో పాటు అదానీ కుటుంబ సభ్యుల విషయంలోనూ పక్షపాతంతో కూడిన సమాచారాన్ని చొప్పించారని విమర్శించింది. వికీపీడియా కంటెంట్‌లో మార్పు చేసిన వారిలో అదానీ గ్రూప్ కంపెనీ ఉద్యోగులు కూడా ఉన్నారని, అదానీ గ్రూప్ కంపెనీలకు సంబంధించిన IP అడ్రస్‌లను తాము గుర్తించినట్లు వికీపీడియా తెలిపింది.
అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై ఇప్పటికే విచారణ ప్రారంభించిన మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (SEBI), లోకల్ రుణాలు & గ్రూప్ కంపెనీల సెక్యూరిటీల రేటింగ్స్‌కు సంబంధించిన వివరాలు ఇవ్వాలని క్రెడిట్ రేటింగ్ సంస్థలను కోరింది. రేటింగ్స్‌లోనూ అవకతవకలు జరిగాయేమోనన్న అనుమానంతో దర్యాప్తు చేస్తోంది. ఒకవేళ, రేటింగ్స్‌లో అవకతవకలు జరిగినట్లు తేలితే అది రేటింగ్ కంపెనీల స్టాక్స్‌ను ముంచేస్తుంది. ఈ గ్రూప్ కంపెనీలకు అప్పులిచ్చిన ఎస్‌బీఐ సహా కొన్ని బ్యాంకుల స్టాక్స్ ఇప్పటికే భారీగా నష్టపోయాయి.
అదానీ రంగంలోకి దిగినా ఫలితం లేకపోయింది
తన ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చేందుకు, అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ స్వయంగా రంగంలోకి దిగారు. కంపెనీల ఆర్థిక పరిస్థితికి ఢోకా లేదంటూ శాంతపరచడానికి ప్రయత్నించారు. అయినా గ్రూప్ స్టాక్స్‌లో పతనం ఆగడం లేదు.
కమ్‌బ్యాక్ ప్లాన్‌లో భాగంగా.., SBI మ్యూచువల్ ఫండ్స్‌కు బకాయి ఉన్న రూ. 1,500 కోట్లను ఇప్పటికే చెల్లించామని, మార్చిలో చెల్లించాల్సిన మరో రూ. 1,000 కోట్లను కూడా ముందుస్తుగానే చెల్లిస్తామని అదానీ పోర్ట్స్ ప్రకటించింది.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన రూ. 5,000 కోట్ల రుణాన్ని కూడా ముందుగానే చెల్లించామని, వచ్చే నెలలో గ్రూప్ 500 మిలియన్ డాలర్ల బ్రిడ్జి లోన్‌ను కూడా చెల్లిస్తామని ఈ గ్రూప్ కొన్ని రోజుల క్రితం ప్రకటించింది.
భారీగా రుణాలు తీసుకుని, ఆ పునాదుల మీద సామ్రాజ్యాన్ని విస్తరించిన అదానీ గ్రూప్, ఇప్పుడు తన దృష్టిని మార్చుకుంది. నగదు పొదుపు, రుణాల చెల్లింపులు, తాకట్టులో ఉన్న షేర్లను విడిపించుకోవడం వంటి ఆర్థిక స్థిరత్వ పనులపై ఫోకస్ పెంచింది. ప్రభుత్వ రంగ విద్యుత్ ట్రేడర్ PTC ఇండియాలోనూ వాటా కోసం బిడ్ వేయకూడదని, ఆ డబ్బులు మిగుల్చుకోవాలని తాజాగా నిర్ణయించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.