Iran Protest: ఇరాన్‌లో హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలు రోజురోజుకూ ఉగ్ర రూపం దాలుస్తున్నాయి. పెద్ద ఎత్తున మహిళలు వీధుల్లోకి వచ్చి హిజాబ్ ధారణను వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్నారు.


మరోవైపు నిరసనలను ఇరాన్‌ భద్రతా దళాలు అణచివేస్తున్నాయి. భద్రతా సిబ్బంది దాడుల్లో ఇప్పటి వరకు 50 మందికి పైగానే ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్‌ హ్యూమన్‌ రైట్స్‌ (ఐహెచ్‌ఆర్‌) అనే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ(ఎన్జీఓ) ప్రకటించింది.


కాల్పులు


ఉత్తర గిలాన్‌ ప్రావిన్స్‌లోని రెజ్‌వన్‌షాహర్‌ పట్టణంలో పోలీసుల కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. బబోల్, అమోల్‌లోనూ నిరసనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. ఇరాన్‌ అత్యున్నత మతపెద్ద ఖమేనీ విగ్రహాన్ని ఆయన స్వస్థలం మషాద్‌లో నిరసనకారులు ధ్వంసం చేశారు.


వివాదం


ఏడేళ్లు పైబడిన మహిళలందరూ తప్పనిసరిగా హిజాబ్ ధరించాల్సిందేనని అక్కడి ప్రభుత్వం నిబంధన అమల్లోకి తెచ్చింది. అప్పటి నుంచి దీనిపై మహిళలు నిరసిస్తూనే ఉన్నారు. ఇటీవల ఓ యువతి ఈ గొడవల్లోనే చనిపోయింది. పోలీసులే ఆమెను కస్టడీలో హింసించి చంపేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 


అంతేకాదు


నిరసనలతోనే మహిళలు ఆగిపోలేదు. తమ జుట్టుని కత్తిరించుకుని, హిజాబ్‌లను కాల్చేస్తున్న వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఇరాన్‌లో ఇప్పుడిదో ఉద్యమంలా మారింది. ఇరాన్ మహిళలంతా తమ జుట్టుని కట్ చేసుకుని, తరవాత హిజాబ్‌లను మంటల్లో తగలబెడుతున్న వీడియోలు షేర్ చేస్తున్నారు. హిజాబ్‌లకు వ్యతిరేకంగా ఇలా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.


మహ్‌సా అమినిని అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్‌లో తీవ్రంగా హింసించారని, ఆ బాధ తట్టుకోలేకే ఆమె చనిపోయిందని మహిళలు ఆరోపిస్తున్నారు. అయితే...పోలీసులు మాత్రం దీన్ని కొట్టి పారేస్తున్నారు. ఆమెకు హఠాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోయిందని వివరిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులు మాత్రం మహ్‌సా అమిని పూర్తి ఆరోగ్యంగా ఉందని వెల్లడించారు. ఇరాన్‌లో ఇస్లామిక్‌ లా ప్రకారం...ఏడేళ్లు పైబడిన మహిళలెవరైనా జుట్టుని హిజాబ్‌తో కవర్ చేసుకోవాలి. పొడవాటి, వదులుగా ఉండే దుస్తులే ధరించాలి. ఈ ఏడాది జులై5న అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ప్రత్యేకించి మహిళల వేషధారణపై ఇంకా ఆంక్షలు విధించారు. హిజాబ్ తప్పనిసరిగా ధరించాలని ఆదేశించారు. దీనిపైనే...మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించిన వారిని అరెస్ట్ చేసింది ఇరాన్ ప్రభుత్వం. హిజాబ్‌ను ధరించని మహిళలకు కఠినశిక్ష అమలు చేయాలని రూల్స్ పాస్ చేశారు. అక్కడి మహిళలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా హిజాబ్‌లను తొలగిస్తున్నారు.  


 "ఇరాన్‌లో హిజాబ్ ధరించకపోవటం శిక్షార్హమైన నేరమైపోయింది. దీన్ని ఖండించేందుకు దేశమంతా ఒక్కటి కావాలి" అని ట్విటర్ వేదికగా పోస్ట్‌లు చేశారు. ఇంకొందరు పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఇప్పుడే కాదు. కొంత కాలంగా హిజాబ్‌పై ఇరాన్‌లోప్రభుత్వం, మహిళల మధ్య ఇలాంటి ఘర్షణ వాతావరణమే ఉంది. ప్రభుత్వం మరీ క్రూరంగా ప్రవర్తిస్తోందని మహిళలు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.


Also Read: Lok Sabha Election 2024: సోనియా గాంధీతో నితీశ్, లాలూ భేటీ- టార్గెట్ 2024పై చర్చ!