Bathukamma 2022 Celebrations in Telangana: తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాలు నేడు ప్రారంభమయ్యాయి. ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్క జాము ఆయే చందమామ అంటూ ఆడపడుచులు తెలంగాణ అస్తిత్వాన్ని తెలిపే పండుగ బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్‌ 3 వరకు జరగనున్న బతుకమ్మ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అక్టోబర్‌ 3న ట్యాంక్‌ బండ్‌ వద్ద నిర్వహించే ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై బీఆర్‌కే భవన్‌లో సమన్వయ సమావేశం ఇటీవల జరిగింది. ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై చర్చించారు. ఈ నెల 25 నుంచి అక్టోబర్‌ 3వ తేదీ వరకు బతుకమ్మ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. భాగ్యనగరంలోనూ అధికారులు బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు పూర్తిచేశారు. 


ఏ రోజు ఏ బతుకమ్మని పూజిస్తారంటే..
ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు సద్దుల బతుకమ్మను సాగనంపడంతో ముగుస్తాయి. బతుకమ్మ పండుగ చివరి రోజు ఆఖరి రోజును సద్దుల బతుకమ్మ అంటారు. బతుకమ్మలను సాధారణ రోజుల కంటే పెద్ద పరిమాణంలో తయారు చేసి నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ పండుగను దుర్గా అష్టమి రోజు జరుపుకుంటారు..అప్పుడప్పుడు తిథులు తగులు-మిగులు వచ్చినప్పుడు మహర్నవమి రోజు కూడా చేస్తారు.
సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 3 వరకూ ఏ రోజు ఏ బతుకమ్మను పూజిస్తారంటే...
సెప్టెంబరు 25 - ఎంగిలి పూల బతుకమ్మ
సెప్టెంబరు 26 - అటుకుల బతుకమ్మ
సెప్టెంబరు 27 - ముద్దపప్పు బతుకమ్మ
సెప్టెంబరు 28 - నానే బియ్యం బతుకమ్మ
సెప్టెంబరు 29 - అట్ల బతుకమ్మ
సెప్టెంబరు 30 - అలిగిన బతుకమ్మ
అక్టోబరు 1 - వేపకాయల బతుకమ్మ
అక్టోబరు 2 - వెన్నముద్దల బతుకమ్మ
అక్టోబరు 3 - సద్దుల బతుకమ్మ 


హైదరాబాద్ కూడళ్లలో బతుకమ్మ లోగోలు 
రాష్ట్రంలో బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు  బతుకమ్మ ఘాట్, ట్యాంక్ బండ్, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్ల మరమ్మతులు పూర్తిచేస్తున్నారు అధికారులు. మహిళలు బతుకమ్మ ఉత్సవాల్లో భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉండడంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు. బతుకమ్మలను నిమజ్జనం చేసే ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని అధికారులకు సీఎస్ సోమేశ్ కుమార్ సూచించారు. బతుకమ్మ పండగపై ఆకర్షణీయమైన డిజైన్‌లతో మెట్రో పిల్లర్లను అలంకరించాలన్నారు. ఎల్బీ స్టేడియం, హైదరాబాద్ లోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మ లోగోలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 






బతుకమ్మ చీరల పంపిణీ..
తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మ పండుగకు ప్రభుత్వం చీరల పంపిణీ ఇదివరకే ప్రారంభించింది. ఈసారి 240 ఆకర్షణీయమైన డిజైన్లతో బతుకమ్మ చీరలు తయారుచేపించింది ప్రభుత్వం. 30 రంగుల్లో 800 కలర్ కాంబినేషన్లలో బ‌తుక‌మ్మ చీరలు సిద్ధం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు కోట్ల మీటర్లు అవసరమని అంచనా వేయగా, పోయిన సంవత్సరం ఆలస్యంగా ఉత్పత్తి చేసిన చీరలను 1.23 కోట్ల మీటర్లు అప్పుడే స్వీకరించారు. ఈ ఏడాది రాజన్న సిరిసిల్ల జిల్లాకు 4.70 కోట్లు, గర్షకుర్తి, వరంగల్ టెక్స్‌టైల్ పార్కు కు కలిపి కోటి మీటర్లు కేటాయించారు. టెస్కో మంగళవారం నాటికి 3. 25 కోట్ల మీటర్లు సేకరించింది. ఇంకా రెండు 2.45 కోట్ల మీటర్లు రావాల్సి ఉంది. చేనేత, జౌళిశాఖ ఉత్పత్తులు ఈ నెల 20 లోపు పూర్తిచేసి అందించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి అవసరమైన చీరలో సింహభాగం జిల్లాలోని మరమగ్గాలపై ఉత్పత్తి చేస్తున్నారు. టెక్స్ టైల్ పార్కులో ఐదు రకాల డిజైన్లతో 30 లక్షల మీటర్ల జాకెట్ వస్త్రాన్ని ప్రత్యేకంగా కేటాయించారు. చీర అంచుల్లో రంగు రంగుల నూలుతో తయారు చేసిన ఆకర్షణీయమైన డిజైన్లు వస్తున్నాయి.