Iran Hijab Protest:
సోషల్ మీడియాలో పోస్ట్‌లు..
ఇరాన్‌లో మహిళలు హిజాబ్ ధరించాలన్న నిబంధనపై పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఓ 22 ఏళ్ల యువతి మృతితో ఒక్కసారిగా అక్కడ వ్యతిరేకత మొదలైంది. హిజాబ్ ధరించలేదని మొరాలిటీ పోలీసులు ఓ యువతిని ఇటీవల అరెస్ట్ చేశారు. కస్టడీలోనే ఆమె మృతి చెందింది. దీనిపై మహిళలు భగ్గుమన్నారు. రోడ్లపైకి వచ్చి హిజాబ్‌లు తొలగించి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినదించారు. పోలీసులు ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేసి చంపారని ఆరోపిస్తున్నారు వారంతా. అయితే...కొన్ని మీడియా రిపోర్ట్‌లు మాత్రం ఆ యువతి గుండెపోటుతో మరణించిందని అంటున్నాయి. నిరసనలతోనే మహిళలు ఆగిపోలేదు. తమ జుట్టుని కత్తిరించుకుని, హిజాబ్‌లను కాల్చేస్తున్న వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఇరాన్‌లో ఇప్పుడిదో ఉద్యమంలా మారింది. ఇరాన్ మహిళలంతా తమ జుట్టుని కట్ చేసుకుని, తరవాత హిజాబ్‌లను మంటల్లో తగలబెడుతున్న వీడియోలు షేర్ చేస్తున్నారు. హిజాబ్‌లకు వ్యతిరేకంగా ఇలా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మహ్‌సా అమినిని అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్‌లో తీవ్రంగా హింసించారని, ఆ బాధ తట్టుకోలేకే ఆమె చనిపోయిందని మహిళలు ఆరోపిస్తున్నారు. అయితే...పోలీసులు మాత్రం దీన్ని కొట్టి పారేస్తున్నారు. ఆమెకు హఠాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోయిందని వివరిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులు మాత్రం మహ్‌సా అమిని పూర్తి ఆరోగ్యంగా ఉందని వెల్లడించారు.
చట్ట ప్రకారం..
ఇరాన్‌లో ఇస్లామిక్ లా ప్రకారం...ఏడేళ్లు పైబడిన మహిళలెవరైనా జుట్టుని హిజాబ్‌తో కవర్ చేసుకోవాలి. పొడవాటి, వదులుగా ఉండే దుస్తులే ధరించాలి. ఈ ఏడాది జులై5న అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ప్రత్యేకించి మహిళల వేషధారణపై ఇంకా ఆంక్షలు విధించారు. హిజాబ్ తప్పనిసరిగా ధరించాలని ఆదేశించారు. దీనిపైనే...మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించిన వారిని అరెస్ట్ చేసింది ఇరాన్ ప్రభుత్వం. హిజాబ్‌ను ధరించని మహిళలకు కఠినశిక్ష అమలు చేయాలని రూల్స్ పాస్ చేశారు. అక్కడి మహిళలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా హిజాబ్‌లను తొలగిస్తున్నారు. యువతి మరణానికి కారణమైన పోలీస్‌ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కొందరు జర్నలిస్ట్‌లు కూడా మహిళలకు మద్దతుగా నిలిచారు. "ఇరాన్‌లో హిజాబ్ ధరించకపోవటం శిక్షార్హమైన నేరమైపోయింది. దీన్ని ఖండించేందుకు దేశమంతా ఒక్కటి కావాలి" అని ట్విటర్ వేదికగా పోస్ట్‌లు చేశారు. ఇంకొందరు పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఇప్పుడే కాదు. కొంత కాలంగా హిజాబ్‌పై ఇరాన్‌లోప్రభుత్వం, మహిళల మధ్య ఇలాంటి ఘర్షణ వాతావరణమే ఉంది. ప్రభుత్వం మరీ క్రూరంగా ప్రవర్తిస్తోందని మహిళలు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. కావాలనే కొందరు మహిళలు రోడ్లపైకి వచ్చి హిజాబ్‌లను తొలగిస్తున్నారు. పోలీసులు మాత్రం ఆ యువతి మరణానికి తమకు ఎలాంటి సంబంధం లేదని
వివరణ ఇస్తున్నారు. అరెస్ట్ అయ్యే సమయానికే ఆమె అనారోగ్యంతో బాధ పడుతోందని, ఆ తరవాత అనుకోకుండా ఆమె చనిపోయిందని చెబుతున్నారు. ఆమెపై భౌతికంగా ఎలాంటి దాడి చేయలేదని స్పష్టం చేస్తున్నారు. కానీ...మహిళల ఆగ్రహావేశాలు మాత్రం చల్లారడం లేదు.
Also Read: UK Leicester City: ఇంగ్లాండ్‌లో హిందూ ముస్లింల మధ్య ఘర్షణ, భారత్-పాక్ మ్యాచ్ కారణంగానే?