Queen Elizabeth II Funeral: 


భద్రత కట్టుదిట్టం..


పలు దేశాల నేతలు, సంపన్నులు అందరూ లండన్‌కు చేరుకుంటున్నారు. క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు హాజరు కానున్నారు. వెస్ట్‌మిన్‌స్టర్ హాల్‌లో రాణి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరగనున్నాయి. దేశవ్యాప్తంగా మరో వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నారు. ఈ కార్యక్రమంలో మొత్త 2 వేల మంది పాల్గొంటారు. వీరిలో 500 మంది పలు దేశాలకు చెందిన నేతలే. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ఎంపెరర్ నరుహిటో, చైనా వైస్‌ ప్రెసిడెంట్ వాంగ్ కిషాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోస హాజరవుతారు. భారత్ తరపున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళి అర్పించేందుకు వెళ్లారు. లండన్‌లో మునుపెన్నడూ చూడని స్థాయిలో భారీ భద్రతల నడుమ అంత్యక్రియలు పూర్తి కానున్నాయి. "ప్రపంచంలోని కీలక నేతలందరూ కలిసి ఒకే వేదికపై వచ్చి దశాబ్దాలు దాటింది. ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది. అందుకే అప్రమత్తంగా ఉంటున్నాం" అని లండన్ భద్రతాధికారులు చెబుతున్నారు. "కొందరు ఈ సందర్భాన్ని అదనుగా చూసుకుని విధ్వంసం సృష్టించాలని చూస్తారు. అందుకే...భద్రతను కట్టుదిట్టం చేశాం. పోలీసులు అంతటా నిఘా పెట్టారు. అంత్యక్రియలు ఎలాంటి ఇబ్బందు లేకుండా పూర్తయ్యేలా చూస్తున్నాం" అని మేయర్ సాదిక్ ఖాన్ వెల్లడించారు. 


ఎప్పుడు, ఎక్కడ..? 


వెస్ట్‌మిన్‌స్టర్ అబేలో ఆమె శవపేటికను తరలిస్తారు. రాయల్ స్టాండర్ట్ ఫ్లాగ్‌ను ఆ శవపేటికకు చుడతారు. దానిపై రాణి ధరించిన కిరీటం ఉంచుతారు. అక్కడ ఓ పెద్ద గంట ఉంటుంది. 96 ఏళ్ల వయసులో రాణి చనిపోయినందున, నిముషానికోసారి ఆ గంటను మోగిస్తారు. అంటే...అలా 96 సార్లు మోగిస్తారు. అక్కడి నుంచి రాణి శవపేటికను విండ్సర్ క్యాసిల్‌కు తరలిస్తారు. సెయింట్ జార్జ్ చాపెల్‌లోని ఆమె తల్లిదండ్రులు, భర్త, సోదరి ప్రిన్స్ మార్గరెట్ సమాధుల పక్కనే ఆమెనూ పూడ్చి పెట్టనున్నారు. ఇది పూర్తి కాగానే సంప్రదాయ సంగీతాన్ని
వినిపిస్తారు. చివర్లో ట్రంపెట్‌తో ఆమెకు చివరిసారి నివాళి అర్పిస్తారు. దేశమంతా ఓ రెండు నిముషాల పాట మౌనం పాటిస్తుంది. వెస్ట్‌మిన్‌స్టర్ డీన్‌ డేవిడ్ హొయ్‌లే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాన్ని ప్రపంచమంతా లైవ్‌లో వీక్షించేందుకు అవకాశముంది. 
BBC One, BBC Newsలో లైవ్ ఇస్తారు. "క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారు. ఇప్పటికే ఆమె లండన్ చేరుకున్నారు. భారత ప్రభుత్వం తరపున ఆమె నివాళి  అర్పిస్తారు" అని ట్వీట్ చేసింది. ఎలిజబెత్ రాణి మృతికి సంతాపంగా భారత్‌ ఓ రోజు సంతాపదినం పాటించింది. మరుసటి రోజు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఢిల్లీలోని బ్రిటిష్ హై కమిషన్‌కు వెళ్లారు. భారత్ తరపున 
సెప్టెంబర్ 12వ తేదీన సంతాపం తెలిపారు. గత వారమే విదేశాంగ శాఖ...ద్రౌపది ముర్ము పర్యటనపై ప్రకటన చేసింది. భారత ప్రభుత్వం తరపున ఆమె లండన్‌ వెళ్తారని వెల్లడించింది.