Stocks to watch today, 19 September 2022: ఇవాళ (సోమవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 19 పాయింట్లు లేదా 0.11 శాతం గ్రీన్‌ కలర్‌లో 17,582 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI): దేశంలోనే అతి పెద్ద రుణదాత SBI, ఎస్‌బీఐ గ్లోబల్ ఫ్యాక్టర్స్‌లో (SBI Global Factors) ఇతరుల వద్ద ఉన్న 14 శాతం వాటాను కొనుగోలు చేసింది. దీంతో, ఎస్‌బీఐ గ్లోబల్ ఫ్యాక్టర్స్‌లో 100 శాతం వాటా SBI చేతికి వచ్చి, పూర్తి స్థాయి అనుబంధ సంస్థగా మారింది. SIDBI (6.53 శాతం), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (4.34 శాతం), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.95 శాతం) నుంచి 13.82 శాతం ఈక్విటీని SBI కొనుగోలు చేసింది.


హీరో మోటోకార్ప్: దేశంలోనే అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌, వచ్చే నెలలో, దేశీయ మార్కెట్లోకి తన మొదటి ఎలక్ట్రిక్‌ బైక్‌ను విడుదల చేస్తోంది. తద్వారా ఎలక్ట్రిక్ విభాగంలోకి అడుగు పెట్టబోతోంది. అక్టోబర్‌ 7న విడా (Vida) బ్రాండ్‌ పేరిట ఈవెంట్‌ను నిర్వహించనుంది.


మారుతి సుజుకి: దేశంలోనే అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి, ఈ ఏడాది మే 4 - జులై 30 మధ్య తయారు చేసిన 5002 సూపర్ క్యారీ వాహనాలను రీకాల్ చేయాలని నిర్ణయించింది. కో డ్రైవర్ సీటులో, సీట్ బెల్ట్ బకిల్ బ్రాకెట్‌కు అమర్చిన బోల్ట్‌ను తనిఖీ చేసి, మరింత గట్టిగా బలంగా బిగించడం కోసం ఆ వాహనాలను రీకాల్ చేస్తోంది. బోల్ట్ టార్కింగ్‌లో లోపం ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.


అంబుజా సిమెంట్స్, ఏసీసీ: అదానీ కుటుంబం అంబుజా సిమెంట్స్ & ఏసీసీ కొనుగోలును పూర్తి చేసి దేశంలో రెండో అతి పెద్ద సిమెంట్ ప్లేయర్‌గా అవతరించింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సంస్థ (స్పెషల్‌ పర్పస్ వెహికల్‌) ఎండీవర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా, స్విస్ సంస్థ హోల్సిమ్ ద్వారా & ఓపెన్ ఆఫర్‌ ద్వారా లావాదేవీలు నిర్వహించి, ఈ రెండు సిమెంట్‌ కంపెనీల కొనుగోలును అదానీ కుటుంబం పూర్తి చేసింది.


అదానీ పవర్: అదానీ గ్రూప్‌లోని యుటిలిటీ విభాగం అదానీ పవర్‌ డీ లిస్టింగ్‌ కోసం, ప్రమోటర్ సంస్థ అయిన అదానీ ప్రాపర్టీస్ (Adani Properties) స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి సూత్రప్రాయ ఆమోదం పొందలేక పోయినందున, ఈ కంపెనీని డీ లిస్ట్ చేసే ప్రతిపాదన రద్దయింది. డీ లిస్టింగ్ ఆఫర్‌ను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రమోటర్ గ్రూప్‌లోని ఒక సభ్యుడి నుంచి లేఖ అందిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో అదానీ పవర్ పేర్కొంది.


యెస్ బ్యాంక్: కార్పొరేట్ దివాలా ప్రక్రియ కింద, రుణ పరిష్కారం తర్వాత, ఝబువా పవర్‌లో (Jhabua Power) 8.74 శాతం వాటాను స్వాధీనం చేసుకున్నట్లు ఈ ప్రైవేట్ బ్యాంక్‌ తెలిపింది. తనఖా పెట్టిన ఝబువా పవర్‌ 12,63,50,146 ఈక్విటీ షేర్లు లేదా 8.74 శాతం వాటాను యెస్ బ్యాంక్ స్వాధీనం చేసుకుంది.


టాటా పవర్: సౌత్ ఈస్ట్ యూపీ పవర్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ (SEUPPTCL) కొనుగోలును రిసర్జెంట్ పవర్ వెంచర్స్ (Resurgent Power Ventures) పూర్తి చేసింది. రిసర్జెంట్ పవర్ వెంచర్స్ సింగపూర్‌కు చెందిన జాయింట్ వెంచర్. ఇందులో 26 శాతం వాటాపై టాటా పవర్‌కు హక్కుంది. సింగపూర్‌లోని తన పూర్తి యాజమాన్య కంపెనీ ద్వారా ఈ వాటాను టాటా పవర్‌ హోల్డ్‌ చేస్తోంది.


ఎక్సైడ్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్: ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్‌ను హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్‌లో విలీనానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఆమోదించింది. NCLT ముంబై బెంచ్ ఈ ప్రతిపాదనను ఆమోదించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.