UK Leicester City: 


ఉన్నట్టుండి చెలరేగిన ఘర్షణ..


ఇంగ్లాండ్‌లోని లీసెస్టర్ సిటీ (Leicester city)లో హిందూ, ముస్లిం వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఒక్కసారిగా హిందువులంతా వచ్చి చేరుకుని నిరసనలు చేపట్టారు. అదే సమయంలో అక్కడే ఉన్న ముస్లింలు కొంత మంది ఒక్కటయ్యారు. ఫలితంగా...రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో ముస్లింలకు చెందిన వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. అటు పక్కనే హిందూ ఆలయం కూడా ఉంది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. గొడవ ముదిరి మరీ హింసాత్మకంగా మారకముందే వాతావరణాన్ని చల్లబరిచారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు అక్కడి పోలీసులు వెల్లడించారు. ఎలాంటి అనుమతి లేకుండా, అప్పటికప్పుడు అక్కడ నిరసనలు చేపట్టారని, అందుకే ఘర్షణ జరిగిందని తెలిపారు. మరికొద్ది రోజుల వరకూ ఆ ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. ఆగస్టు 28వ తేదీన ఆసియా కప్ 2022లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. అప్పటి నుంచి లీసెస్టర్ సిటీలో ఇలాంటివి వెలుగు చూస్తూనే ఉన్నాయి. "తూర్పు లీసెస్టర్ సిటీలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు పోలీసు అధికారులను పంపి పరిస్థితులను కంట్రోల్ చేస్తున్నాం. మరికొందరు స్పెషల్ ఆఫీసర్స్‌ను కూడా రంగంలోకి దించుతున్నాం. దయచేసి ఎలాంటి ఘర్షణలకు దిగకండి" అని చీఫ్ కానిస్టేబుల్ రాబ్ నిక్సాన్ వెల్లడించారు. 




శాంతియుతంగా ఉండాలి: మతపెద్దలు


కొందరు మత పెద్దలు ఈ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటివి చాలా ప్రమాదకరమని అన్నారు. భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరిగినప్పటి నుంచి ఇలాంటి అలజడి కనిపిస్తోందని, గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఇలా హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. "మనకు కావాల్సింది శాంతియుత వాతావరణం. ఇప్పటికిప్పుడే అలాంటి ఘటనలు ఆగిపోవాలి. కొందరు యువకులు కావాలనే ఇలాంటివి సృష్టిస్తున్నారు" అని ఓ మతపెద్ద అన్నారు. దశాబ్దాలుగా ఇక్కడి హిందు, ముస్లింలు కలిసిమెలిసి ఉన్నారని, ఉన్నట్టుండి ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదని చెబుతున్నారు. హింస ద్వారా సాధించేది ఏమీ లేదని చెప్పారు. లీసెస్టర్ ఈస్ట్ ఎంపీ కూడా ట్విటర్ వేదికగా స్పందించారు. ఈ హింసను మానుకోవాలని యువతకు సూచించారు.