Iran Threatens Trump: 



క్రూజ్ మిజైల్..


అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ట్రంప్‌ను చంపేందుకు కొత్త మిజైల్‌ను తయారు చేశామంటూ సంచలన ప్రకటన చేసింది. 1,650 కిలోమీటర్ల రేంజ్ ఉన్న క్రూజ్ మిజైల్‌ను తయారు చేసినట్టు వెల్లడించింది. ఇరాన్ టాప్ కమాండర్ ఆమిర్ అలీ హజిజదేహ్ ఈ హెచ్చరిక చేశారు. ఇది అత్యంత ప్రమాదకరమైన మిజైల్ అని తేల్చి చెప్పారు. ఇరాన్ మిలిటరీ కమాండర్‌ కాసిమ్ సోలిమనీని చంపినందుకు ప్రతీకారంగా ట్రంప్‌ను హతమార్చుతామని వార్నింగ్ ఇచ్చారు. ఈ హెచ్చరికల తరవాత పశ్చిమ దేశాలన్నీ ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఆ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. రష్యా ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుందో అంచనా వేయలేని పరిస్థితి. పైగా పుతిన్ ఉక్రెయిన్‌పై దాడి కోసం ఇరాన్‌ డ్రోన్‌లనే వినియోగిస్తున్నారు. అటు అమెరికా ఉక్రెయిన్‌కు మద్దతు ప్రకటించింది. ఇలాంటి కీలక తరుణంలో ఇరాన్‌ హెచ్చరించడం సంచలనమవుతోంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఏరో స్పేస్ ఫోర్స్ అధిపతి ఆమిర్ అలీ ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు. అయితే...అమాయకమైన అమెరికన్లను చంపడం తమ ఉద్దేశం కాదని, కేవలం తమ కమాండర్‌ను చంపినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. 2020లో ట్రంప్ హయాంలో అమెరికా సేనలు బాగ్దాద్‌లో డ్రోన్‌ దాడులు చేశారు. ఆ దాడుల్లోనే ఇరాన్ మిలిటరీ కమాండర్ కాసిమ్ సోలిమనీ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు రష్యాకు పెద్ద ఎత్తున డ్రోన్‌ల సాయం చేస్తోంది ఇరాన్. గతేడాది ఈ దేశం హైపర్‌సోనిక్ బాలిస్టిక్ మిజైల్‌ను తయారు చేసింది. 


హిజాబ్ చట్టం రివ్యూ..


కఠినతరమైన ఇరాన్ ప్రభుత్వం హిజాబ్ చట్టాన్ని రివ్యూ (Hijab Law Review) చేస్తున్నట్టు అటార్నీ జనరల్ వెల్లడించారు. దశాబ్దాల క్రితం తయారు చేసిన చట్టాన్నే ఇప్పుడు అమలు చేయడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. మూడు నెలలుగా ఉద్యమం కొనసాగుతున్న నేపథ్యంలో...చట్టంలో మార్పులు చేర్పులు తప్పవని భావిస్తోంది ప్రభుత్వం. ఐక్యరాజ్య సమితి వెల్లడించిన లెక్కల ప్రకారం...ఇప్పటి వరకూ ఈ నిరసనల్లో 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే తీరులో ఉద్యమం కొనసాగితే...మరింత ప్రాణనష్టం సంభవించే ప్రమాదం లేకపోలేదు. "పార్లమెంట్‌తో పాటు న్యాయవ్యవస్థ కూడా హిజాబ్ చట్టాన్ని రివ్యూ చేస్తున్నాయి. ఇందులో ఏమైనా మార్పులు చేయొచ్చా అనే దిశగా ఆలోచిస్తున్నాయి" అని ఇరాన్ అటార్నీ జనరల్ మహమ్మద్ జాఫర్ మొంటజెరి వెల్లడించారు. అయితే...ఎలాంటి మార్పులు చేస్తారన్న విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ రివ్యూ టీంని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇటీవలే...పార్లమెంట్‌ కల్చరల్ కమిషన్‌తో ఈ బృందం సంప్రదింపులు జరిపింది. వారం లేదా రెండు వారాల్లో ఈ మార్పులపై స్పష్టత వచ్చే అవకాశముందని అటార్నీజనరల్ తెలిపారు. ఇరాన్‌లో ఇస్లామిక్‌ లా ప్రకారం...ఏడేళ్లు పైబడిన మహిళలెవరైనా జుట్టుని హిజాబ్‌తో కవర్ చేసుకోవాలి. పొడవాటి, వదులుగా ఉండే దుస్తులే ధరించాలి. ఈ ఏడాది జులై5న అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ప్రత్యేకించి మహిళల వేషధారణపై ఇంకా ఆంక్షలు విధించారు.


Also Read: Ideas of India 2023: వర్క్‌ ఫ్రమ్ హోమ్‌ విధానం సరికాదు, మూన్‌లైటింగ్‌ అనైతికం - ఇన్‌ఫోసిస్ నారాయణమూర్తి