Jammu and Kashmir News: నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు సృష్టించి, వాటి ద్వారా ప్రభుత్వ విధానాలను విమర్శంచినందుకు జమ్ము కశ్మీర్ లో ఓ ఉపాధ్యాయుడు సస్పెండ్ అయ్యారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ప్రభుత్వాన్ని విమర్శించినందుకు అతనిపై సస్పెన్షన్ ఆర్డర్ జారీ చేసినట్లు పరిపాలక శాఖ పేర్కొంది. 


జోగిందర్ సింగ్ అనే వ్యక్తి రాంబన్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అతను తన పేరుతో కాకుండా వేరే పేరుతో ఫేస్ బుక్ ఖాతా తెరిచాడు. అందులో కేంద్రపాలిత ప్రాంత పరిపాలనా విధానాలను విమర్శిస్తూ పోస్టులు పెట్టాడు. ఇది గుర్తించిన రాంబన్ పరిపాలన శాఖ అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది. దీనిపై  రాంబన్ డిప్యూటీ కమిషనర్ ముస్రత్ ఉన్ ఇస్లాం ఉత్తర్వు జారీచేశారు. పూర్తి విచారణ చేపట్టారు. 


విమర్శించే వారిపై చర్యలు


2019 నుంచి జమ్ముకశ్మీర్ పరిపాలన విభాగం సోషల్ మీడియా దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించింది. దీని ద్వారా సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై విమర్శలు చేసేవారిపై చర్యలు తీసుకుంటోంది. 2021లో పరిపాలన ఉద్యోగుల నుంచి వారి సోషల్ మీడియా ఖాతాల సమాచారాన్ని జమ్ము కశ్మీర్ పరిపాలన విభాగం కోరింది. అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలందరూ తమ ఉద్యోగుల సోషల్ మీడియా కార్యకలాపాలను పర్యవేక్షించాలని, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వారిని గుర్తించాలని సూచించింది.  ప్రభుత్వం, ప్రభుత్వ విధానాలపై ఉద్యోగులు విమర్శలకు దూరంగా ఉండాలని జమ్ము కశ్మీర్ ప్రభుత్వ కార్యదర్శి అరుణ్ కుమార్ మెహతా గత వారం హెచ్చరించారు.