ABP Network Ideas of India 2023:
వసుదైవ కుటుంబకమే మన విధానం..
ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సదస్సులో ఇన్‌ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేశారు. వసుదైవ కుటుంబకం అనే విధానంతోనే ప్రపంచానికి భారత్ ఆదర్శంగా నిలిచిందని అన్న ఆయన...సర్వే జనా సుఖీనః అని ఆకాంక్షించే దేశం అని కొనియాడారు.
"సంస్కృతంలో వసుదైవ కుటుంబకం ఓ నానుడి ఉంది. ప్రపంచం భారత్‌ను అలానే గుర్తించాలని కోరుకుంటున్నాను. అత్యుత్తమ విలువలతో మన దేశం నాయకత్వం వహించాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రపంచంలో ఎవరికీ రాని కొత్త ఆలోచలనతో భారతీయులు ముందుకు రావాలి. ఇలాంటి ఆలోచన మాకు మాత్రమే వచ్చిందని భారతీయులు గర్వంగా చెప్పుకోవాలి. మన సమస్యలేంటో గుర్తించాలి. ఇలా సమస్యల్ని గుర్తించడంలోనూ ప్రపంచదేశాల కన్నా మనమే ముందుండాలి"
- నారాయణ మూర్తి, ఇన్‌ఫోసిస్ వ్యవస్థాపకులు
కొన్నేళ్ల క్రితం ఇన్వెస్టర్‌లు పెద్ద ఎత్తున ఇండియాలో పెట్టుబడులు పెట్టారన్న నారాయణమూర్తి...ఇప్పుడు మాత్రం ఫండింగ్ కాస్త తగ్గిందని అన్నారు. ఈ సమస్యను మన దేశంలోని బడా వ్యాపారులంతా గుర్తించాలని సూచించారు. కొత్త ఆలోచనలతో మార్కెట్‌కు ఉత్సాహం తీసుకురావాలని చెప్పారు. ఇదే సమయంలో విద్యార్థుల గురించీ ప్రస్తావించారు నారాయణ మూర్తి. విద్యా సంస్థల్లోనే మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు.
"నేను లక్షలాది మంది ఉద్యోగులతో కలిసి పని చేశాను. చాలా మందిని పరిశీలించాను. విద్యార్థి దశలో చురుగ్గా ఉన్న వాళ్లలో 10-20% మంది జాబ్‌లో చేరగానే అక్కడి పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మలుచుకుంటారు. సమస్య ఉందని తెలిసినా దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్తారు. కానీ మన భారతీయ విద్యా వ్యవస్థలో ఏటా డిగ్రీలు పొందుతున్న విద్యార్థుల చదువులు చాలా భిన్నంగా ఉంటున్నాయి. కేవలం పరీక్షల ముందు మాత్రమే అలెర్ట్ అవుతున్నారు. ఏడాదంతా చదవరు. కేవలం వచ్చి పరీక్షలు రాస్తారు. పాస్ అవుతారు. అక్కడితో సబ్జెక్ట్ మర్చిపోతారు. ఈ విద్యార్థులందరికీ విద్యా సంస్థల్లోనే బయట ఉద్యోగావసరాలకు తగ్గట్టుగా శిక్షణ ఇవ్వడం చాలా కీలకం"
- నారాయణ మూర్తి, ఇన్‌ఫోసిస్ వ్యవస్థాపకులు
ఐటీలో ఈ రెండు మూడేళ్లలో వచ్చిన మార్పులనూ ప్రస్తావించారు నారాయణ మూర్తి. ఆర్గనైజేషన్ కల్చర్ అనేది బలపడాలంటే ఉద్యోగులందరూ కలిసి మెలిసి పని చేయాలని సూచించారు. అందుకే తాను వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌పై పెద్దగా ఆసక్తి చూపించలేదని స్పష్టం చేశారు. మూన్‌లైటింగ్ అనైతికమని ఒకేసారి రెండు కంపెనీల్లో పని చేయడం సరికాదని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో తన అల్లుడు, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ గురించి కూడా మాట్లాడారు.
"2015లో మా అల్లుడు రిషి సునాక్ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. సుధామూర్తి నేను, సునాక్ తల్లిదండ్రులు కూర్చుని చర్చించుకున్నాం. అప్పుడే నిర్ణయించుకున్నాం రాజకీయాల గురించి మాట్లాడుకోకూడదని. మా బంధం వ్యక్తిగతానికే పరిమితం. రాజకీయాలు మాట్లాడం"
- నారాయణ మూర్తి, ఇన్‌ఫోసిస్ వ్యవస్థాపకులు