Iran Anti Hijab Protest:
జుట్టు ముడి వేసుకుని..
ఇరాన్‌లో 80 నగరాల్లో యాంటీ హిజాబ్ నిరసనలు కొనసాగుతున్నాయి. యువతులు, మహిళలు రోడ్లపైకి వచ్చిపెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ఇప్పటికే ఈ నిరనసల్లో 75 మంది చనిపోయినట్టు అక్కడి రిపోర్ట్‌లు కొన్ని చెబుతున్నాయి. ఇప్పుడు మరో యువతి కూడా మృతి చెందింది. అంతకు ముందు ఆ యువతి వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. ఈ ప్రొటెస్ట్‌లో పాల్గొనే ముందు ఆమె...హిజాబ్ తీసేసి తన జుట్టుని ముడి వేసుకుంది. ఆ తరవాత నిరసనల్లోకి వెళ్లింది. ఇప్పుడీ యువతినే దుండుగులు కాల్చి చంపారు. 20 ఏళ్ల హదీస్ నజఫీని
పొత్తి కడుపులో, మెడపై, గుండెపై కాల్పులు జరిపారు. ఆమె అంత్యక్రియల వీడియో కూడా బాగా వైరల్ అవుతోంది. సమాధి పక్కనే మహిళలు ఆమె ఫోటో పట్టుకుని కన్నీరు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె శరీరంలో మొత్తం 6 బుల్లెట్లు గుర్తించారు. ఇరానియన్ జర్నలిస్ట్ ఒకరు ట్విటర్‌లో హదీస్ నజాఫీ అంత్యక్రియల వీడియో పోస్ట్ చేశారు. "హదీస్ మంచి అమ్మాయి. డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టపడేది. మహ్‌సా అమిని మృతికి వ్యతిరేకంగా ఆమె నిరసనల్లో పాల్గొంది" అని ట్వీట్ చేశారు.
తీవ్ర నిరసనలు..
నిరసనలతోనే మహిళలు ఆగిపోలేదు. తమ జుట్టుని కత్తిరించుకుని, హిజాబ్‌లను కాల్చేస్తున్న వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఇరాన్‌లో ఇప్పుడిదో ఉద్యమంలా మారింది. ఇరాన్ మహిళలంతా తమ జుట్టుని కట్ చేసుకుని, తరవాత హిజాబ్‌లను మంటల్లో తగలబెడుతున్న వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇరాన్‌లో ఇస్లామిక్ లా ప్రకారం...ఏడేళ్లు పైబడిన మహిళలెవరైనా జుట్టుని హిజాబ్‌తో కవర్ చేసుకోవాలి. పొడవాటి, వదులుగా ఉండే దుస్తులే ధరించాలి. ఈ ఏడాది జులై5న అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ప్రత్యేకించి మహిళల వేషధారణపై ఇంకా ఆంక్షలు విధించారు. హిజాబ్ తప్పనిసరిగా ధరించాలని ఆదేశించారు. దీనిపైనే...మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించిన వారిని అరెస్ట్ చేసింది ఇరాన్ ప్రభుత్వం. హిజాబ్‌ను ధరించని మహిళలకు కఠినశిక్ష అమలు చేయాలని రూల్స్ పాస్ చేశారు. అక్కడి మహిళలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా హిజాబ్‌లను తొలగిస్తున్నారు. ఈ ఆందోళనల్లో 75 మంది మృతి చెందారని తేల్చి చెప్పింది ఓ నివేదిక. "ఇరాన్ పౌరులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. వాళ్ల ప్రాథమిక హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్నారు. కానీ ప్రభుత్వం వీరిని బులెట్‌లతో అడ్డుకోవాలని చూస్తోంది" అని ఇరాన్ హ్యూమన్ రైట్స్ (IHR) డైరెక్టర్ మహమూద్ అమిరి వెల్లడించారు. దాదాపు ఆరు రోజులుగా అక్కడ ఈ పోరాటం కొనసాగుతూనే ఉంది. దేశంలోని దాదాపు 30 కీలక నగరాల్లో మహిళలు ఆందోళనలు చేస్తున్నారు. నార్తర్న్ ప్రావిన్స్ కుర్దిస్థాన్‌లో ఈ నిరసనలు మొదలయ్యాయి. అక్కడి నుంచి దేశమంతా పాకాయి.
Also Read: 70 Years Young Man: యువకులతో పోటీపడి కొబ్బరిచెట్లు ఎక్కేస్తున్న శేషగిరిరావు