Congress President Election: 


తెరపైకి దిగ్విజయ్ సింగ్ పేరు..


కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేసులో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా చేరారు. ఎన్నో ఏళ్లుగా గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న ఆయన...గతంలో ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు ఉన్నట్టుండి ఆయన పేరు కూడా వినిపిస్తోంది. అంతే కాదు. సోనియా గాంధీని కలిసేందుకు ఆయన ఢిల్లీ  చేరుకున్నారు. రెండ్రోజుల్లో నామినేషన్ వేయనున్నారు. మధ్యప్రదేశ్‌కు దిగ్విజయ్ సింగ్‌...గతంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కేరళలో భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీతో పాటు ఇన్నాళ్లు ఉన్న దిగ్విజయ్ సింగ్...తన నామినేషన్ విషయమై ఇంకా గాంధీ కుటుంబంతో మాట్లాడాలని చెబుతున్నారు. కానీ...పోటీ చేస్తారా లేదా అన్న ప్రశ్నకు మాత్రం సూటిగా సమాధానం చెప్పటం లేదు. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం వరకైతే...శశి థరూర్ వర్సెస్ దిగ్విజయ్ సింగ్‌లా ఈ ఎన్నికలు జరగనున్నాయి. నిన్న మొన్నటి వరకూ రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ పేరు మాత్రమే వినిపించింది. ఉన్నట్టుండి ఆయన అధిష్ఠానంపై తిరుగుబావుటా ఎగరేయటం పరిస్థితుల్ని పూర్తిగా మార్చేసింది. సోనియా గాంధీ...గహ్లోత్ వైఖరిపై చాలా అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. అందుకే...అధ్యక్ష ఎన్నికల్లో దిగ్విజయ్ సింగ్, శశిథరూర్ మధ్యే పోటీ ఉండనుందన్న ప్రచారం జరుగుతోంది. 


పోటీ చేయనంటూనే..


గత వారం దిగ్విజయ్ సింగ్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై స్పందించారు. "నేను పోటీ  చేయను. కానీ అధిష్ఠానం నిర్ణయాన్ని శిరసావహిస్తాను" అని సమాధానమిచ్చారు. "ఈ విషయమై ఎవరితోనూ నేను చర్చించలేదు. అధిష్ఠానం నుంచి అనుమతి కూడా తీసుకోలేదు. నేను పోటీ చేస్తానా లేదా అన్న విషయం నాకు వదిలేయండి" అని కామెంట్ చేశారు. ఇప్పుడాయన ఢిల్లీకి రావటం వల్ల పోటీలో ఉన్నారన్న వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. 20 ఏళ్ల తరవాత గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాంధీ కుటుంబ సభ్యులు మాత్రం వ్యక్తిగతంగా ఏ అభ్యర్థికీ మద్దతునివ్వటం లేదు. ఎవరైనా పోటీ చేయొచ్చు అని ముందే 
ప్రకటించింది. అటు మరో సీనియర్ నేత కమల్‌నాథ్ పేరు కూడా బాగానే వినిపిస్తోంది. అయితే...ఆయన మాత్రం పోటీ చేసేందుకు ఆసక్తి చూపటం లేదు. మధ్యప్రదేశ్ రాజకీయాలపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని భావిస్తున్నట్టు స్పష్టం చేశారు. నిజానికి...సీనియర్లంతా రాహుల్ గాంధీయే పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయన మాత్రమే పార్టీని సమర్థంగా నడిపిస్తారని అందరూ అభిప్రాయపడుతున్నా...రాహుల్ మాత్రం అందుకు అసలు అంగీకరించటం లేదు. అధ్యక్ష పదవిలో లేకపోయినా..పార్టీ వ్యవహారాలు దగ్గరుండి చూసుకుంటున్నారు. భారత్ జోడో యాత్రతో పార్టీలో కొత్త ఉత్సాహం నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి కేరళలో జరుగుతున్న ఈ యాత్రకు అక్కడి ప్రజల నుంచి మంచి స్పందనే వస్తోంది. కానీ...ఈలోగా కొందరు కీలక నేతలు...భాజపా గూటికి చేరుకుంటున్నారు. ఇదే ఆ పార్టీని కలవర పెడుతోంది. సమస్యలు పరిష్కరించి పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. 


Also Read: RMP's in Telangana: ఆర్ఎంపీలకి సర్కార్ స్ట్రాంగ్ వార్నింగ్! ఆ పని చేస్తే క్రిమినల్ కేసులు - డైరెక్ట్ జైలుకే!