Abortions in Telangana: నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్లు చేసే ఆర్ఎంపీ వైద్యులపై ఉక్కపాదం మోపబోతుంది రాష్ట్ర వైద్య శాఖ యంత్రాంగం. ఆర్ఎంపీలు సర్జరీలు చేయడం, యాంటీ బయాటిక్ మందులు ఎక్కువగా రాయడంపై కూడా చర్యలు తీసుకోబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేసి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు అన్నిజిల్లాల ఆరోగ్య శాఖలకు, వైద్యాధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఆర్ఎంపీ వైద్యులు కేవలం ప్రాథమిక చికిత్స(ఫస్ట్ ఎయిడ్) మాత్రమే చేయాలని, అర్హతకు మించి వైద్యం చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేసింది. ఇటీవల కొన్ని జిల్లాల్లో ఆర్ఎంపీల వైద్యం వికటించి పలువురు మృతి చెందినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, ఇందులో గర్భిణీలు కూడా ఉన్నారని చెప్పుకొచ్చింది. ఎక్కువగా అబార్షన్లు ఫెయిల్ అయ్యి మృతి చెందారని వివరించింది. వీటిని పరిగణలోకి తీసుకున్న సర్కారు.. ఆర్ఎంపీలను కట్టడి చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే పలు చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది.
103 ఆస్పత్రులు సీజ్, 633 ఆస్పత్రులకు నోటీసులు..
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2058 ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు తెలిపారు. వాటిలో 103 ఆస్పత్రులను సీజ్ చేయగా.. 633 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మరో 75 ఆస్పత్రులకు భారీగా జరిమానా విధించామన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు రిజిస్ట్రేషన్లు , క్వాలిఫైడ్ స్టాఫ్ లేకున్నా, ఆస్పత్రుల్లో గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్లు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఆసుపత్రిలో అర్హత కల్గిన వైద్యులు ఉండాల్సిందేనని అన్నారు. అర్హత లేకుండా క్లినికల్ సర్జరీలు చేస్తే క్రిమినల్ కేసులు ఉంటాయన్నారు. లోపాలు ఉండే సరిదిద్దుకునేందుకు రెండు వారాల గడువు ఇవ్వనున్నామని పేర్కొన్నారు.
ఇటీవలే భద్రాద్రిలో అబార్షన్ వికటించి యువతి మృతి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని సురక్ష ప్రైవేటు ఆసుపత్రిలో అబార్షన్ వికటించి విద్యార్థిని మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ములకలపల్లి మండలం వీకే. రామవరం గ్రామానికి చెందిన డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఓ యువకుడు ట్రాప్ చేసి గర్భవతి చేశాడు. గర్భం దాల్చిన విద్యార్థినిని అబార్షన్ చేయించేందుకు ఎవరికీ తెలియకుండా ఆ యువకుడు శుక్రవారం భద్రాచలంలోని సురక్ష ఆసుపత్రిలో జాయిన్ చేయించాడు.
ప్రియుడు పరారీ..
ఐదు నెలల గర్భవతి కావడంతో అబార్షన్ చేయడం వల్ల అమ్మాయి పరిస్థితి విషమంగా మారి మృతి చెందింది. విషయం తెలిసి ఆసుపత్రికి తీసుకొచ్చిన యువకుడు పరారైయ్యాడు. అమ్మాయి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థిని తల్లిదండ్రులు డయల్ 100 కాల్ చేసి సమాచారం ఇచ్చారు. యువకుడి పేరు భుక్యానంద అని తెలుస్తోంది. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆసుపత్రి ముందు మృతురాలి బంధువులు ధర్నాకు దిగారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ప్రియుడు భూక్యా నంద కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.