Indo-US Military Drill:


ఉత్తరాఖండ్‌లో మిలిటరీ విన్యాసాలు..


భారత్, చైనా మధ్య ఎన్నో రోజులుగా సరిహద్దు వివాదం కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాల సైనికులు ఎదురుపడి ఘర్షణ పడిన సందర్భాలూ ఉన్నాయి. LAC విషయంలో చైనా చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇటు భారత్ కూడా డ్రాగన్‌ ఆగడాలను తిప్పి కొడుతోంది. అయితే... మరోసారి చైనా అగ్గి మీద గుగ్గిలం అయ్యే అవకాశాలున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం...భారత్, అమెరికా సంయుక్తంగా ఓ మిలిటరీ ఎక్సర్‌సైజ్‌ను చేపట్టాలని చూస్తుండటమే. LACకి సమీపంలోని ఉత్తరాఖండ్‌లో ఔలి (Auli) వద్ద ఈ విన్యాసాలు చేపట్టాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇండియా, అమెరికా సైన్యం సంయుక్తంగా ఈ తరహా ఎక్సర్‌సైజ్‌లు చేపట్టటం ఇది 15వ సారి. ఏటా ఇది జరుగుతూనే ఉంటుంది. ఓసారి అమెరికాలో, మరోసారి భారత్‌లో నిర్వహిస్తుంటారు. చివరిసారి అమెరికాలోని అలస్కాలో జరగ్గా...ఈ సారి భారత్‌లో ప్లాన్ చేశారు. నవంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకూ ఈ విన్యాసాలు కొనసాగనున్నట్టు కొన్ని రిపోర్ట్‌లు చెబుతున్నాయి. చైనా, భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో...ఈ విన్యాసాలు జరగటం ప్రాధాన్యత సంతరించుకుంది. 


చైనాలో గుబులు..


భారత్, అమెరికా మైత్రి..ఎప్పటి నుంచో చైనాను కలవర పెడుతూనే ఉంది. LACకి 100 కిలోమీటర్ల దూరంలో Auli వద్ద అత్యంత ఎత్తైన ప్రాంతంలో (10 వేల అడుగుల ఎత్తులో)ఈ విన్యాసాలు చేపట్టాలని ప్రణాళికలు రచిస్తుండటం చైనాను ఇబ్బంది పెడుతోంది. ఉత్తరాఖండ్‌కు సమీపంలో ఉన్న LAC ఇండియన్‌ ఆర్మీ సెంట్రల్ సెక్టార్‌లో కీలక భాగం. ఇక్కడ ఉన్న బరోహ్టి (Barohti) ప్రాంతంపై భారత్, చైనా మధ్య చాన్నాళ్లుగా ఘర్షణ సాగుతోంది. తూర్పు లద్దాఖ్‌లో హైటెన్షన్‌ పరిస్థితులు వచ్చినప్పటి నుంచి ఇరు దేశాలు LAC వద్ద భారీగాసైన్యాన్ని మొహరిస్తూ వచ్చాయి. అటు చర్చలు జరుగుతుండగానే...చైనా కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత్ కూడా గట్టిగానే బదులిస్తూ భారీగా యుద్ధ ట్యాంకులను మొహరించింది. ఈ క్రమంలోనే భారత్, అమెరికా మిలిటరీ విన్యాసాలపై అంతగా చర్చ జరుగుతోంది. 


చర్చలు..


గల్వాన్ ఘటన తరవాత, రెండు దేశాల మధ్య వైరం తీవ్రమైనప్పటికీ..అదే సమయంలో చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. ఇప్పటికే LAC విషయమై 15 రౌండ్ల చర్చలు జరిగాయి. ఇటీవలే 16వ రౌండ్ భేటీ కూడా పూర్తైనట్టు తెలుస్తోంది. ఎల్ఏసీ వద్ద ఉద్రిక్తతను తగ్గించేందుకు బలగాల ఉపసంహరణకు అంగీకరించినట్టు సమాచారం. హాట్‌స్ప్రింగ్స్ వద్ద ఇరు దేశాల సైనికులు వెనక్కి వెళ్లిపోవాలని, కమాండర్ స్థాయిలో జరిగిన ఈ సమావేశంలో నిర్ణయించారని తెలుస్తోంది. భారత్‌ వైపు ఉన్న చుషులు-మోల్డో సరిహద్దు వద్ద ఈ చర్చలు జరిగాయి. 14 కార్ప్స్ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ ఏ సేన్‌గుప్తా భారత్‌ తరపున చర్చలో పాల్గొన్నారు. చాన్నాళ్ల క్రితమే ఈ చర్చలు ఆగిపోయాయి. అయితే ఈ వివాదం ఇంకా ముదరకముందే ఇలాంటి సంప్రదింపులు కొనసాగించటం అవసరం అని భావించిన విదేశాంగ మంత్రి జైశంకర్, చర్చలు తిరిగి ప్రారంభమయ్యేలా చొరవ చూపించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణకు రెండు దేశాలూ అంగీకరించాయి. 


Also Read: Political Money Heist : ఆ నలుగురు ఎమ్మెల్యేలు "ట్రాప్"లో పడ్డారా? ట్రాప్ చేశారా ? తెర వెనుక జరిగిందేమిటంటే ?