Political Money Heist : నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఓ కారులో సంచుల్లో కోట్ల కొద్దీ నగదు, బేరసారాలాడేందుకు మరో ముగ్గురు వ్యక్తులు...వెంటనే పోలీస్ రెయిడింగ్. తప్పించుకుని వెళ్లే సమయం కూడా లేదు. అందరూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. కానీ ఇది సాధ్యమా ? రాజకీయాల్లో బేరసారాలు ఇలా జరుగుతాయా ? అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా ప్రీ ప్లాన్డ్ అని కొందరు అంటూంటే.. ఒకరిపై ఒకరు ట్రాప్ వేసుకోబోయి బోర్లా పడ్డారని మరికొందరు విశ్లేషిస్తున్నారు. పోలీసులు కూడా అసలేం జరిగిందన్నది పూర్తిగా చెప్పడం లేదని.. చెప్పిన దాని కన్నా ఎక్కువ తెర వెనుక రాజకీయం జరిగిందన్న వాదన వినిపిస్తోంది.
ఎమ్మెల్యేలను ఆకర్షించాలన్న హడావుడిలో దొరికిపోయారా?
తెలంగాణలో రాజకీయాలు చాలా కాలంగా వేడి మీదనే ఉన్నాయి. ఒకరి పార్టీ నేతల్ని మరొకరు ఆకర్షించాలని చాలా తెలివిగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇతర పార్టీల్లో చేరుతారన్న ప్రచారం జరుగుతూ వస్తోంది. కానీ అది ఇప్పటి వరకూ జరగలేదు. కానీ ఎలాగైనా ఎమ్మెల్యేల్ని ఆకర్షించాలన్న లక్ష్యంతో మధ్యవర్తుల ద్వారా చేసిన ప్రయత్నాలు .. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో బెడిసి కొట్టినట్లుగా అనుమానిస్తున్నారు. ఢిల్లీ ఫరీదాబాద్ టెంపుల్‌లో ఉండే రామచంద్రభారతి, తిరుపతిలో ఉండే సింహయాజులు స్వామిజీకి... హైదరాబాద్‌లోని ఓ హోటల్ ఓవర్ అయిన నందకుమార్ ఎలా.. ఎక్కడ పరిచయం అయ్యారో తెలియదు కానీ ముగ్గురూ కలిసి ఎమ్మెల్యేల్ని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారు. అన్ని మాట్లాడుకున్న తర్వాత డీల్ సెట్ చేసుకోవడానికి రామచంద్రభారతి, సింహయాజులు హైదరాబాద్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే అక్కడే కథ అడ్డం తిరిగింది.
ఆకర్ష్‌కు లోనైనట్లుగా నటించి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే సమాచారం లీక్ చేశారా?
ఇతరుల నుంచి వచ్చిన కళ్లు తిరిగే ఆఫర్ కు నలుగురు ఎమ్మెల్యేలు ఫ్లాటైపోయారు. తాము ఆసక్తిగా ఉన్నామన్న సంకేతాలు పంపారు. ఈ ప్రకారమే సంప్రదింపులు జరిపి ఉంటారు. అందుకే మధ్యవర్తులు కూడా ఉత్సాహం .. నోట్ల కట్టలు తీసుకుని హైదరాబాద్ వచ్చి ఉంటారని భావిస్తున్నారు. అయితే తమకు వచ్చిన ఆఫర్ గురించి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకమాండ్‌కు చెప్పి ఉంటారని.. వారి ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం చేశారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రలోభ రాజకీయాలను రెడ్ హ్యాండెడ్‌గా బయట పెట్టడానికే ఇలా చేశారన్న వాదన వినిపిస్తోంది.
తమ మీద మరక వేసుకోవడానికి ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారా ?
అయితే ఈ ఎపిసోడ్‌లో మధ్యవర్తులు..బేరసారాలు ఆడేవారు ప్రముఖులు కాదు. ఈ విషయంలో వారు దొరికిపోయినా.. వెంటనే బయటకు రాగలరు. కానీ ఫామ్ హౌస్‌లో కనిపించిన నలుగురు ఎమ్మెల్యేలపై మరక మాత్రం పడిపోతుంది. బీరం హర్షవర్థన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, రేగ కాంతారావు, గువ్వల బాలరాజు ఇలా ఫామ్‌హౌస్‌లో చర్చలు జరుపుతూ దొరికిపోయారు. వారిపై మరక ఖచ్చితంగా పడుతుంది. ఈ బేరసారాల్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికే తాము వచ్చామని వారు తర్వాత వారు వాదించినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే పోలీసులు రెయిడింగ్ జరిగినప్పుడు వారు అంత కాన్ఫిడెంట్‌గా కనిపించలేదు. తమను ప్రలోభ పెట్టడానికి వచ్చారని.. తామే పోలీసుల్ని పిలిపించామని వారు చెప్పలేదు.
ఆ నలుగురులో ముగ్గురు కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన వారే!
బేరసారాలు ఆడుతూ పట్టుబడిన ఫామ్ హౌస్ స్వయంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిది. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది టీఆర్ఎస్‌లోకి ఫిరాయించారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు కూడా అంతే. టీఆర్ఎస్‌లో సుదీర్ఘంగా ఉన్న నేత గువ్వల బాలరాజు మాత్రమే. అందుకే వీరు ప్రలోభాలకు లొంగరని చెప్పలేని పరిస్థితి ఉంది. మొత్తంగా ఫిరాయింపుల వ్యవహారంమలో తెర వెనుక జరిగింది ఒకటైతే..బ యటకు తెలిసింది మరొకటన్న అభిప్రాయం మాత్రం గట్ిటగా వినిపిస్తోంది. దీని వెనుక అసలు నిజానిజాలు కొన్ని ఎప్పటికీ మరుగునపడి ఉంటాయి. కొన్ని కీలకమైన విషయాలు మాత్రం త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.