Bigg Boss Telugu: ఆరు సీజన్లు బిగ్ బాస్, ఒక ఓటీటీ బిగ్ బాస్.... మొత్తం ఏడు సీజన్ల కంటెస్టెంట్లలో గీతూ  అంత కన్నింగ్ ప్లేయర్‌ని చూడలేదు అంటున్నారు ప్రేక్షకులు. గతంలో నటరాజ్ మాస్టర్‌ని చూసి చాలా మంది విసుక్కున్నారు. కానీ ఇప్పుడు గీతూని చూశాక ఆయన చాలా బెటర్ అనిపిస్తోంది ప్రేక్షకులు. ఆయన కోపం వచ్చినప్పుడు మాత్రమే అరిచేవాడు, గొడవలు పెట్టుకునే వాడు. కానీ గీతూ ఆట పేరుతో తనకు నచ్చని వాళ్లని టార్గెట్ చేసి,వాళ్లని రెచ్చగొట్టి, యాటిట్యూట్ చూపిస్తూ చాలా చికాకు తెప్పిస్తుంది. ఇక అలాంటి న్యాయం చెప్పే సంచాలక్‌ని చేస్తే ఎలా ఉంటుంది? దొంగకు తాళం అప్పజెప్పినట్టే. తాళం దొరికాక దొంగ ఊరుకుంటాడా? అలాగే చేతికి పవర్ ఇచ్చాక గీతూ తగ్గుతుందా? కన్నింగ్ ఆట ఆడి చూపించింది. 


గీతూ - ఆదిరెడ్డి జంట కెప్టెన్సీ కంటెండర్ల టాస్కులో మొదటిరోజే తొలగిపోయారు. దీంతో రెండో రోజు వారిద్దరినీ సంచాలక్‌గా నియమించారు బిగ్బాస్. చేపల వర్షం కురుస్తుంటే ఇంటి సభ్యులతో పాటూ తాను ఏరుకోవడం మొదలుపెట్టింది. ఆదిరెడ్డి దీనికి అభ్యంతరం చెప్పాడు. ‘నా ఇష్టం నేను ఏరుకుంటా సామి’ అని చెప్పింది గీతూ. అలా సంచాలక్ చేపలు పట్టడాన్ని రేవంత్ గట్టిగా నిలదీశాడు. తనతో వాదిస్తే డిస్ క్వాలిఫై చేస్తా అంటూ వాదించింది గీతూ. రేవంత్ మైక్‌తో పాటూ పూల్ లో దిగడంతో అతనికి జరిమానా విధించి పది చేపలు తీసుకుంది. అలాగే బుట్టలో చేపలు ఒకరికి ఒకరు ఆటగాళ్లు లాక్కుంటున్నప్పుడు తాను కూడా వెళ్లి లాక్కోవడం మొదలుపెట్టింది. దీంతో ఆదిరెడ్డి మళ్లీ అభ్యంతరం చెప్పాడు. బాలాదిత్య కూడా అడిగాడు. అయినా గీతూలో మార్పు లేదు. ‘నేను ఆడిస్తున్నా’ అంటూ సమాధానం చెప్పింది. 


రేవంత్ - గీతూల మధ్య మాటల యుద్ధమే ఈ ఎపిసోడ్ లో హైలైట్ అయింది. మిగతా ఆటగాళ్ల ఆటను చూసే అవకాశం వీరిద్దరి గొడవ ప్రేక్షకులకు ఇవ్వలేదు. గోల్డ్ కాయిన్ దక్కించుకున్న ఫైమా తనతో పోటీ పడేందుకు మూడు జంటల్ని ఎంచుకుంది. రేవంత్ సంచాలక్ గా మారాడు. ఈ గేమ్‌లో సూర్య జంట గెలిచింది. 


ట్విస్టు మామూలుగా లేదు...
సంచాలకులైన ఆదిరెడ్డి - గీతూ జంట అందరి దగ్గర ఉన్న చేపలను ఆఖరిలో లెక్కించారు. అందరికన్నా ఎక్కువగా రేవంత్ - ఇనయా దగ్గర 129 ఉన్నాయి. అయితే ఓ నల్ల చేప కూడా వచ్చిందని అది ఎవరి దగ్గర ఉందని అడిగారు బిగ్ బాస్. గీతూ దాచిన నల్లచేపని తెచ్చింది. నల్ల చేప ఉన్నవారు తమకు నచ్చిన ఇద్దరు జంటల దగ్గర ఉన్న చేపల్ని స్వాప్ చేయచ్చని చెప్పాడు బిగ్ బాస్. దీంతో కన్నింగ్ గేమ్ ఆడింది గీతూ. రేవంత్ పై పగ తీర్చుకుంది. రేవంత్ దగ్గర ఉన్న చేపల్ని శ్రీహాన్ - శ్రీసత్యతో స్వాప్ చేసింది. దీంతో వారు టాప్ లోకి వచ్చారు. దీంతో ఇనయా, రేవంత్ నోటికి పనిచెప్పారు. వారిని మరింత రెచ్చగొట్టేలా మాట్లాడింది గీతూ. 


సంచాలక్ దగ్గర చేప ఎలా?
కానీ ఇక్కడ మాట్లాడాల్సింది ఒక్కటే. చేపల్ని ఏరాల్సింది ఆటగాళ్లు, వాళ్ల దగ్గర ఈ నల్ల చేప ఉండాలి. కానీ సంచాలక్ దగ్గరికి ఎలా చేరింది. సంచాలక్ ఆట ఆడకూడదు, పర్యవేక్షించాలి. బిగ్బాస్ కూడా గీతూ చేసిన పని ఎలా ఒప్పుకున్నాడో ఆయనకే తెలియాలి. ఇకపైనా సంచాలక్ కూడా ఆటలు ఆడతారన్న మాట. చివర్లో ఆదిత్య - మెరీనా జంట ఆట నుంచి తొలగిపోయారు. 


Also read: ఆ చిన్న నల్ల చేప రేవంత్ కొంపముంచిందిగా, మరోసారి వారిద్దరినీ టార్గెట్ చేసిన గీతూ