Indira Gandhi Death Anniversary:
సేవలు ప్రశంసనీయం: కాంగ్రెస్
భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆమెకు నివాళులు అర్పించారు. "దేశం పరిస్థితులు దిగజారిపోకుండా చూస్తాను" అని శపథం చేశారు. "నానమ్మ. నీ ప్రేమను, విలువలను నా గుండెలో నిత్యం మోస్తూనే ఉన్నాను. ఏ దేశం కోసమైతే నువ్వు ప్రాణాలు అర్పించావో ఆ దేశం స్థాయి పడిపోకుండా చూసుకుంటాను"అని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నేత సోనియా గాంధీ కూడా ఇందిరా గాంధీకి నివాళులు అర్పించారు. శక్తిస్థల్‌లో ఉన్న ఆమె సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. మల్లికార్జున్ ఖర్గే ట్వీట్ వేదికగా ఇందిరా గాంధీ సేవల్ని గుర్తు చేసుకున్నారు. "భారత దేశ తొలి మహిళా ప్రధానికి నా నివాళులు. వ్యవసాయ రంగమైనా, ఆర్థిక రంగమైనా, మిలిటరీలోనైనా ఆమె చేసిన సేవలు, మార్పులు ఎంతో గొప్పవి. ఇవే భారత్‌ను బలంగా మార్చాయి. ఆమె సేవలు అసమానమైనవి" అని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా ట్విటర్ వేదికగా ఇందిరా గాంధీ విజన్‌ను పొగుడుతూ పోస్ట్‌లు చేసింది. హరిత విప్లవం, బంగ్లాదేశ్ ఉద్యమం అంశాల్లో ఇందిరా గాంధీ వ్యవహరించిన తీరుని ప్రశంసించింది. ఇదే సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన సేవల్నీ స్మరించుకుంది.
తెలంగాణలో రాహుల్ జోడో యాత్ర..
ప్రస్తుతానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఉదయం 5.30 నిముషాలకు షాద్‌నగర్‌లో జోడో యాత్ర ప్రారంభించారు. ఆ సమయంలోనే సర్దార్ పటేల్, ఇందిరా గాంధీ నివాళులు అర్పించారు. ఆ తరవాత మోర్బి వంతెన ప్రమాదంలో చనిపోయిన వారికి సంతాపంగా రెండు నిముషాల పాటు మౌనం పాటించారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్...ఇందుకు సంబంధించిన ఫోటోలు ట్విటర్‌లోషేర్ చేశారు.