హీరో సుధీర్ బాబు కు సరైన హిట్ వచ్చి చాలా రోజులే అయింది. రీసెంట్ గా సుధీర్ బాబు లీడ్ రోల్ లో చేసిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆ సినిమా తర్వాత వెంటనే మరో సినిమాను అనౌన్స్ చేసిన సుధీర్ బాబు ఇప్పుడు మళ్లీ ఇంకో సినిమా కు రెడీ అయ్యారు. అదే ' హరోం హర' మూవీ. ఈ మూవీ కి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ వీడియోను విడుదల చేశారు సుధీర్ బాబు. టైటిల్ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో ఈ సినిమా పై ఆసక్తి నెలకొంది.
'హరోం హర' సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఇక టైటిల్ వీడియో కూడా ఆకట్టుకునేలా డిజైన్ చేశారు మేకర్స్. వీడియోలో ముందుగా జగదాంబ టాకీస్ థియేటర్ లో సూపర్ స్టార్ కృష్ణ సినిమా 'అగ్నిపర్వతం' అడుతున్నట్టు, థియేటర్ లో ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఉన్నట్లు చూపించారు. తర్వాత ఓ డైలాగ్ వస్తుంది. "సుబ్రహ్మణ్యం నీ కోసం జనాలు చూస్తున్నారు, అలా కనబడకుండా ఉంటే ఎలా ఏమోటి చెప్పు" డైలాగ్ కు హీరో "ఇంక చెప్పేదేమీ లేదు చేసేదే" అని చెప్పిన డైలాగ్ ఆసక్తిగా ఉంది. వీడియో లో హీరో ఓ వైపు తుపాకీ, మరో చేత్తో సుబ్రమణ్య స్వామి ఆయుధాన్ని పట్టుకున్నట్లు చూపించారు. అలాగే సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు సుబ్రహ్మణ్యం అని క్లియర్ గా తెలుస్తోంది. అలాగే కుప్పం నియోజకవర్గం గురించి కూడా ప్రత్యేకంగా చూపించారు. అంటే హీరోకి ఆ కుప్పం నియోజకవర్గానికి మధ్య సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమా కూడా 'కార్తికేయ', 'సుబ్రహ్మణ్యం పురం' లాగా సుబ్రమణ్య స్వామి గుడి చుట్టూ సాగే కథలా అనిపిస్తోంది. మరో వైపు సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా భారీగానే ఉన్నాయని తెలుస్తోంది.
హీరో సుధీర్ బాబు హిట్ ఫ్లాప్ లతో సంబధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు. 'భలే మంచి రోజు' తర్వాత సుధీర్ బాబు కు సరైన హిట్ రాలేదు. 'సమ్మోహనం', 'వి' సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత సుధేర్ బాబు 'శ్రీదేవి సోడా సెంటర్', 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాలు చేశారు. అవి కూడా బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా పడ్డాయి. అయినా సుధీర్ బాబు ఎక్కడా తగ్గట్లేదు. వరుస సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. ఈసారి స్టైల్ మార్చి 'హరోం హర' సినిమా చేస్తున్నారు. ఇప్పుడీ సినిమాకు సంబంధించిన టైటిల్ వీడియో ఆకట్టుకుంటోంది.
ఈమధ్య మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ‘హరోం హర’లో కూడా ఆ పాయింట్ ని బలంగా ఉన్నట్టుంది. 1889 ఆ ప్రాంతంలో చిత్తూరు కుప్పం నియోజక వర్గం చుట్టూ తిరిగే కథలా కూడా అనిపిస్తుంది. అందుకే పాత్రలన్నీ చిత్తూరు భాషలోనే మాట్లాడుతున్నాయి. ఇక ఈ సినిమాకు జ్ఞానసాగర్ ద్వారకా దర్శకత్వం వహిస్తుండగా, సుమంత్ జి.నాయుడు నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంత మేరకు ఆకట్టుకుందో చూడాలి.