Gujarat Elections 2022:
విజయం కీలకం..
గుజరాత్ ఎన్నికల తేదీలు ఒకటి రెండ్రోజుల్లో విడుదల కానున్నాయి. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలతోనే గుజరాత్ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. భాజపా మరోసారి మ్యాజిక్ చేస్తుందా..? లేదంటే కాంగ్రెస్ ఆప్ భాజపాను నిలువరిస్తాయా అన్నది తేలేది ఆ రోజే. ముఖ్యంగా గుజరాత్ విషయంలో భాజపాకు కొన్ని సవాళ్లు ఎదురవనున్నాయి. కేవలం గెలిస్తే సరిపోదు. వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచు కోవాల్సి ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 99 సీట్లకే పరిమితమైంది. కొన్ని చోట్ల ఉప ఎన్నికలు, ఫిరాయింపుల కారణంగా..
ఇప్పుడా సంఖ్య 111కి పెరిగింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఇలాంటి కీలక తరుణంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా భారీ మెజార్టీ సాధించాలని భాజపా పట్టుదలతో ఉంది.
భాజపా ప్రోగ్రెస్ రిపోర్ట్..
1995లో గుజరాత్‌లో అధికారంలోకి వచ్చింది భాజపా. అప్పుడు 121 సీట్లు సాధించింది. 2002లో నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 127 స్థానాల్లో విజయం సాధించింది. 2007లో మోదీ సారథ్యంలోనే మరోసారి ఎన్నికలు జరిగాయి. అప్పుడు బీజేపీకి 117 సీట్లు దక్కాయి. ఆ తరవాత 2012లో 115 సీట్లొచ్చాయి. ఇలా తగ్గుతూ...చివరిసారిగా జరిగిన ఎన్నికల్లో 99 స్థానాలు దక్కించుకుంది భాజపా.
అంటే...ప్రతి ఎన్నికకు కొంత మేర సీట్లు కోల్పోతూ వచ్చింది. ఇందుకు ప్రధాన కారణం...2017లో గుజరాత్‌లో భాజపా పాలన కాస్త గాడి తప్పడమే. హార్దిక్ పటేల్ నేతృత్వంలో జరిగిన పాటిదార్ ఉద్యమం వల్ల భాజపాకు బాగానే నష్టం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కళ్లకు కట్టింది ఆ ఉద్యమం. అయితే...హార్దిక్ పటేల్ భాజపాలో చేరినప్పటికీ...గతంలో కన్నా ఎక్కువ సీట్లు సాధించాల్సిన
అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి...గత ఎన్నికల ఫలితాలు.
ఆప్ సవాలు..
వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించటం భాజపా ముందున్న మొదటి సవాలైతే..రెండోది ఆప్‌ను ఎదుర్కోవడం. కాంగ్రెస్ కన్నా ఆమ్‌ఆద్మీ పార్టీనే ప్రధాన సవాలుగా భావిస్తోంది భాజపా. ఎందుకంటే..ఈ సారి ఆప్ కూడా బీజేపీ స్టైల్‌లోనే "హిందుత్వ" రాజకీయాలు మొదలు పెట్టింది. ఇదొక్కటే కాదు. గుజరాత్ ఆప్ చీఫ్ గోపాల్ ఇటాలియా..పాటిదార్ వర్గానికి చెందిన వాడు. పైగా...ఈయననే ముఖ్యమంత్రి అభ్యర్థిగానూ చెబుతోంది ఆప్. ఇప్పటికే పాటిదార్ వర్గ ఓట్లను తన వైపు తిప్పుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాడు గోపాల్. ఈ ఓట్లు పెద్ద మొత్తంలో ఆప్ వైపు వెళ్లిపోతే...భాజపాకు కాస్త కష్టమే. సాధారణంగా...ఆమ్ఆద్మీ పార్టీపై ఎప్పటి నుంచో ఓ ఆరోపణ ఉంది. అది భాజపాకు B Team
అని చాలా మంది విమర్శిస్తుంటారు. కానీ...ఈ సారి గుజరాత్‌లో మాత్రం అలా కనిపించటం లేదు.
కాంగ్రెస్ బలహీనపడిందా..?
2017 ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ మధ్యే పోటీ కనిపించింది. బీజేపీ 49.05% ఓట్లు సాధించి 99 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ 77 స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం 182 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో 40 స్థానాలు రిజర్వ్‌డ్. వీటిలో 27 స్థానాలు STలకు, మరో ఎస్‌సీలకు కేటాయించారు. చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు...భాజపాలో చేరారు. ఫలితంగా...గుజరాత్‌లో కాంగ్రెస్ బలం 62కు తగ్గిపోయింది. అయినా...ఈ సారి బలంగా నిలబడాలని చూస్తోంది హస్తం పార్టీ. కానీ...భాజపా, ఆప్ మధ్యే ప్రధాన పోటీ నెలకొలనుంది.
Also Read: Sardar Vallabbhai Patel Birth Anniversary: సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు