ప్రతి మనిషికి గురివిందంతైనా అదృష్టం ఉంటుంది అంటారు పెద్దలు. జీవితంలో ఏదైనా అనుకోని మంచి జరిగితే పెద్దలు చెప్పిన మాట నిజమే అనిపిస్తుంది. అదే ఏ లాటరీలో పెద్ద మొత్తంలో డబ్బు వస్తే వీడికి ఎక్కడో పెద్ద మచ్చ ఉంది అనడం వింటూనే ఉంటాం. అదే జీవితంలో ఎలాంటి పని చేయకుండా నెలకు అక్షరాల రూ.5.5 లక్షలు వస్తే వారిని ఏమనాలి. అది కూడా నెలా, రెండు నెలలు కాదు.. ఏకంగా 25 సంత్సరాలు వస్తే ఆ ఊహ ఎంత బాగుంటుందో కదా. ఇలాంటి లక్కీఛాన్స్ తగిలితే ఒక కుటుంబం ఒక తరం ప్రశాంతంగా తిని కూర్చున్నా తరగనంత సొమ్ము వస్తే వాళ్ల ఆనందానికి హద్దులు ఉండవు.
ఇలాంటి అదృష్టమే ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తిని వరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ‘ఫాస్ట్ 5’ పేరిట నిర్వహించిన లాటరీలో ఉత్తరప్రదేశ్ వాసి ఈ మెగా ప్రైజ్ మనీ విజేతగా నిలిచాడు. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆవివరాలు ఏంటో చదివేసేయండి.. ఉత్తరప్రదేశ్ చెందిన మొహమ్మద్ ఆదిల్ ఖాన్ దుబాయ్‌లోని ఒక రియల్‌ఎస్టేట్ సంస్థలో ఇంటీరియర్ డిజైన్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి లాటరీ టికెట్లు కొనడం అలవాటు. ఇటీవల యూఏఈ ‘ఫాస్ట్ 5’ పేరిట లాటరీ ప్రకటించింది. అందులో ఆదిల్ ఖాన్ ఓ టికెట్ కొనుగోలు చేశాడు. అంతే అదృష్టం వరించింది. ఆ మెగా ప్రైజ్ మనీ డ్రాలో మొదటి విజేతగా నిలిచాడు. గురువారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నిర్వాహకులు వివరాలు వెల్లడించారు. విజేతకు నెలకు 25,000 దిర్హమ్‌లు (భారత కరెన్నీలో రూ.5,59,822) చొప్పున 25 ఏళ్లపాటు ఇవ్వనున్నారు.
విజేతగా నిలవడంపై ఆదిల్ ఖాన్ ఆనందం వ్యక్తం చేశాడు. డ్రాలో విజేతగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. తన కుటుంబానికి తానే ఏకైక జీవనాధారమని కన్నీళ్లతో చెప్పాడు. కరోనా విజృంభన సమయంలో తన సోదరుడు చనిపోయాడని, అతడి కుటుంబాన్నీ తానే పోషిస్తున్నట్లు వివరించాడు. తనకు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, ఐదేళ్ల పాప ఉందని, ఇలాంటి సమయంలో లాటరీ తగలడం తన అదృష్టమన్నాడు. తాను లాటరీ గెలిచానని ఇంట్లో చెప్పినప్పుడు తన కుటుంబం తొలుత నమ్మలేదన్నాడు. ఆ వార్త నిజమో లేదో తెలుసుకోవడానికి ఒకటికి రెండుసార్లు సరిచూసుకోమని చెప్పారని అన్నారు. ఇప్పటికీ లాటరీ తగిలిన విషయం ఒక కలలా ఉందని, ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నానని ఆనందం వ్యక్తం చేశాడు.
ఎమిరైట్స్ లాటరీ నిర్వహణ సంస్థ టైచెరస్ మార్కెటింగ్ హెడ్ మాట్లాడుతూ..‘ఫాస్ట్ 5’ లక్కీడ్రాను ప్రారంభించిన 8 వారాలలోపే తొలి విజేతను ప్రకటిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. స్వల్ప సమయంలోనే ఓ వ్యక్తి మల్టీ మిలియనీర్ కావడానికి తాము ‘ఫాస్ట్ 5’ను తీసుకొచ్చామని. విజేత ప్రయోజనాలను ఆశించి సొమ్ము మొత్తం ఒకేసారి కాకుండా నెలకోసారి ఇచ్చే ఆలోచన చేశామన్నారు. ఆదిల్ ఖాన్ లాటరీ గెలవడం సంతోషంగా ఉందన్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial