Fake Love Scam in US: అమెరికాలో ఓ ఇండియన్ ఐటీ ఎంప్లాయ్ Fake Love స్కామ్ వలలో చిక్కుకుని రూ.4 కోట్లు పోగొట్టుకున్నాడు. పెన్సిల్వేనియాలోని ఫిలాడెల్ఫియాలో ఉంటున్న శ్రేయా దత్త ఈ స్కామ్‌లో చిక్కుకున్నారు. సేవింగ్స్ ఖాతాలో ఉన్నదంతా ఊడ్చుకుపోయింది. ఈ cryptocurrency romance fraud లో చాలా మంది బాధితులవుతున్నారు. మాయ మాటల్లోకి దింపి ప్రేమిస్తున్నట్టు నటించి చివరకు ఫేక్ ఇన్‌వెస్ట్‌మెంట్ స్కీమ్స్ గురించి చెబుతారు. అందులో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేలా వలలోకి దింపుతారు. శ్రేయా దత్త ఇలాగే మోసపోయింది. Hinge డేటింగ్ యాప్ ద్వారా ఓ వ్యక్తితో శ్రేయా దత్తాకి పరిచయం ఏర్పడింది. ఆ తరవాత ఇద్దరూ వాట్సాప్‌లో ఛాటింగ్ చేసుకున్నారు. ఆ తరవాత ఆ వ్యక్తి హింగే డేటింగ్ యాప్‌లో తన ప్రొఫైల్‌ని డిలీట్ చేశాడు. ఈ లోగా వాట్సాప్‌లో చాలా సార్లు బాధితురాలు తన సెల్ఫీలు పంపింది. కొన్ని సార్లు వీడియో కాల్ కూడా మాట్లాడింది. బాధితురాలికి సంబంధించిన వ్యక్తిగత వివరాలన్నీ నిందితుడు మెసేజ్‌లలోనే రాబట్టాడు.
ఈ సమయంలోనే రిటైర్‌మెంట్ ప్లాన్ అని చెప్పి ఓ ఫేక్ స్కీమ్‌ని సృష్టించాడు. క్రిప్టోకరెన్సీ ఇన్‌వెస్ట్‌మెంట్స్ గురించి చెప్పాడు. అతని మాటలు నమ్మిన శ్రేయా దత్త తన ఫోన్‌లో ఓ క్రిప్టో ట్రేడింగ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసింది. అందులోనే సేవింగ్స్ అకౌంట్‌లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టింది. మొదట్లో బాగానే రిటర్న్స్ వచ్చాయి. ఆ తరవాతే డబ్బులు విత్‌డ్రా చేసుకోడానికి సవాలక్ష పర్మిషన్స్ అడిగింది. ఆ తరవాత బాధితురాలి సోదరుడు ఆ వ్యక్తి గురించి ఆరా తీశాడు. అప్పుడే అసలు విషయమంతా బయటపడింది. అదో ఫేక్ ప్రొఫైల్ అని అర్థమైంది. AI జనరేటెడ్ ప్రొఫైల్‌ని సృష్టించి మోసం చేశాడు. శ్రేయా దత్తాతో పాటు దాదాపు 40 వేల మంది ఇలాగే మోసపోయారని FBI వెల్లడించింది. ఈ క్రిప్టో కరెన్సీ మోసం విలువ 3.5 బిలియన్ డాలర్ల వరకూ ఉందని వివరించారు.
దీన్నే Pig Butchering Scam గా పిలుస్తారు. గతంలోనే చాలా మంది నిపుణులు ఈ స్కామ్ గురించి హెచ్చరించారు. దీని బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా కొన్ని సూచనలు చేశారు. భారత్‌లో ఈ స్కామ్ ద్వారా వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఫేక్ జాబ్ ఆఫర్ స్కామ్స్‌లోనూ చాలా మంది బాధితులవుతున్నారు. క్రిప్టోకరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్స్ కారణంగా నష్టపోతున్నారు. పిగ్ బచరింగ్ అంటే..ఓ వ్యక్తి తనను తాను ఓ ఫ్రెండ్‌లా పరిచయం చేసుకుంటాడు. కాస్త చనువు పెరిగిన తరవాత రకరకాల స్కీమ్స్ పేరు చెప్పి మెల్లగా వలలో పడేస్తారు. ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించి ఇన్వెస్ట్ చేసేలా ప్రోత్సహిస్తారు. ఇలాంటి స్కామ్స్‌లో చిక్కకోకూడదంటే వాట్సాప్‌లో తెలియని నంబర్స్ నుంచి వచ్చే మెసేజ్‌లను పట్టించుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. డేటింగ్ యాప్స్‌తోనూ జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. లింక్స్ ద్వారా యాప్స్‌ని డౌన్‌లోడ్ చేయొద్దని సూచిస్తున్నారు.
Also Read: రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భారతీయుడు మృతి, సెక్యూరిటీ హెల్పర్‌గా వెళ్లి బలి