Poverty In India: భారత్‌లో పేదరికం 5% మేర తగ్గినట్టు నీతి ఆయోగ్ వెల్లడించింది. నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఈ విషయం తెలిపారు. Household Consumption Expenditure Survey (HCES) రిపోర్ట్‌ని వెలువరించారు. 2022 ఆగష్టు నుంచి జులై 2023 వరకూ మధ్య కాలంలో ఈ సర్వే చేపట్టింది నీతి ఆయోగ్. కుటుంబాల ఆదాయాలను పరిగణనలోకి తీసుకుని పేదరిక స్థాయి ఎలా ఉందో అధ్యయనం చేసింది. కొన్నేళ్లుగా పేదరికాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో పరిశీలించింది. ఈ మేరకు డేటాని విడుదల చేసింది. అటు గ్రామాలతో పాటు పట్టణాల్లోనూ ఆదాయం పెరిగిందని స్పష్టం చేసింది. గతంతో పోల్చి చూస్తే...ఆదాయం 2.5 రెట్లు పెరిగిందని తెలిపింది. 2011-12 నుంచి పరిశీలిస్తే...పట్టణాల్లో నెలవారీ సగటు ఖర్చు 33.5% మేర పెరిగిందని వెల్లడించింది. ఇది ప్రస్తుతం రూ.3,510గా ఉందని వివరించింది. ఇదే గ్రామాల్లో చూస్తే..నెలవారీ సగటు ఖర్చు 40.42% మేర పెరిగిందని తెలిపింది. ఇది ప్రస్తుతం రూ.2,008కి చేరుకుందని స్పష్టం చేసింది. ఈ రిపోర్ట్ ఆధారంగానే దేశవ్యాప్తంగా పేదరికం 5% మేర తగ్గిపోయిందని నివేదించింది. ఖర్చులు చేసే విధానం చాలా మారిపోయిందని, ముఖ్యంగా ఆహారం కోసం పెట్టే ఖర్చులు పెరిగాయని వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆహారం కోసం చేసే ఖర్చు 50% మేర పెరిగింది. 2004-05లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చుల విషయంలో చాలా అంతరం ఉండేదని, ఇప్పుడది 91% మేర తగ్గిపోయిందని నీతి ఆయోగ్ రిపోర్ట్ వెల్లడించింది. ప్రాసెస్డ్ ఫుడ్, పండ్లు, పాల వినియోగం విపరీతంగా పెరిగింది. ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌తో పాటు ఉచిత విద్య గురించీ ఇందులో ప్రస్తావించింది.
గతేడాది కూడా రిపోర్ట్..
గతేడాది జులైలోనూ నీతి ఆయోగ్ ఓ నివేదిక వెలువరించింది. ప్రజల ఆస్తులు, బ్యాంకు ఖాతాలతోపాటు వారికి అందుతున్న విద్య, వైద్యం, పోషకాహారం, శిశు మరణాలు, బడికి వెళ్లే పిల్లలు, పాఠశాలల్లో హాజరు, వంటగ్యాస్ వినియోగం, పారిశుద్ధ్యం, విద్యుత్తు సరఫరా తదితర 12 అంశాలనే కొలమానంగా ఈ నివేదికను రూపొందించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆ 12 అంశాలను ఆధారంగా చేసుకొని పరిస్థితులను స్టడీ చేసింది. అక్కడి ప్రభుత్వాలు ఇచ్చిన లెక్కలు ఆధారంగా 2015-16 నుంచి 2019-21 మధ్య పేదరికం భారీగా తగ్గినట్టు చెబుతోంది నీతి ఆయోగ్. అప్పట్లో 24.85 శాతం పేదరికం ఉంటే ఇప్పుడు అది 14.96కి తగ్గినట్టు పేర్కొంది. ఈ రేస్‌లో ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ముందంజలో ఉన్నాయి. నీతి ఆయోగ్ విడుదల చేసిన పేదరికం తగ్గుదల నివేదికలో ఏపీ 13వ స్థానంలో ఉంటే తెలంగాణ 14వ స్థానంలో ఉంది. సగుటున చూసుకుంటే మాత్రం ఏపీ 17వ స్థానంలో ఉంటే తెలంగాణ 14వ స్థానంలోనే కొనసాగుతోంది. ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో 5.71 శాతం పేదరికం తగ్గింది. తెలంగాణలో 7.30 శాతం మంది విముక్తి పొందారు. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో గత ఐదేళ్లలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొంది. ఈ ఘనతను 2016-21 మధ్య కాలంలో సాధించినట్లు నీతి ఆయోగ్ తెలిపింది.
Also Read: జ్ఞానవాపి మసీదు కేసులో మరో కీలక మలుపు, హిందువుల పూజలకు లైన్ క్లియర్