Indian Killed in Russia: రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భారతీయులూ పోరాటం చేస్తున్నారన్న వార్తలు ఇప్పటికే సంచలనం సృష్టించాయి. ఈ క్రమంలోనే ఓ 23 ఏళ్ల భారతీయ యువకుడు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడని అక్కడి మీడియా వెల్లడించడం మరింత సంచలనమైంది. గుజరాత్‌కి చెందిన ఈ యువకుడు ఉక్రెయిన్‌ ఎయిర్‌ స్ట్రైక్‌లో మృతి చెందాడు. ఫిబ్రవరి 21న ఈ ఘటన జరిగింది. మృతుడి పేరు హెమిల్ అశ్విన్‌భాయ్ మంగుకియా (Hemil Ashvinbhai Mangukiya)గా గుర్తించారు. సూరత్‌కి చెందిన హెమిల్‌ని రష్యా ఆర్మీ సెక్యూరిటీ హెల్పర్‌గా రిక్రూట్ చేసుకుంది. గతేడాది డిసెంబర్ నుంచి రష్యాలోనే ఉంటున్నాడు. అయితే..ఈ ఘటనపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హెమిల్‌ని భారత్‌కి సురక్షితంగా తీసుకురావాలంటూ గతంలోనే అతని తండ్రి తరపున ఓ వ్యక్తి ఇండియన్ కాన్సులేట్‌కి లేఖ రాశారు. ఈ క్రమంలోనే హెమిల్ చనిపోయాడన్న వార్త తెలియడం అలజడి రేపింది. వారం రోజుల క్రితమే ఓ రిపోర్ట్‌ వెలుగు చూసింది. దాదాపు 100 మంది భారతీయుల్ని రష్యా ఆర్మీ సెక్యూరిటీ హెల్పర్‌లుగా నియమించుకుందని వెల్లడించింది. వాళ్లలో కొంత మందితో బలవంతంగా యుద్ధం చేయిస్తున్నారని తేలింది. వార్‌జోన్‌కి పంపం అని చెప్పి ఆ తరవాత వాళ్లను బలవంతంగా యుద్ధంలోకి పంపుతున్నారని తేల్చి చెప్పింది. కర్ణాటకలోని గుల్బర్గాకి చెందిన మరో సెక్యూరిటీ హెల్పర్ హెమిల్ ఎలా చనిపోయాడో వివరించాడు. ఉక్రెయిన్‌ మిజైల్స్‌తో దాడి చేసిందని ఆ సమయంలోనే ఓ చోట్ హెమిల్ ఇరుక్కుపోయాడని చెప్పాడు. ఆ దాడిలోనే చనిపోయినట్టు తెలిపాడు. 


"డ్రోన్ మాపైకి దూసుకొచ్చింది. దానిపై ఎదురు దాడి చేసేందుకు ప్రయత్నించాం. కానీ అది సాధ్యం కాలేదు. ఈ లోగా ఆ డ్రోన్‌ దాడి చేసింది. ఈ తీవ్రతకు హెమిల్ చనిపోయాడు. మరి కొందరు రష్యన్ సైనికులు గాయపడ్డారు. హెమిల్ డెడ్‌బాడీని నేనే ట్రక్‌లోకి ఎక్కించాను"


- ప్రత్యక్ష సాక్షి