Killing Daughter-In-Law In US: 


విడాకుల విషయమై గొడవ..? 


అమెరికాలో గన్ కల్చర్‌ హింసను విపరీతంగా పెంచేస్తోంది. చిన్న చిన్న గొడవలకీ తుపాకీ చూపించి బెదిరించడం, విచక్షణ కోల్పోయి చంపేయటం లాంటి ఘటనలు అక్కడ ఎక్కువగా జరుగుతున్నాయి. కాలిఫోర్నియాలో ఇలాంటి దారుణమే జరిగింది. తన కొడుకుతో విడాకులు తీసుకుంటానని కోడలు చెప్పిన మరుక్షణమే గన్‌తో కాల్చి చంపాడు భారత సంతతికి చెందిన ఓ 74 ఏళ్ల వ్యక్తి. ఇంట్లోని పార్కింగ్‌ ఏరియాలో వాగ్వాదం జరగ్గా...విడాకులపై కోడలు మాట వినకపోవడంపై ఆవేశానికి లోనైన వృద్ధుడు ఆమెను హత్య చేశాడు. నిందితుడు సీతల్ సింగ్ దొసంజ్‌గా గుర్తించిన పోలీసులు...మృతురాలి పేరు గురుప్రీత్ కౌర్‌గా నిర్ధరించారు. సౌత్ సాన్‌జోస్ ప్రాంతంలో వాల్‌మార్ట్‌లో పని చేస్తోందు గురుప్రీత్ కౌర్. అక్కడే పార్కింగ్ ఏరియాలో హత్యకు గురైంది. పోలీసులు విచారణ చేపట్టగా పలు వివరాలు బయటకు వచ్చాయి. సీతల్ సింగ్‌ తన కోసం వెతుకుతున్నాడని...గురుప్రీత్‌ కౌర్‌ తన బంధువులతో ఫోన్‌కాల్ మాట్లాడినట్టు తేలింది. తనకు ప్రాణహాని ఉందనీ ఆమె భయపడింది. పార్కింగ్‌ లాట్‌లో సీతల్ డ్రైవ్ చేస్తున్నట్టు గుర్తించానని, కేవలం తనను పట్టుకునేందుకే ఆయన 150 మైళ్లు ప్రయాణం చేసి వచ్చాడనీ కాల్‌లో చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. "గురుప్రీత్ బాగా వణుకుతూ మాట్లాడింది. తన మాటల్లో భయం వినిపించింది. సీతల్ తన దగ్గరకు వస్తున్న సమయంలో ఆమె ఎంతో ఆందోళనకు గురైంది" అని మృతురాలి మేనమామ వివరించారు. ఉన్నట్టుండి కాల్ కట్ అయిందని చెప్పారు. 5 గంటల తరవాత వాల్‌మార్ట్ యాజమాన్యం గురుప్రీత్‌ కౌర్ డెడ్‌బాడీని కనుగొన్నట్టు వార్త వచ్చిందని తెలిపారు. ఆమెను కార్‌లోనే హత్య చేసినట్టు పోలీసులు నిర్ధరించారు. ఆమె శరీరంలో రెండు బులెట్లు ఉన్నాయి. 


పోలీసుల విచారణ..


నిందితుడి కొడుకు, మృతురాలు గురుప్రీత్ భార్యాభర్తలు. అయితే...ఈ మధ్యే ఆమె విడాకుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. వాల్‌ మార్ట్‌లో పని చేసుకుంటూ వేరుగా ఉంటోంది. విడాకుల విషయంలోనే కోడలితో వాగ్వాదం జరిగి ఉండొచ్చని, ఆమె మాటవినకపోవటం వల్ల చంపేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణ కొనసాగిస్తున్నారు. ఈ హత్య జరిగిన మరుసటి రోజే నిందితుడిని అరెస్ట్ చేశారు. గన్ సీజ్ చేశారు. సాన్‌జోస్‌లోని జైల్‌కు తరలించారు.


కాలిఫోర్నియాలోనే మరో ఘటన..


కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన ఒకే సిక్కు కుటుంబంలోని నలుగురు వ్యక్తులు మూడ్రోజుల కింద కిడ్నాప్ అయ్యారు. వీరిలో 8 నెలల చిన్నారి కూడా ఉంది. ఈ కేసుని ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగానే షాకింగ్ న్యూస్ తెలిసింది. ఓ తోటలో వీరి నలుగురు డెడ్‌బాడీలు కనిపించాయి. ఈ మృతదేహాలు 8 నెలల అరూహి దేరి, 27 ఏళ్ల జస్లీన్ కౌర్, 36 ఏళ్ల జస్‌దీప్ సింగ్, 39 ఏళ్ల అమన్‌దీప్ సింగ్‌విగా గుర్తించారు. మెర్సెడ్‌ సిటీలోని 800 బ్లాక్ సౌత్ హైవే 59 లో నివాసం ఉంటున్నారు..ఈ నలుగురు. వీళ్లను ఓ వ్యక్తి బలవంతంగా గన్‌తో బెదిరించి కిడ్నాప్ చేశాడు. ఇప్పుడు వాళ్లందరి శవాలు కనిపించిన నేపథ్యంలో...ఆ కిడ్నాప్ చేసిన వ్యక్తే హత్య చేశాడా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అసలు వీరిని ఎందుకు కిడ్నాప్ చేశాడన్నదీ తేలాల్సి ఉంది. 


Also Read: Nobel Prize Facts: నోబెల్‌ శాంతి బహుమతికి గాంధీ ఎన్నిసార్లు నామినేట్‌ అయ్యారు? ఎక్కువసార్లు అందుకున్నదెవరు?