Munugode By Election TRS Candidate: మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించిన అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనే సస్పెన్స్ ఎట్టకేలకు వీడింది. మునుగోడు బై ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీ, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఉద్యమకారుడుగా పార్టీ ఆవిర్భావ కాలం నుంచీ కొనసాగుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దింపాలని స్థానిక నేతలు, కార్యకర్తలు కోరుకుంటున్నారని.. నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, సర్వే రిపోర్టలను పరిశీలించిన తరువాత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును ఖరారు చేసినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.


కీలక పార్టీల అభ్యర్థులు వీరే.. 
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంలో మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి సైతం తప్పుకున్న రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తననే మళ్లీ గెలిపిస్తారని, బీజేపీ నేత ధీమాగా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పాల్వాయి స్రవంతిని తమ అభ్యర్థిగా కొన్ని రోజుల కిందట ప్రకటించింది. టీఆర్ఎస్ పార్టీ (బీఆర్ఎస్) అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో తమ పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఖరారు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తన నిర్ణయాన్ని ప్రకటిస్తూనే, ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు తమ వెంటే ఉన్నారని, విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. అందులోనూ గులాబీ పార్టీ బీఆర్ఎస్ గా జాతీయ పార్టీగా మారింది. 






ఇటీవల షెడ్యూల్ విడుదల.. నేడు నోటిఫికేషన్ 
మునుగోడు నియోజకవర్గానికి ఉపఎన్నిక షెడ్యూల్ సోమవారం విడుదల అయింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబరు 7 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. నవంబర్ 3 న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబరు 6 న కౌంటింగ్ ఉండనుంది. మునుగోడుతో పాటు దేశంలో ఖాళీ అయిన స్థానాల్లో ఇదే తేదీల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్, బిహార్ లోని మోకమా, గోపల్ గంజ్, హరియాణాలోని ఆదమ్ పూర్, తెలంగాణలోని మునుగోడు, ఉత్తర్ ప్రదేశ్ లోని గోలా గోక్రన్నథ్, ఒడిశాలోని ధామ్ నగర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. 


మునుగోడు బైపోల్ ముఖ్యమైన తేదీలివే
ఉప ఎన్నిక గెజిట్ నోటిఫికేషన్ - అక్టోబరు 7, 2022
నామినేషన్లకు ఆఖరి తేదీ - అక్టోబరు 14, 2022
నామినేషన్ల పరిశీలన - అక్టోబరు 15, 2022
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ - అక్టోబరు 17, 2022
పోలింగ్ తేదీ - నవంబరు 3, 2022
కౌంటింగ్ తేదీ - నవంబరు 6, 2022