తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగనున్న మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికపై అన్ని పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. ఎలాగైనా ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించి, అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని అన్ని పార్టీల నేతలు భావిస్తున్నారు. నేటి (అక్టోబర్ 7) నుంచి మునుగోడు ఉప ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. మునుగోడు ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. శుక్రవారం నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో నేటి ఉదయం ఎన్నికల అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.


ఇటీవల షెడ్యూల్ విడుదల.. నేడు నోటిఫికేషన్ 
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మునుగోడు నియోజకవర్గానికి ఉపఎన్నిక షెడ్యూల్ సోమవారం విడుదల అయింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబరు 7 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. నవంబర్ 3 న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబరు 6 న కౌంటింగ్ ఉండనుంది. మునుగోడుతో పాటు దేశంలో ఖాళీ అయిన స్థానాల్లో ఇదే తేదీల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్, బిహార్ లోని మోకమా, గోపల్ గంజ్, హరియాణాలోని ఆదమ్ పూర్, తెలంగాణలోని మునుగోడు, ఉత్తర్ ప్రదేశ్ లోని గోలా గోక్రన్నథ్, ఒడిశాలోని ధామ్ నగర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. 


గురువారం అధికారులు సమావేశం.. ఎన్నికల నిర్వహణపై చర్చ 
మునుగోడు ఉప ఎన్నికలకు ఇటీవల షెడ్యూల్ విడుదల కావడంతో నల్గొండ కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అధికారులు గురువారం సమావేశమయ్యారు రిటర్నింగ్‌ అధికారిగా స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ జగన్నాథరావును నియమించారు. చండూరు తహసీల్దారు కార్యాలయంలో అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుంది. పోటీ చేయనున్న అభ్యర్థులు సందేహాలకు సమాధానాలు తెలుసుకునేందుకు అక్కడ హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటుచేశామని అధికారులు తెలిపారు. 2018లో జరిగిన మునుగోడు ఎన్నికకు 33 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన అనంతరం 15 మంది పోటీలో మిగిలారు. కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు.


కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంలో మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి సైతం తప్పుకున్న రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తననే మళ్లీ గెలిపిస్తారని, ఆయన ధీమాగా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పాల్వాయి స్రవంతిని తమ అభ్యర్థిగా కొన్ని రోజుల కిందట ప్రకటించింది. టీఆర్ఎస్ పార్టీ (బీఆర్ఎస్) అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది. అందులోనూ గులాబీ పార్టీ బీఆర్ఎస్ గా జాతీయ పార్టీగా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇందుకు ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది.


మునుగోడు బైపోల్ ముఖ్యమైన తేదీలివే
ఉప ఎన్నిక గెజిట్ నోటిఫికేషన్ - అక్టోబరు 7, 2022
నామినేషన్లకు ఆఖరి తేదీ - అక్టోబరు 14, 2022
నామినేషన్ల పరిశీలన - అక్టోబరు 15, 2022
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ - అక్టోబరు 17, 2022
పోలింగ్ తేదీ - నవంబరు 3, 2022
కౌంటింగ్ తేదీ - నవంబరు 6, 2022