Munugode By Election notification: ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు ఉపఎన్నిక (Munugode By Elections) కు నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. మునుగోడు ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలకు ముందే నగదు లభ్యమైంది. నామినేషన్ల మొదటి రోజే మునుగోడు నియోజకవర్గంతో పాటు హైదరాబాద్ లోనూ భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. జూబ్లీహిల్స్ లో 50 లక్షల రూపాయలు కారులో తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. ఈ నగదుకు ఎన్నికల ప్రచారానికి సంబంధం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
నామినేషన్ల తొలిరోజే పట్టుబడుతున్న డబ్బు
నేటి నుంచి మునుగోడు ఉప ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. ఈ క్రమంలో పోలీసులు నిఘా పెంచారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపించినా, ఎక్కువ మొత్తంలో డబ్బు సరఫరా చేస్తున్నారా అనేదానిపై పోలీసుల నిఘా పెంచారు. ఈ క్రమంలో మునుగోడు మండలం గూడపూర్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు రూ.13 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. గూడపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ వ్యక్తి వద్ద నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనుమానించి వ్యక్తి వద్ద చెక్ చేయగా పెద్ద మొత్తంలో నగదు లభ్యమైంది. నగదుకు సంబంధించిన పత్రాలకు చూపించాలని అధికారులు ప్రశ్నించగా, ఆ వ్యక్తి అందుకు ఆధారాలు చూపించకపోవడంతో నగదును అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో సైతం కారులో దాదాపు అరకోటి రూపాయలు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిఘా పెంచిన పోలీసులు, అధికారులు..
నేటి నుంచి మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్లు మొదలుకానున్నాయని అధికారులు, పోలీసులు నిఘా పెంచారు. పెద్ద మొత్తం నగదు లావాదేవీలు గానీ, నగదు సరఫరాపై ఫోకస్ చేశారు. అనుమానంగా కనిపిస్తున్న వారిని అదుపుతోకి తీసుకుని వారి వద్ద ఉన్న నగదుపై ఆరా తీస్తున్నారు.
ఇటీవల షెడ్యూల్ విడుదల.. నేడు నోటిఫికేషన్
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మునుగోడు నియోజకవర్గానికి ఉపఎన్నిక షెడ్యూల్ సోమవారం విడుదల అయింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబరు 7 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. నవంబర్ 3 న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబరు 6 న కౌంటింగ్ ఉండనుంది. మునుగోడుతో పాటు దేశంలో ఖాళీ అయిన స్థానాల్లో ఇదే తేదీల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్, బిహార్ లోని మోకమా, గోపల్ గంజ్, హరియాణాలోని ఆదమ్ పూర్, తెలంగాణలోని మునుగోడు, ఉత్తర్ ప్రదేశ్ లోని గోలా గోక్రన్నథ్, ఒడిశాలోని ధామ్ నగర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంలో మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి సైతం తప్పుకున్న రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తననే మళ్లీ గెలిపిస్తారని, ఆయన ధీమాగా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పాల్వాయి స్రవంతిని తమ అభ్యర్థిగా కొన్ని రోజుల కిందట ప్రకటించింది. టీఆర్ఎస్ పార్టీ (బీఆర్ఎస్) అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది. అందులోనూ గులాబీ పార్టీ బీఆర్ఎస్ గా జాతీయ పార్టీగా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇందుకు ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది.