Woman Murdered: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీలో దారుణం జరిగింది. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఇంట్లోకి చొరబడ్డ గుర్తు తెలియని వ్యక్తులు మహిళను దారుణంగా హత్య చేశారు. 20 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన గుజ్జుల సులోచన(45) భర్త చనిపోవడంతో తల్లి కొమ్మెర బాలవ్వ(75)తో కలిసి ఉంటోంది. అయితే రోజూ లాగే నిన్న రాత్రి కూడా తల్లీబిడ్డలిద్దరూ అన్నం తిని పడుకున్నారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబ్డడారు. కత్తులతో మహిళల ఇద్దరిపై దాడి చేశారు. దీంతో సులోచన అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె తల్లి కొమ్మెర బాలవ్వకు తీవ్ర గాయాలు అయ్యాయి. గట్టిగా అరిచని శబ్దాలు వస్తుండటంతో స్థానికులు బయటకు వచ్చి చూశారు. 


అది గమనించిన నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు ఇంట్లోకి వచ్చే సరికి సులోచన రక్తపు మడుగులో పడి చనిపోయి కనిపించింది. ఆమె తల్లి బాలవ్వ తీవ్ర గాయాలతో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అలాగే అంబులెన్స్ ద్వారా బాలవ్వను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్య ఎలా జరిగిందనే విషయంపై స్థానిక ప్రజలను ఆరా తీశారు. పోస్టుమార్టం నిమిత్తం సులోచన మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


ఇటీవలే సిద్దిపేటలో బతుకమ్మ ఆడుతున్న మహిళ హత్య


సిద్దిపేట జిల్లా వీరాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మామిడి ఎల్లమ్మ, గోపాల్ రెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉండగా... పెద్ద కూతురు మంగను స్థానికుడు అయిన యాళ్ల ఎల్లారెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే పెళ్లి జరిగిన నెల రోజులకే మంగ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని చనిపోయింది. దీంతో తమ రెండో కమార్తె స్వప్నను ఇచ్చి పెళ్లి జరిపించారు. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు (కుమార్తె, కుమారుడు) కూడా పుట్టారు. అయితే ఆరేళ్ల పాటు హాయిగా సాగిన వీరి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. రోజురోజుకీ భార్యాభర్తల మధ్య గడవలు ఎక్కువ అవడంతో భర్తకు దూరంగా వచ్చి ఉంటోంది. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తితో స్నేహం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీయడంతో.. అతడితో కలిసి 14 ఏళ్లుగా సహజీవనం చేస్తోంది.


బతుకమ్మ ఆడుకుంటుండగా వచ్చి హత్య..


అయితే తనతో విడిపోయిన భార్య మరో వ్యక్తితో సహజీవనం చేయడం, జీవితాన్ని హాయిగా గడపడాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే చాలా సార్లు ఆమెను చంపేస్తానంటూ బెదిరించాడు. గొడవలకు కూడా దిగాడు. అయితే బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామంలోని మహిళలంతా ఒక్కచోట చేరి బతుకమ్మ ఆడుకుంటున్నారు. స్వప్న కూడా వెళ్లి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుకుంటోంది. విషయం గుర్తించిన భర్త ఎల్లారెడ్డి.. ఆమెను అంతమొందించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా వెళ్లి ఇనుప రాడ్డు తీసుకొని వచ్చి ఆమె తలపై గట్టిగా బాదాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. స్వప్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.