YSRCP Comments on KCR: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రతిపక్ష పార్టీల మాదిరిగానే బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీగానే ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రస్తుతం అధికార పార్టీపై ప్రతిపక్షాల ప్రభావం ఎలా ఉందో, బీఆర్ఎస్ అలానే ఉందని వివరించారు. జాతీయ స్థాయిలో ఇప్పుడు ఉన్న పార్టీల్లో ఐదో ప్లస్ వన్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. అలాగే రాజకీయాల్లో పోటీ ఉంటేనే బాగుంటుంది మంత్రి తెలిపారు. విశాఖకు ఏ రోజైనా, రాజధానిని తీసుకొస్తామని మంత్రి బొత్స వెల్లడించారు. అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకుంటామని తామెప్పుడూ చెప్పలేదని అలాంటి ప్రయత్నాలు కూడా చేయలేదని వివరించారు. చంద్రబాబు హయాంలో మంత్రులుగా ఉన్న అశకో గజపతి రాజు, కళా వెంకటరావు ఉత్తరాంధ్రకు ఏం చేశారని ప్రశ్నించారు.
కేంద్రం, రాష్ట్రంలోనూ మంత్రిగా వ్యవహరించిన అశోక్ గజపతి రాజు చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లలో తోటపల్లి ప్రాజెక్టుకు పిల్ల కాలువలు తవ్వించలేకపోయారని ఎద్దేవా చేశారు. కనీసం విజయ నగరంలో రోడ్ల విస్తరణకూడా చేయకపోవడం దౌర్భాగ్యమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
కొత్త పార్టీ రావడాన్ని స్వాగతిస్తున్నాం - సజ్జల
ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. కొత్త పార్టీల వల్ల పోటీ పెరిగి తమ పనితీరును మరింత మెరుగు పడుతుందన్నారు. ప్రజల అభ్యున్నతికి విధానపరమైన అంశాలతో పార్టీలు వస్తే మంచిదే అన్నారు. తమది రాజకీయం కోసం రాజకీయ ఎత్తుగడలు వేసే పార్టీ కాదన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రతి అంశాన్ని పారదర్శకంగా చేస్తుందన్నారు. అందుకే ప్రజలు తమను సొంతం చేసుకున్నారని సజ్జల తెలిపారు. తమ అంతిమ నిర్ణేతలు ప్రజలే అన్నారు. తెలంగాణ నేతలు ఏపీ గురించి మాట్లాడటంతోనే అలా స్పందించాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. తాము ఇక్కడి వ్యవహారాలకు మాత్రమే కట్టుబడి ఉన్నామన్నారు. తాము ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదన్నారు. అందరూ బాగుండాలనేదే వైసీపీ సిద్ధాంతమని స్పష్టం చేశారు. అమరావతి ఉద్యమం పేరుతో దుష్ప్రచరం చేస్తున్నారని విమర్శలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ విధానాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
కేసీఆర్ కు ఏమాత్రం నిజాయతీ లేదు..
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టారేమో కానీ.. ఆయనలో జాతీయత, నిజాయతీ ఏమాత్రం లేవంటూ టీడీపీ ఎమ్మెల్సీ పి. అశోక్ బాబు వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రాన్ని విడదీసి, ఆర్థింగా దెబ్బతీయడమే కాక, నవ్యాంధ్రను ద్వితీయ శ్రేణి రాష్ట్రం అన్నారని, అందుకే ఏపీ ప్రజలు ఎవరూ సీఎం కేసీఆర్ ను గౌరవించరన్నారు. ఉడతకు పులి అని పేరు పెడితే అది పులి అయిపోదంటూ కామెంట్లు చేశారు. జాతీయ పార్టీగా మారే అకాశం ఉన్నంత మాత్రాన అది జాతీయ పార్టీ కాదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ లో జాతీయ వాదం ఉందో, లేదో కానీ.. నిజాయతీ మాత్రం లేదంటూ కామెంట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీని ఆయన మోసం చేయడం ద్వారానే రుజువైందన్నారు.
తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని చెప్పి కుటుంబ సభ్యులతో కలిసి సోనియా గాంధీతో ఫొటో దిగి బయటకు వచ్చి ఏం చేశారో అందరికీ తెలుసని ఎమ్మెల్సీ అశోక్ బాబు వ్యాఖ్యానించారు. తెలంగాణ వస్తే దళితులను సీఎం చేస్తానన్న కేసీఆర్ తానే సీఎం అవ్వలేదా అని ప్రశ్నించారు. కుమార స్వామి సహా ఏ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ లో విలీనం అవ్వడానికి అంగీకరించనప్పుడు అది జాతీయ పార్టీ ఎలా అవుతుందన్నారు. కొత్త పార్టీలు కలిస్తేనే ప్రాధాన్యం ఉంటుందన్నారు. అది బీఆర్ఎస్ ఆవిర్భావంలో కనిపించలేదని విమర్శించారు.