Karnataka: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప పై లైంగిక వేధింపుల కేసులో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ (సీఐడీ) విచారణ నిర్వహిస్తోంది. ఇప్పుడు యడ్యూరప్ప తన ముగ్గురు సహచరులతో కలిసి నోరు మెదపకుండా ఉండడానికి బాధితురాలికి, ఆమె తల్లికి డబ్బు ఇచ్చారని ఆరోపించింది. యడ్యూరప్ప అతని సహచరులు అరుణ్, రుద్రేష్‌లపై ఇండియన్ పీనల్ కోడ్ లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. యడ్యూరప్ప వేధింపుల‌కు చెందిన 750 పేజీల ఛార్జ్‌షీట్‌ను సీఐడీ గురువారం రిలీజ్‌ చేసింది. 


సీఐడీ తన ఛార్జ్ షీట్‌లో ఏం పేర్కొంది ?
ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఉదయం 11.15 గంటల ప్రాంతంలో 17 ఏళ్ల బాలిక ఆమె తల్లి డాలర్‌ కాలనీలోని యడ్యూరప్ప నివాసానికి చేరుకున్నారని సీఐడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ పేర్కొంది. 17 ఏళ్ల బాలికపై యడియూరప్ప లైంగిక దాడికి పాల్పడినట్లు సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఆరోపణలు వచ్చాయి. ఓ మోసం కేసులో సాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె తల్లి  యడియూరప్పను ఫిబ్రవరి 2న కలిశారు. ఆ సమయంలో యడ్యూరప్ప తల్లితో మాట్లాడుతూనే బాలిక చేయి పట్టుకున్నాడని సీబీఐ తన చార్జ్ షీట్లో పేర్కొంది.  ఆ త‌ర్వాత మైన‌ర్ అమ్మాయిని మ‌రో రూంలోకి పిలిపించి గ‌తంలో జ‌రిగిన లైంగిక వేధింపుల ఘ‌ట‌న గురించి అడిగిన‌ట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలోనే బాలిక పై లైగింక వేధింపులకు ప్రయత్నించినట్లు సీబీఐ తన చార్జీ షీట్లో పేర్కొంది.


 ఎవరితో చెప్పొద్దని డబ్బులిచ్చారు
దీని తర్వాత భయపడిన బాధితురాలు యడ్యూరప్పను తలుపులు తీయమని ప్రాధేయపడిందని  సీబీఐ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ఆ తర్వాత యడ్యూరప్ప తలుపు తెరిచి తన జేబులోంచి కొంత డబ్బు తీసి బాధితురాలి చేతిలో పెట్టారు. ఈ విషయంలో కుటుంబానికి సాయం చేయలేనని యడ్యూరప్ప చెప్పారని సీఐడీ పేర్కొంది. ఆ తర్వాత జేబులోంచి మరికొంత డబ్బు తీసి బాధితురాలి తల్లి చేతిలో పెట్టారు యడ్యూరప్ప. ఫిబ్రవరి 20న బాధితురాలి తల్లి ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ తర్వాత కేసుకు సంబంధించిన ఇతర నిందితులు అరుణ్, రుద్రేష్, మరిస్వామిలు బాధితురాలి నివాసానికి చేరుకుని ఆమెను యడ్యూరప్ప ఇంటికి తీసుకొచ్చారు. అరుణ్ బాధితురాలి తల్లిని ఫేస్‌బుక్, ఫోన్ నుండి వీడియోను తొలగించమని కోరాడు. అందుకోసమని యడ్యూరప్ప ఆదేశాల మేరకు రుద్రేష్ బాధితురాలికి రూ. రెండు లక్షల నగదు ఇచ్చాడు.


బాధితురాలి తల్లి మృతి  
జూన్ 13న బెంగళూరు కోర్టు యడ్యూరప్పపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆ తర్వాత జూన్ 14న యడ్యూరప్ప అరెస్టుపై కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. అలాగే యడ్యూరప్పను కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. బాధితురాలి తల్లి క్యాన్సర్‌తో బాధపడుతూ గత నెలలో మృతి చెందింది. ఇప్పుడు జూన్‌లో బాధితురాలి సోదరుడు తనకు న్యాయం చేయాలంటూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో యడ్యూరప్పను అరెస్ట్ చేయాలని పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు. మరోవైపు యడ్యూరప్ప కూడా తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరిస్తూ కోర్టులో పిటిషన్ వేశారు.