Wrestlers' Sexual Harassment Case: 



బెయిల్ ఇచ్చిన ఢిల్లీ కోర్టు 


రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్‌ బ్రిజ్ భూషణ్ సింగ్‌కి ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆయనతో పాటు ఫెడరేషన్ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్ సింగ్‌కి కూడా బెయిల్ లభించింది. మహిళా రెజ్లర్లు పెట్టిన లైంగిక ఆరోపణల కేసులో వీరికి బెయిల్ దొరికింది. పర్సనల్ బాండ్ కింద రూ.25వేలు కట్టాలని కోర్టు ఆదేశించింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ పోలీసుల తరపున వాదించిన లాయర్...బెయిల్‌ని తాను సమర్థించడం లేదని, అలాగని వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు. చట్టప్రకారం ఏ నిర్ణయం తీసుకున్నా సమ్మతమే అని తెలిపారు. అయితే...అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ మాత్రం దీనిపై అసహనం వ్యక్తం చేశారు. బ్రిజ్ భూషణ్‌కి బెయిల్‌ మంజూరు చేసే క్రమంలో కొన్ని కండీషన్స్ పెట్టాలని కోరారు. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని అన్నారు. గత వారమే ఢిల్లీకోర్టు బ్రిజ్ భూషణ్‌తో పాటు తోమర్ సింగ్‌కి రెండ్రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బ్రిజ్ భూషణ్‌పై ఏడుగురు మహిలా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దాదాపు నెల రోజుల పాటు ఆందోళనలు చేపట్టారు. విచారణ చేపట్టిన పోలీసులు బ్రిజ్ భూషణ్‌పై సెక్షన్స్  కింద 354, 354A, 354D కింద కేసులు నమోదు చేశారు. వేధింపులు ఎదుర్కొన్న వారిలో ఓ మైనర్ రెజ్లర్ కూడా ఉండడం వల్ల పోక్సో కేసు నమోదు చేశారు. అయితే ఆ తరవత ఆ మైనర్ రెజ్లర్ తన స్టేట్‌మెంట్‌ని వెనక్కి తీసుకుంది. ఫలితంగా ఆ కేసు కొట్టేయాల్సి వచ్చింది.